ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ పాత్ర
ముంబై: భారత్ 2031 నాటికి ప్రంపచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ మైకేల్ డి పాత్ర పేర్కొన్నారు. 2060 నాటికి ప్రంపచ నంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్నారు. కాకపోతే ఈ దిశగా కొన్ని సవాళ్లను అధిగమించాల్సి ఉందన్నారు. కారి్మక ఉత్పాదకత, మౌలిక వసతులు, జీడీపీలో తయారీ రంగం వాటాను పెంచడం, ఆర్థిక వ్యవస్థను పర్యావరణం అనుకూలంగా మార్చడం తదితర సవాళ్లను ప్రస్తావించారు.
ముస్సోరిలో ఐఏఎస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో భాగంగా పాత్ర మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ ఏటా 9.6 శాతం చొప్పున దశాబ్ద కాలం పాటు వృద్ధిని సాధిస్తే దిగువ మధ్యాదాయ ఉచ్చు నుంచి బయట పడి, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించొచ్చని చెప్పారు. ‘‘4516–14005 డాలర్ల తలసరి ఆదాయ స్థాయి అన్నది మధ్యాదాయ దేశం హోదాకు సంబంధించినది.
ఇది దాటితేనే అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ హోదాకు చేరుకుంటాం. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపునకు తలసరి ఆదాయ పరిమితి 34,000 డాలర్లకు చేరుకోవచ్చు’’అని పాత్ర పేర్కొన్నారు. కరెన్సీల విలువలు అస్థిరంగా ఉన్నాయంటూ.. దేశాల మధ్య పోలికకు ఇవి తగినవి కాదని పాత్ర అభిప్రాయపడ్డారు. దీనికి ప్రత్యామ్నాయ కొలమానం ‘కొనుగోలు శక్తి సమానత’ (పీపీపీ) అని చెప్పారు. ఆర్థిక సహాకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) పీపీపీ ప్రకారం భారత్ 2048 నాటికి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నది చెప్పడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment