కరోనా వైరస్‌పరమైన ప్రభావాల నుంచి ఆటోమొబైల్ పరిశ్రమ క్రమంగా బైటపడుతోంది. ఇటు దేశీయంగా అటు విదేశీ మార్కెట్లలోనూ డిమాండ్ పుంజుకుంటోందని అంటున్నారు కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ. కొత్త ఏడాది మరింత మెరుగ్గా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముడి వస్తువుల ధరలు ఎగియడం వల్లే రేట్లను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని సాక్షి బిజినెస్ బ్యూరోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. మరిన్ని విశేషాలు...
► మారుతీపై కోవిడ్ ప్రభావమెలా ఉంది?
ఇది ఎవరూ ఊహించని, కొత్త పరిణామం. ప్రతీ వందేళ్లకోసారి ఏదో ఒక మహమ్మారి విజృంభిస్తుందంటారు. ఇలాంటి సమయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో డిమాండ్ బాగానే ఉన్నట్లు కనిపించినా.. మార్చిలో కరోనా కారణంగా లాక్‌డౌన్ విధింపుతో పూర్తి ఆర్థిక సంవత్సరంపై ప్రభావం పడింది. ఏప్రిల్‌లో అన్ని కంపెనీలూ జీరో అమ్మకాలే నమోదు చేశాయి. తొలినాళ్లలో మా సరఫరా వ్యవస్థ దెబ్బతింది. భౌతిక దూరం నిబంధనలు అమలు చేయడంతో చాలా మంది వర్కర్లు తమ తమ సొంతూళ్లకు వెళ్లిపోయారు. కానీ, గత కొద్ది నెలలుగా పరిస్థితులు మళ్లీ మెరుగుపడుతున్నాయి. పేరుకుపోయిన డిమాండ్ నెమ్మదిగా బైట పడుతోంది. పండుగ సీజన్ కావడంతో రెండో త్రైమాసికంలో.. ముఖ్యంగా అక్టోబర్‌లో అమ్మకాలు అత్యధికంగా నమోదయ్యాయి. మరోవైపు, మేం ఎగుమతి చేసే మార్కెట్లలో కూడా డిమాండ్ క్రమంగా ఊపందుకుంటోంది.
► పండుగ సీజన్ అమ్మకాల ధోరణి ఇలాగే కొనసాగే అవకాశం ఉందా?
కస్టమర్ల కోణంలో చూస్తే అక్టోబర్ ప్రథమార్ధంలో కార్ల కొనుగోలుకు అంత శుభసమయం కాదని వాయిదా వేసుకున్నారు. అక్టోబర్ ద్వితీయార్ధం, నవంబర్‌లో పండుగ సీజన్ తార స్థాయికి చేరింది. ఆటోమొబైల్ పరిశ్రమకు ఈ సమయం అత్యుత్తమంగా గడిచింది. అత్యధిక స్థాయిలో వాహనాలు అమ్ముడయ్యాయి. అప్పట్నుంచి పురోగతి బాగానే ఉంది. బుకింగ్స్ ట్రెండ్ కూడా బాగుంది. కొత్త ఏడాది మరింత మెరుగ్గా ఉండగలదని ఆశిస్తున్నాం.
► ఆటో పరిశ్రమ ముందున్న ప్రధాన సవాళ్లేమిటి?
గత 30 సంవత్సరాల డేటా చూస్తే జీడీపీ వృద్ధిపై ఆటో పరిశ్రమ డిమాండ్ ఆధారపడి ఉంటోంది. సాధారణంగా కారు కొనుగోలు చేయడమనేది విచక్షణపరమైన నిర్ణయం. కాబట్టి కార్లు అమ్ముడవ్వాలంటే కొనుగోలుదారుల సెంటిమెంటు బాగుండాలి. ప్రస్తుతం ఈ సెంటిమెంట్ అంతా కోవిడ్, కోవిడ్ అనంతర పరిస్థితులపై ఆధారపడి ఉంటోంది.
► ప్రస్తుత తరుణంలో ధరల పెంపు సరైనదేనా?
కొత్త ఏడాది జనవరిలో ధరలను పెంచబోతున్నామంటూ ముందుగా ప్రకటించిన కంపెనీల్లో మారుతీ సుజుకీ కూడా ఒకటి. ముడి ఉత్పత్తుల వ్యయాలు పెరిగిపోవడంతో ఆ భారాన్ని వినియోగదారులకు బదలాయించడం తప్పనిసరైంది. మేం బీఎస్6 ప్రమాణాలకు మళ్లినప్పుడు కూడా అందులో కొంత భారాన్ని కొనుగోలుదారులకు బదలాయించాం. బీఎస్6 వాహనాల్లో ఉపయోగించే లోహాల్లో పలాడియం, రోడియం వంటివి కూడా ఉంటాయి. దక్షిణాఫ్రికా లాంటి దేశాల్లో ఇవి ఉత్పత్తవుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఆయా గనుల్లో ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడింది. సాధారణంగా ఈ లోహాలకు ఆటో రంగం నుంచే ఎక్కువగా డిమాండ్ ఉంటోంది. కొత్త కాలుష్య ప్రమాణాల కారణంగా వాహన తయారీ సంస్థల నుంచి డిమాండ్ పెరిగింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో రేట్లు ఎగిశాయి. ఇక ఉక్కు ధర కూడా పెరిగింది. అందుకే కార్ల ధరల పెంపు నిర్ణయం తీసుకున్నాం.
► కార్ల సబ్‌స్క్రిప్షన్ సేవలు, వినియోగదారుల ధోరణులు ఎలా ఉన్నాయి?
గడిచిన కొన్నేళ్లుగా ఉత్పత్తులను అద్దెకు తీసుకునే ధోరణి ప్రాచుర్యంలోకి వస్తోంది. దీంతో మారుతీ సుజుకీ కూడా దీనిపై దృష్టి పెట్టింది. మేం ప్రధానంగా మూడు కేటగిరీల వారిని చూశాం. వారు..
► కార్లను కొన్నాళ్ల పాటు వాడేసి, ఆ తర్వాత మరో కారుకు మళ్లే పైస్థాయి వర్గాలు
► ఎక్కడా ఎక్కువ కాలం ఉండకుండా .. తరచూ బదిలీ అయ్యే ఉద్యోగులు.
► దీర్ఘకాలం వాహన ఫైనాన్సింగ్‌కు కట్టుబడటం ఇష్టపడని యువత
► ఇటు దేశీయంగా అటు అంతర్జాతీయంగా ఈ మూడు కేటగిరీల్లోని వారూ ఉంటున్నారు. మెయింటెనెన్స్, దీర్ఘకాలిక కమిట్‌మెంట్ బాదర బందీ వద్దనుకునే వారికి ఈ సర్వీసులు ఉపయోగపడతాయి. స్వల్పకాలిక లీజింగ్‌కు సబ్‌స్క్రిప్షన్ మోడల్ ఉపయోగకరంగా ఉంటుంది. ఇందుకోసం కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. నెలవారీ అద్దె చెల్లించి.. అవి 2–3 సంవత్సరాల పాటు వాటిని వాడుకుంటాయి. ఉదాహరణకు స్విఫ్ట్ కారు అద్దె సుమారు రూ. 14,000–15,000 దాకా ఉంటుంది. మోడల్‌ను బట్టి మారుతుంది. డౌన్ పేమెంట్ చెయ్యలేని వారికి, డాక్యుమెంటేషన్.. మెయింటెనెన్స్ మొదలైనవి వద్దనుకునే వారికి ఈ సర్వీస్ ఉపయోగకరంగా ఉంటుంది. కారును కొనుక్కోవడం కన్నా ఇది అద్భుతమైన ప్రత్యామ్నాయం.
ఆశావహంగానే కొత్త ఏడాది
Published Tue, Jan 19 2021 4:17 AM | Last Updated on Tue, Jan 19 2021 4:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment