వృథా భూముల్లో అమృత సాగు | Custard apple cultivation In the waste lands | Sakshi
Sakshi News home page

వృథా భూముల్లో అమృత సాగు

Published Thu, Oct 30 2014 3:58 AM | Last Updated on Sat, Sep 2 2017 3:34 PM

వృథా భూముల్లో అమృత  సాగు

వృథా భూముల్లో అమృత సాగు

వృథా భూములు, రాతినేలలు కలిగి ఉన్న వారికి దిగులు అవసరం లేదు. ఆ భూముల్లోనూ తోటలు పెంచుకోవచ్చని అంటున్నారు ఉద్యాన అధికారులు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడినిచ్చే సీతాఫలాన్ని సాగు చేసుకోచ్చని సూచిస్తున్నారు. అడవులు, రాతి గుట్టల్లోనే కాకుండా పొలాల్లో అంతర పంటగా కూడా వేసుకోచ్చని చెబుతున్నారు. ఏ పంటకూ అనువుగాని భూముల్లో సీతాఫలాన్ని సాగు చేయొచ్చని ఉద్యాన శాఖ అధికారులు తెలుపుతున్నారు. సీతాఫలం పంట, రకాలు, నాటే పద్ధతులు, నీటి, ఎరువుల యాజమాన్యం తదితర అంశాలపై ఉద్యాన శాఖ సహాయ సంచాలకుడు-2  కె.సూర్యనారాయణ (87344 49066) వివరించారు. -ఖమ్మం వ్యవసాయం
 
ఏ పంటకూ అనువుగాని నేలల్లోనూ సీతాఫలం
సీతాఫలంలో పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్స్), విటమిన్ సీ, విటమిన్ ఏ ఉండటం వల్ల పలు రకాల పాల సంబంధిత పదార్థాల తయారీలో ఉపయోగపడుతుంది. అనోనైన్ అనే పదార్థం ఆకులు, గింజలు, ఇతర భాగాల్లో ఉండటం వల్ల చేదుగుణం కలిగి పశువులు, మేకలు తినవు. సీతాఫలం రసాన్ని కీటకనాశినిగా వాడొచ్చు. గింజల నుంచి నూనె తీయొచ్చు. దీనిని పెయింట్, సబ్బు పరిశ్రమల్లో వాడతారు.
 
వాతావరణం
సీతాఫలం ఉష్ణ మండల పంట. ఎక్కువ చలి, మంచును తట్టుకోలేదు. అధిక వర్షపాతాన్ని, వర్షాభావ పరిస్థితులను తట్టుకోలేదు. పుష్పించే దశలో పొడి వాతావరణం, కాయ దశలో అధిక తేమ, వర్షపాతం (50 నుంచి 75 సెంటీ మీటర్లు) అనుకూలం. అధిక చలి ఉంటే కాయలు పండుబారాక గట్టిగా, నల్లగా మారతాయి. ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ అయితే పూత రాలిపోతుంది.
 
నేలలు
చౌడు, క్షార  తప్ప మిగతా అన్ని రకాల నేలల్లోనూ సీతాఫలం తోటలు పెంచుకోవచ్చు. నీరు నిలవని గరప నేలలు, ఎర్రనేల లు శ్రేష్టం. రాళ్లతో ఉన్న నేలల్లో కూడా సాగు చేయొచ్చు. మురుగునీరు పోయే సదుపాయం కలిగి 5.5-7.5 ఉదజని సూచిక గల నేలలు అనుకూలం.
 
రకాలు
బాలానగర్: కాయలు పిరమిడ్ ఆకారంలో పెద్ద సైజులో పెద్ద కళ్లతో ఉంటాయి. కళ్ల మధ్య లేత పసుపురంగు నుంచి నారింజరంగులో చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి. మధురమైన రుచి, 27శాతం చక్కెర కలిగి, 200-260 గ్రాముల సగటు బరువుతో ఉంటాయి.

అతిమాయ: కాయలపై చర్మం నునుపుగా ఉండి తక్కువ గింజలు కలిగి తీపి పులుపు కలిగిన ప్రత్యేకమైన గుజ్జు ఉంటుంది. ఈ చెట్లలో పరాగ సంపర్కానికి ప్రతి 20 చెట్లకు ఒకదానిని నాటాలి.

అర్కనహాన్: ఇది హైబ్రిడ్ రకం. ఐఐహెచ్‌ఆర్ బెంగళూరు వారు రూపొందించారు. ఐలాండ్, జమ్ మమ్మిత్ రకాలను సంకరపరచి దీనిని రూపొందించారు. కాయలు గుండ్రంగా చర్మంగా కళ్లు ప్రస్ఫుటంగా లేకుండా నునుపుగా ఉంటాయి. గుజ్జు అత్యంత తియ్యగా, గింజలు చాలా తక్కువగా ఉంటాయి.

పింక్స్‌మమ్మిత్: ఇది ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకున్న రకం. కాయలు పెద్దగా అండాకారంలో ఉండి చర్మం ఆకుపచ్చ మీద పింక్ రంగు కలిగి ఉంటుంది. గుజ్జు తక్కువగా ఉంటుంది.

ఐలాండ్‌జెను: ఇది కూడా ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకున్న రకమే. కాయలు మంచి నాణ్యత కలిగి పెద్దగా నునుపైన చర్మం కలిగి ఉంటాయి.
 
నాటే పద్ధతి
పొలం బాగా దుక్కి చేసిన తర్వాత 60ఁ60ఁ60 సెంటీమీటర్ల గుంతలను 5ఁ5 మిల్లీమీటర్లు లేదా 6ఁ6 మిల్లీమీటర్లు ఎడంగా తీసి గుంత నుంచి తీసిన పైమట్టికి 20 కిలోల పశువుల ఎరువు, ఒక కిలో సూపర్ ఫాస్పేట్, 100 గ్రాముల పాలిడాల్ 2శాతం పొడి బాగా కలిపి గుంతలు నింపి అంట్లు నాటుకోవాలి. అంటు నాటేటప్పుడు అంటు కట్టిన భాగం భూమిపైన ఉండేలా చూడాలి. నాటిన తర్వాత నీరు పోసి ఊతం ఇవ్వాలి.
 
కత్తిరింపులు
వేరు మూలంపై చిగుళ్లను, కొమ్మలను వెంనువెంటనే తీసివేయాలి.తెగుళ్లుసోకిన అనవసర కొమ్మలు కత్తిరించి తీసివేయాలి.
 
ఎరువులు
 50 కిలోల పశువుల ఎరువు ఒక కిలో ఆముదం పిండి, ఒక కిలో ఎముకల పొడి చెట్టు పాదులో ఒకసారి వేసుకోవాలి. ఐదు గ్రాముల యూరియా 700 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్సేట్, 200 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ చెట్టు పాదుల్లో రెండు దఫాలుగా వేసుకోవాలి.
 
నీటి యాజమాన్యం
వాతావరణ పరిస్థితిని బట్టి నీటిని పారించాలి. నీరు తక్కువైతే కాయలు గట్టిగా మారి పండవు. డ్రిప్ పద్ధతి పాటించి నీరు సమృద్ధిగా పారిస్తే పెరుగుదల, దిగుబడి అధికంగా ఉంటుంది.
 
దిగుబడి
సీతాఫలం నాటిన తర్వాత మూడో యేట నుంచి కాపు వచ్చినా మంచి కాపు 7-8 సంవత్సరాల వయసులో పొందొచ్చు. ఆధునిక యాజమాన్యం పాటించి ఒక్కో చెట్టుకు 100-150 కాయల వరకు దిగుబడి పొందొచ్చు.
 
పక్వదశ
కాయలపై కళ్లు ప్రస్ఫుటంగా కనిపిస్తూ కళ్ల మధ్య తెలుపు నుంచి లేత పసుపురంగు లేదా నారింజరంగుకు మారడంతోపాటు కాయలు ఆకుపచ్చ రంగు నుంచి లేత ఆకుపచ్చ రంగుకు మారతాయి.
 
ప్యాకింగ్
సీతాఫలం కోత తర్వాత త్వరగా పండుతాయి. కోసిన వెం టనే గ్రేడ్ చేసి గంపల్లో వేసి సీతాఫలం ఆకులను కింద, పక్క కు వేసి దూరప్రాంతాలకు రవాణా చేయాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement