భారత్‌పై ఐఎంఎఫ్ ఈడీ కృష్ణమూర్తి సుబ్రమణియన్ అంచనా
డాలర్ ప్రాతిపదికన వృద్ధి 12 శాతంగా ఉండాలని విశ్లేషణ
కోల్‌కతా: డాలర్ ప్రాతిపదికన వార్షిక వృద్ధి రేటు 12 శాతంగా ఉంటే, 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 55 ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ పేర్కొన్నారు. 2018 నుండి 2021 వరకు ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా సుబ్రమణియన్ బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
2020–2021 కోవిడ్ సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ పటిష్టత చెక్కుచెదరకుండా కీలకపాత్ర పోషించిన ఆయన, మహమ్మారిపై దేశం ప్రతిస్పందన ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే భిన్నంగా ఉందని ఈ సందర్భంగా అన్నారు. ఇక్కడ జరిగిన సీఐఐ కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు..
» 2016 నుండి ద్రవ్యోల్బణం కట్టడికి దేశం పటిష్ట చర్యలు తీసుకుంది. దీనితో దేశం సగటు ధరల పెరుగుదల రేటును ఐదు శాతం వద్ద కట్టడి జరిగింది. 2016 ముందు ఈ రేటు 7.5 శాతంగా ఉండేది.
» ద్రవ్యోల్బణం కట్టడితో దేశం ఎనిమిది శాతం వృద్ధి సాధిస్తుందని విశ్వస్తున్నాం. దీనిని పరిగణనలోకి తీసుకోని నామినల్ గ్రోత్‌రేట్ 13 శాతంగా ఉంటుంది. ఐదు శాతం వద్ద ద్రవ్యోల్బణం కట్టడి కొనసాగుతుందని విశ్వసిస్తున్నాం.
» పారిశ్రామికీకరణ, నూతన ఆవిష్కరణలు, ప్రైవేటు రుణ వ్యవస్థ పురోగతి ఎకానమీకి మూడు కీలక స్తంభాలు. ఇవి ఆర్థిక వ్యవస్థ ఎనిమిది శాతం వృద్ధికి సహాయపడతాయి.
» దీర్ఘకాలంలో డాలర్‌తో పోలిస్తే భారత కరెన్సీ తరుగుదల రేటు ఒక శాతం కంటే తక్కువగా ఉండటంతో, ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్ పటిష్టంగా, స్థిరంగా కొనసాగుతున్నాయి.
» డాలర్‌లో భారత్ వాస్తవ వృద్ధి రేటు 12 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. ఇదే జరిగితే ఆర్థిక వ్యవస్థ పరిమాణం ప్రతి ఆరు సంవత్సరాలకు రెట్టింపు అవుతుంది. ఈ లెక్కన ప్రస్తుత 3.8 ట్రిలియన్ డాలర్ల భారత్ ఎకానమీ 2047 నాటికి 55 ట్రిలియన్ డాలర్లకు చేరుతుంది.
» అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో పెట్టుబడులతో సంబంధం లేకుండా, ఉత్పాదకత మెరుగుదల మాత్రమే వృద్ధికి కారణమవుతుంది.
» ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా సగం నుంచి రెండు వంతులు ఇంకా అనధికారిక (అన్‌ఫార్మల్) రంగంలోనే ఉంది.
» ఆర్థిక వ్యవస్థ ఎంత అధికారికంగా మారితే (ఫార్మల్‌గా) అది అంత అధిక ఉత్పాదకతకు దారి తీస్తుంది. ప్రపంచ సహచర దేశాలతో పోలిస్తే భారత్ ఫార్మల్ సెక్టార్‌లో ఉత్పాదకతను పెంచడానికి ఇంకా ఎంతో అవకాశం ఉంది.
» భారతదేశ ద్రవ్యోల్బణం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల చారిత్రక సగటు కంటే తక్కువగా ఉన్నందున, ప్రభుత్వం ‘సానుకూల ఫలితాల సాధన సాధ్యమేనన్న’ విశ్వాసంతో ఆర్థిక విధానాలను రూపొందించగలిగింది.
ప్రస్తుత జీడీపీ తీరిది..
భారత్‌ను 2047 నాటికి అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా నిర్దేశించుకుని ఇందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే వృద్ధి మందగమనం, అనిశ్చితమైన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు భారత్ వృద్ధికి సవాళ్లుగా ఉన్నాయి. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి.
కాగా, 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌ను అధిగమించగా, త్వరలో జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుత దేశ ఎకానమీ విలువ 3.8 ట్రిలియన్ డాలర్లు. ఇక ప్రస్తుతం భారత్ తలసరి ఆదాయం దాదాపు 2,300 డాలర్లు. 2031 ఆర్థిక సంవత్సరం భారత్ తలసరి ఆదాయం 4,500 డాలర్లకు పెరగాలన్నది లక్ష్యం. ఇదే జరిగితే దేశం ఎగువ మధ్య–ఆదాయ దేశాల క్లబ్లో ప్రవేశిస్తుంది. ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకారం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డాలర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పేర్కొంటారు. 12,000 డాలర్ల తలసరి ఆదాయం దాటితే అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది.
Comments
Please login to add a commentAdd a comment