న్యూఢిల్లీ: చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని కార్లకు ఒకే పన్ను రేటు వర్తింపచేయడం సరికాదని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్‌సీ భార్గవ వ్యాఖ్యానించారు. పరిశ్రమ వృద్ధికి ఇలాంటి ధోరణి మంచిది కాదని ఆయన చెప్పారు. దేశీ ఆటో పరిశ్రమలో కీలక విభాగమైన చిన్న కార్లపై అత్యధికంగా నియంత్రణ నిబంధనలపరమైన భారం ఉంటోందని భార్గవ తెలిపారు. తయారీ రంగం వేగంగా వృద్ధి చెందితే దేశ ఆర్థిక వృద్ది రేటు కూడా అధికంగా ఉంటుందని ఆయన చెప్పారు. కానీ దురదృష్టవశాత్తూ ప్రభుత్వం ఎంతగా కృషి చేస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో విధానాలు పూర్తిగా అమలు కాకపోతుండటం వల్ల అలా జరగడం లేదని భార్గవ చెప్పారు.
‘పెద్ద కార్లతో పోలిస్తే చిన్న కార్లపై నియంత్రణపరమైన మార్పుల భారం చాలా ఎక్కువగా ఉంటోంది. ఇదే మొత్తం మార్కెట్ ధోరణులను మార్చేస్తోంది. ఇది కార్ల పరిశ్రమకు గానీ దేశానికి గానీ మంచిది కాదని భావిస్తున్నాను‘ అని ఆయన పేర్కొన్నారు. చిన్నా, పెద్ద కార్లకు ఒకే రకమైన పన్నును విధించడం సరికాదని ఆయన తెలిపారు. దాదాపు 50 శాతం స్థాయి పన్నుల భారంతో పరిశ్రమ వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆయన తెలిపారు.
ఏ దేశంలో కూడా ఇంత పన్నులతో ఆటోమొబైల్స్ వంటి పరిశ్రమ వృద్ధి చెందలేదని భార్గవ చెప్పారు. ప్రస్తుతం ఆటోమొబైల్స్‌పై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) 28 శాతంగా ఉండగా, వాహనం రకాన్ని బట్టి 1–22% వరకు సెస్సు అదనంగా ఉంటోంది. పూర్తిగా తయారైన రూపంలో (సీబీయూ) దిగుమతయ్యే కార్లపై కస్టమ్స్ సుంకం 60–100% వరకూ ఉంటోంది. ఆటో ఎక్స్‌పోలో మారుతీ ఎలక్ట్రిక్ కారు వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ.. జనవరిలో జరిగే ఆటో ఎక్స్‌పో వేదికగా ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ ఎస్‌యూవీని ప్రదర్శించనుంది. అలాగే రెండు సరికొత్త ఎస్‌యూవీలు సైతం కొలువుదీరనున్నాయి. మొత్తం 16 మోడళ్లు ప్రదర్శనకు రానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment