ముగ్గు ఎప్పుడు ఎలా పుట్టింది అనడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ వేదాలలో సూర్య ఆరాధన కోసం రకరకాల చిత్రాలు చిత్రీకరించినట్లు ఆధారాలు ఉన్నాయని చెబుతుంటారు చరిత్రకారులు. ముఖ్యంగా శీతాకాలంలో పూజకి, ఆధ్యాత్మికతకు ఈ కాలం నెలవుగా ఉండటం వలన ఈ సమయంలో ముగ్గులు వేయడం ఒక సాంప్రదాయంగా స్థిరపడింది. అందునా ధనుర్మాసం వచ్చిందంటే చాలు, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో నెలగంటి ముగ్గులతో కళకళలాడుతూ దర్శనమిస్తాయి. అలాంటి ముత్యాల ముగ్గులను ఎలా పెట్టాలి? పాటించాల్సిన నియమాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.
ముగ్గు వేయడంలో కూడా కొన్ని జాగ్రత్తలు, నియమాలు తప్పనిసరిగా పాటించాలి. గడప, గేటు ముందే(వాకిలి) ముగ్గు వేయాలి. అలాగే ముగ్గు వేశాక ఖచ్చితంగా నాలుగువైపు అడ్డగీతలు వేయాలి. ఇలా అడ్డగీతలు వేయడం వల్ల దుష్టశక్తులు ఇంట్లోకి రావు. అలాగే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లదని శాస్త్రం చెబుతుంది. పైగా అలా వేయడం వల్ల అక్కడ శుభకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయనే సంకేతాన్ని సూచిస్తుంది కూడా.
ముగ్గుల్లో రకాలు..
ముగ్గుల్లో రకరకాల డిజైన్లు ఉంటాయి. ముఖ్యంగా పువ్వులు, కొమ్మలు, చతురస్రాకారం, త్రిభుజం, ప్రకృతి, కొండలు, దీపాలు వంటి వివిధ ఆకృతులు ముగ్గుల డిజైన్లలో కనిపిస్తుంటాయి. ఉత్తరాది, తూర్పు రాష్ట్రాల ముగ్గుల డిజైన్‌లలో ఎక్కువగా ప్రకృతిలో ఉండే వృక్షాలు, జంతువులూ, పక్షులు, కొండలు ప్రతిబింబిస్తాయని నిపుణులు చెబుతున్నారు. చుక్కలు, గీతలు, పువ్వులు, మెలికలు... ఇలా ముగ్గుల్లో బోలెడు రకాలు.
ద్రవిడులు చుక్కల ముగ్గులేస్తే, ఆర్యులు గీతల ముగ్గులు వేసేవారట. ఈ రెండింటి సమాహారం మన తెలుగు ముగ్గులు. చుక్కల చుట్టూ ముత్యాల్లా వచ్చేవి ముత్యాల ముగ్గులు. రేఖాగణితంలోని కోణాలను తలపించేవి రత్నాల ముగ్గులు. ఇక, ముగ్గులోని డిజైన్లకు ప్రకృతే స్ఫూర్తి... హంసలు, చిలుకలు, నెమళ్లు, శంఖువులు, పువ్వులు, లతలు... ఎన్నో.
సంక్రాంతి ముగ్గుల్లో సూర్యచంద్రులు, ధాన్యం, గోవుమాలక్ష్మి, చెరకు గడలు, పాలు పొంగే కుండలు గీస్తారు. ధనుర్మాసంలో వేసే మెలికల పాములు హేమంతంలో కొంకర్లు తిరిగే చలికి సంకేతం. చివరగా సంక్రాంతి ఆఖరి రోజు సూర్యుణ్ణి ఆహ్వానిస్తూ రథం ముగ్గు వేస్తారు. దాన్ని తాడుతో పక్కింటి రథానికి కలపడం అన్నది అందరూ కలిసి ఉండాలన్న సమైక్యతను చాటుతుంది. ముగ్గుల్లో వేసే లతలూ పువ్వులూ జంతువులూ పక్షులూ...ప్రకృతితో కలిసిమెలిసి జీవించాలని బోధిస్తాయి.
సందర్భానుసారం వేసే ముగ్గులు..
నక్షత్రం ఆకారంలో ముగ్గు వేస్తే.. భూత, ప్రేత, పిశాచాలు దరిచేరకుండా చూస్తుంది.
పద్మం ముగ్గు వేయడం వల్ల మనకు హాని కలిగించే చెడు శక్తులు దరిచేరకుండా అరికడతాయి. కాబట్టి ముగ్గులు తొక్కరాదు.
అమ్మవారి పూజ చేసేటప్పుడు.. విగ్రహం పెట్టే పీట మీద ఖచ్చితంగా చిన్న ముగ్గు వేసి.. చుట్టూ రెండు రెండు గీతలు వేయాలి.
తులసి చెట్టు దగ్గర అష్టదళ పద్మం ముగ్గు వేసి.. పూజ చేయాలి
ఆలయాల్లో, అమ్మవారి ముందు, మహావిష్ణువు ముందు ముగ్గులు వేసే స్త్రీలు 7 జన్మల వరకు సుమంగళిగానే మరణిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
దేవతలు ఉన్న ముగ్గులు అంటే ఓం, స్వస్తిక్, శ్రీ వంటి పవిత్ర గుర్తులతో కూడిన ముగ్గులు వేయరాదు. ఎందుకంటే వీటిని తొక్కరాదు కాబట్టి.
పూర్వం సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ముగ్గు లేని ఇంట్లో బిక్ష అడిగేవాళ్లు కాదట. ముగ్గు లేదంటే అశుభం జరిగిందని భావించేవాళ్లట
(చదవండి: ముగ్గులో దాగున్న ఆరోగ్య రహస్యం, సైన్సు ఏంటో తెలుసా..!)
Comments
Please login to add a commentAdd a comment