ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకులో వెలుగు చూసిన కుంభకోణం రూ.11,400 కోట్లు మాత్రమే కాదని, అంతకుమించి కుంభకోణం జరిగినట్టు బ్యాంకు తేల్చింది. గీతాంజలి గ్రూప్‌కు సంబంధించి మరో రూ.1,251 కోట్ల స్కాం కూడా వెలుగులోకి వచ్చింది. అంటే మొత్తంగా పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటుచేసుకున్న కుంభకోణం రూ.12,636 కోట్లకు పెరిగిందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వెల్లడించింది. ఈ కుంభకోణంపై ఇప్పటికే పలుమార్లు పీఎన్‌బీ అధికారులను విచారించిన సీబీఐ, కుంభకోణం మరింత పెరిగిన నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్‌ఎస్ కన్నన్‌ను కూడా ప్రశ్నిస్తోంది. ఈయన గీతాంజలి గ్రూప్‌కు అందించే నగదు విషయంలో కన్సోర్టియం ఆఫ్ ది బ్యాంకుకు అధినేతగా ఉన్నారు.
ఈ కుంభకోణంలో ప్రమేయముందనే ఆరోపణలతో పీఎన్‌బీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ ఉషా అనంత్‌ను కూడా విచారిస్తున్నారు. మరో ఇద్దరి అధికారులకు కూడా విచారణకు హాజరుకావాలని పిలుపు అందింది. మరోవైపు ఈ కుంభకోణ నేపథ్యంలో విదేశీ బ్రాంచుల్లో సరియైన ఆడిట్ జరుపాలని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాక మోసం జరిగే ఉద్దేశ్యమున్న రూ.50 కోట్లకు పైన ఉన్న మొండిబకాయిలను, నిరర్థక ఆస్తులను పరిశీలించాలని, వీటిపై 15 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment