ఇంటినీరు! ఇంటిపంట!!
అసలే ఎండాకాలం.. ఇంట్లో పనులకే నీళ్లు కరువొచ్చింది. 30-40 శాతం తక్కువ వర్షపాతం నమోదవడంతో భూగర్భ జలాలు తొందరగానే అడుగంటాయి. నీటి ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఇక ఇంటిపంటలకు నీళ్లెక్కడి నుంచి వస్తాయి? ‘ఇంటిపంట’ బృంద సభ్యుల మధ్య ఫేస్‌బుక్‌లో ఇటీవల ఇదే చర్చ నడుస్తోంది.
ఇంతలో సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్టుండి పెద్ద వాన కురిసింది. అరగంటకు పైగా నిలబడి కురిసింది. టైల మీద కుండీలు, మడుల్లో పెరుగుతున్న ఇంటిపంటలు వర్షంలో తడిసి హర్షం వెలిబుచ్చుతూ తళతళలాడుతూ తలలూపాయి.
నీటి కొరతతో ఇబ్బంది పడుతున్న ఇంటిపంటల సాగుదారులు ‘అమ్మయ్య.. ఇంకో రెండు రోజులు నీటి బాధ లేదు’ అనుకొని సంతోషించారు. అయితే, హైదరాబాద్ మెహిదీపట్నానికి చెందిన వనమామళె నళిని మాత్రం ఇంక వారం రోజుల వరకు తన ఇంటిపంటలకు నీటి ఇబ్బందే లేదని ప్రకటించారు! తమ మేడ మీద 300 కుండీల్లో వివిధ రకాల పూలు, పండ్లు, కాయగూర మొక్కలను ఆమె అపురూపంగా పెంచుతున్నారు. తమ కుటుంబానికి సరిపడా పండ్లతోపాటు వారంలో మూడు రోజులకు సరిపోయే కూరగాయలు, ఆకుకూరలను సేంద్రియ పద్ధతుల్లో పెంచుకుంటున్నారు..
ఇంతకీ, ఆమె ఇంటిపంటలకు వారం వరకూ నీరెక్కడ నుంచి వస్తాయనే కదా.. మీ సందేహం..?
అక్కడికే వస్తున్నా.. ఈ సమస్యకున్న సరైన పరిష్కారాన్ని ఆమె ముందుగానే గ్రహించి, తగిన విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆమె చేసిందల్లా.. వర్షపు నీటిని.. కురుస్తుండగానే ఒడిసిపట్టుకున్నారు. సిమెంటు రేకుల వసారా మీద నుంచి జారే వర్షపు నీటిని బక్కెట్లు, ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నింపుకున్నారు. చూరు నీటిని పట్టుకోవడానికి అంతకుముందే ఏర్పాట్లు చేసుకొని ఉండటం వల్ల ఇది సాధ్యమైంది. నళిని ఒక్కరే కాదు.. ఇలా ముందుచూపుతో కదిలిన వారంతా వాన నీటిని ఒడిసిపట్టుకోగలిగే ఉంటారు. ఈ సీజన్‌లో ఇదే మొదటి వాన కావటంతో... చూరు నీటిలో మట్టి, పూలు, ఎండాకులు కలిశాయంతే..! వాన ఎలిసిందో లేదో.. అంతులేని ఈ వర్షానందాన్ని ఇంటిపంట గ్రూప్‌లో నళిని సచిత్రంగా పోస్టు చేసేశారు. నీటి కొరత సమస్యకు వర్షపు నీటి సంరక్షణే అసలు సిసలు పరిష్కారమని సూచించారు! సమస్య ఎక్కడ ఉందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుందని గుర్తుచేశారు. ఒక మంచి పనిని ముందు తాను చేసి.. తర్వాతే ఇతరులకు సూచించాలన్న గాంధీజీ బాటను నళిని అనుసరించి చూపడం బాగుంది..
అంతలోనే ఓ సందేహం..!!
అయినా.. మొక్కలకు పోయడానికి ఏ నీరు మంచిది? వర్షం నీరు మంచిదేనా? ఇంటిపంట గ్రూప్‌లో చర్చ మొదలైంది. మున్సిపాలిటీ వాళ్లు అవీ ఇవీ కలిపి సరఫరా చేసే నీటికన్నా, భూగర్భ జలం కన్నా వర్షం నీరు స్వచ్ఛమైనది కాబట్టి.. భేషుగ్గా పనికొస్తాయని సీనియర్లు తేల్చి చెప్పేశారు.
ఆస్బెస్టాస్ నీళ్లు ఇంటిపంటలకు మంచిదేనా?
ఇంతలో.. సీనియర్ కిచెన్ గార్డెనర్ పూనం భిదే గారికి గట్టి సందేహమే వచ్చింది (పూనం భిదే తమ టై మీది నుంచి వర్షం నీటిని ఇంకుడు గుంట ద్వారా భూమిలోకి ఇంకేలా ఏర్పాటు చేశారు. బోరు నీటినే ఇంటి అవసరాలకు, ఇంటిపంటలకు వినియోగిస్తున్నారు). ఆస్బెస్టాస్ డస్ట్‌ను పీల్చితే ఆరోగ్యానికి హానికరమని తెలుసు. అయితే ఈ రేకుల మీద నుంచి జారిన నీటిలో ఆస్బెస్టాస్ డస్ట్ కలిసి ఉంటుంది కదా.. ఆ నీటిని ఇంటిపంట మొక్కలకు పోయడం మంచిదేనా? అన్నదే ఆమె సందేహం. అదృష్టంకొద్దీ తాను టిన్ షీట్లను వాడాను కాబట్టి.. సమస్య లేదన్నారు నళిని.
ఏ మలినమూ అంటకుండా.. వర్షపు నీటిని స్వచ్ఛంగా ఒడిసిపట్టుకునే మార్గాలు అనేకం వాడుకలో ఉన్నాయి. అందులో ఒకటి: శుభ్రమైన వస్త్రాన్ని ఆరుబయట నాలుగు వైపులా లాగి కట్టి.. మధ్యలో ఏదైనా చిన్న బరువు వేసి.. దాని అడుగున బక్కెట్ లేదా డ్రమ్ము పెడితే చాలు.. స్వచ్ఛమైన ఈ నీరు ఇంటిపంటలకే కాదు.. మనం తాగడమూ మంచిదే!
- ఇంటిపంట డెస్క్