ఆర్థిక రంగంలో, మిశ్రమ రాజకీయాల్లో ఆయన భిన్న పాత్రలు పోషించినా... కేవలం సోనియా విధేయుడిగా మాత్రమే కొందరు మాట్లాడటం పాక్షికత్వాన్నే చెబుతుంది. నిస్సందేహంగా ఆయన దేశ సమగ్రతకూ, మానవీయ విలువలకూ విధేయుడిగా కనిపిస్తాడు. వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆయన అత్యధికంగా గౌరవించారంటే ఈ కొలబద్దలే కారణం. ‘వైఎస్ అక్కడ ఉన్నారు గనకే నేను ఇక్కడ ఉన్నాను’ అని ప్రధాని తనతో చెప్పేవారని మీడియా సలహాదారు సంజయ్ బారు ఇటీవల కూడా వెల్లడించారు.
‘మౌన ముని’ కాదు... మొండిమనిషి
అసహన రాజకీయాలూ, దూషణలూ– దుర్భాషలూ తాండవిస్తున్న ఈ రోజుల్లో కూడా... దశాబ్దకాలపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను దేశం మొత్తం ఏకోన్ము ఖంగా గౌరవించడం ఆయన వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది. తన అధ్యయనం, అనుభవం, అంతర్గత విలువలు ఆయనను అందరికీ ప్రీతిపాత్రుణ్ణి చేశాయి. సరళీకరణ విధానా లతో పూర్తిగా, కచ్చితంగా విభేదించే వామపక్షాల వంటివి కూడా ఆయన లౌకిక నిబద్ధతను గౌరవించాయి. రాజకీయంగా బద్ధ శత్రువైన బీజేపీ నేతలు కూడా ఆర్థిక రంగంలో మన్మోహన్ ముద్రలను కీర్తిస్తున్నారు.
బొత్తిగా పొసగని ఈ భిన్న శిబిరాల మన్ననకు పాత్రుడవడం ఆయనకే చెల్లింది. ఆర్థిక రంగంలో, మిశ్రమ రాజకీయాల్లో ఆయన భిన్న పాత్రలు పోషించినా... కేవలం, సోనియా విధేయుడుగా మాత్రమే కొందరు మాట్లాడటం పాక్షికత్వాన్నే చెబుతుంది. నిస్సందేహంగా ఆయన దేశ సమగ్రతకూ, మానవీయ విలువలకూ విధేయుడిగా కనిపిస్తాడు. వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆయన అత్యధికంగా గౌరవించారంటే ఈ కొలబద్దలే కారణం.
‘వైఎస్ అక్కడ (ఉమ్మడి ఏపీలో) ఉన్నారు గనకే నేను ఇక్కడ ఉన్నాను’ అని ప్రధాని తనతో ఎప్పుడూ చెప్పేవారని మీడియా సలహాదారు సంజయ్ బారు ఇటీవల కూడా వెల్లడించారు. యాదృచ్ఛిక లేదా అనూహ్య ప్రధాని ఆని ఆయనపై పుస్తకమే రాసిన సంజయ్ బారు స్వయంగా చేసిన ఈ వ్యాఖ్యలు మన్మోహన్ మనస్తత్వాన్నీ, వ్యక్తిత్వాన్నీ చెబుతాయి.
వైఎస్ హయాంలో ఎన్నో పథకాలకూ, కార్యక్రమాలకూ మన్మోహన్ ఇష్టపూర్వకంగా వచ్చేవారు. వామపక్షాల చొరవతో మొదలైన ‘గ్రామీణ ఉపాధి పథకా’న్ని అనంతపురంలోనే ప్రారంభించారు. విభజన ఉద్యమంతో తెలంగాణ విభజన చట్టాన్ని ఆమోదించడం ఒకటయితే... ఆలస్యంగానైనా ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించడం రెండు రాష్ట్రాలతో ఆయన బంధాన్ని బలోపేతం చేసింది.
1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్న మవ్వడం, పీవీ నరసింహారావు ప్రధాని పదవి చేపట్టడం కాస్త అటూ ఇటూగా జరిగాయి. అప్పటి వరకూ అనుసరించిన అలీన, స్వావలంబన విధానాల నుంచి విడగొట్టుకుని... కార్పొరేట్, ప్రైవేటీకరణ విధానాల వైపు మరలే ప్రక్రియను జాగ్రత్తగా అమలు చేయడానికి మన్మోహన్ సరైన వ్యక్తి అని పీవీతో పాటు ఆ వర్గాలు కూడా భావించాయనేది నిర్వివాదాంశం. మళ్లీ 2004లో సోనియాగాంధీ ప్రధాని పదవి చేపట్టరాదని నిర్ణయించుకున్నాక ఆ స్థాయిలో విశ్వసనీయత, విషయజ్ఞత ఉన్న నేతగా మన్మోహన్‌నే ఎంచుకోవడంలో ఆశ్చర్యం లేదు.
వ్యక్తిగతంగా ప్రణబ్ ముఖర్జీ సమర్థుడైనా ఆ విధంగా ఆమె ఆధారపడగల పరిస్థితి ఉండదు. వామపక్షాల మద్దతుపై ఆధారపడి ఏర్పడిన యూపీఏ–1కు సారథ్యం వహించడమంటే భిన్న కోణాలను సమన్వయం చేయవలసి ఉంటుందనీ తెలుసు. చిల్లర వ్యాపారంలో విదేశీ కంపెనీలకు ద్వారాలు తెరవడంతో మొదలై అమెరికాతో అణు ఒప్పందంతో పరాకాష్ఠకు చేరిన విభేదాలు వామపక్షాలను దూరం చేయడం ఊహించిన పరిణామమే.
తర్వాత కాలంలో పదవులు, ప్రయోజనాల బేరాలు తప్ప మరే విధాన సమస్యలు లేని ప్రాంతీయ మిత్రులను నిలబెట్టుకోవడానికీ, ఇష్టం లేని వారిని మంత్రులను చేయడంతో సహా ఆయన చాలా విన్యాసాలే చేయవలసి వచ్చింది. రక రకాల ఆరోపణలు, కుంభకోణాల కేసులతో పెనుగులాడవలసి వచ్చింది. ఆ క్రమంలోనే మిశ్రమ ప్రభుత్వం గనక రాజీ పడాల్సి వచ్చిందని ఆయన బాహాటంగా ఒప్పేసుకున్నారు.
చివరకు మీడియా ఛానళ్ల అధినేతలతో సమావేశమై... యూపీఏ అంటేనే అవినీతి అన్నట్టు చిత్రించవద్దని అభ్యర్థించాల్సి వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయమేమంటే... ఇన్ని ఆరోపణల మధ్యనా ఎవరూ ఆయన నిజాయితీని శంకించడం గానీ, తనకు వ్యక్తిగత బాధ్యత ఆపాదించడం గానీ జరక్కపోవడం!
2014 ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలోనే వెలువడిన సంజయ్ బారు పుస్తకంలో... ప్రధానిగా మన్మోహన్ ఫైళ్లు సోనియాగాంధీకి పంపించిన తర్వాతే నిర్ణయాలు తీసుకునేవారని ఆరోపించడంతో బీజేపీ వారు రంగంలోకి దిగిపోయారు. ఇది మోదీ బృందం ప్రచారానికి అస్త్రంగా వేసిన అభాండమని నాటి ప్రధాని కార్యాలయం ఖండించింది. అణు ఒప్పందం కుదరకపోతే రాజీనామా చేస్తానని అధిష్ఠానానికి సంకేతాలు ఇవ్వడం కూడా ఆయన ఎంత మొండి మనిషో నిరూపించింది.
ఆర్థిక మంత్రిగా ఇన్ని తీవ్ర నిర్ణయాలు ఎలా తీసుకున్నారంటే... ఎప్పుడూ జేబులో రాజీనామా లేఖ పెట్టుకుని తిరిగేవాడినని ఆయన ఇచ్చిన జవాబులో చాలా ఆర్థముంది. రాజీవ్ గాంధీ దారుణ హత్య తర్వాత అనూహ్య పరిస్థితుల్లో పీవీ నరసింహారావు ప్రధాని అవడం, తనను ఆర్థికమంత్రిగా ఎంపిక చేయడం వెనక ఉన్న బలీయమైన పాలక వర్గాలేవో ఆయనకు తెలుసు.
మోదీని ప్రధాని అభ్యర్థిగా ముందుకు తెచ్చిన కొత్తలో మన్మోహన్‌ను తీవ్రంగానే ఢీకొన్నారు. మోదీ వచ్చాక దర్యాప్తు సంస్థలు ఆయనకు నోటీసులు పంపించాయి. అయినా తగ్గకుండా నిలబడ్డారు. నోట్లరద్దును చారిత్రక ఘోరతప్పిదం అని నిప్పులు కక్కారు. చక్రాల కుర్చీలో వచ్చి మరీ సభలో ఓటేశారు. అనారోగ్యంలోనూ మొన్నటి ఏప్రిల్ దాకా రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడిగానే ఉన్నారు. ఆయనను ‘మౌన ముని’గా బీజేపీ అపహాస్యం చేసింది కానీ కీలక విషయాల్లో మౌనంగా లేరు.
వాస్తవానికి నోట్ల రద్దు నుంచి అదానీ వ్యవహారం వరకూ చాలా విషయాల్లో మోదీయే సభలో సమాధానమివ్వకుండా మౌనం పాటించారు. మన్మోహన్‌ను, గాంధీ కుటుంబాన్నీ ప్రత్యర్థులుగా చూపడానికి ఎన్నిసార్లు ఎంత రెచ్చగొట్టినా మాజీ ప్రధాని సంయమనం వీడలేదు. ఆయన విదేశాల్లో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ తన ప్రభుత్వ ఉత్తర్వును చించి వేసి ఆధిక్యత చూపించినా భరించారే గాని భగ్గుమనలేదు. దీన్ని అతి విధేయత అనాలా సంయమనం అనాలా అన్నది వారి కోణాలను బట్టి ఉంటుంది.
అయితే వాజ్‌పేయి వంటి దిగ్గజానికి మోదీ వంటి పరివార్ అగ్గి బరాటాకు మధ్యలో తొలి ఏకైక సిక్కు ప్రధానిగా తన స్థానం నిలబెట్టుకోవడం చిన్న విషయమేమీ కాదు. మన్మోహన్ స్వయంగా ఒకసారి కోరినట్టు... దేశం, చరిత్ర ఆయన పట్ల నిర్దయగా కాక వాస్తవికంగా గౌరవంగానే వ్యవహరిస్తున్నాయి. మూడో దీర్ఘకాల ప్రధానిగా ఇక ముందు కూడా మన్మోహన్ సింగ్‌కు ఓ ప్రత్యేక స్థానముండనే ఉంటుంది!
వ్యాసకర్త సీనియర్ సంపాదకులు, విశ్లేషకులు
- తెలకపల్లి రవి
సంస్కరణల సారథి
భారతదేశం గర్వించదగిన వ్యక్తులలో భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒకరు. 90వ దశకంలో ఆర్థిక సంస్కరణలను ప్రారంభించి భారత దేశ ఆర్థిక గమనాన్ని మార్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు. 1991లో భారత ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి సంక్షోభంలో పడిన భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు సాహసోపేతమైనవి.
1990లో చంద్రశేఖర్ నేతృత్వంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతున్న కాలంలో రెండు అంకె లతో ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బణం, రుణ భారంతో పెరిగిన కోశలోటు, మూడు వారాలకి కూడా సరిపోని విదేశీ మారక ద్రవ్య నిల్వలు, పడిపోతున్న ఆర్థిక వృద్ధిరేటు, పెరిగిపోతున్న నిరుద్యోగం, పేదరికంతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థను... దేశ ఆర్థిక మంత్రి అయిన తర్వాత గాడిలో పెట్టడం, 2008లో వచ్చిన ఆర్థికమాంద్యాన్ని తట్టుకొని భారత్ నిలబడేలా చేయడం వంటివాటిలో మన్మోహన్ కృషి అజరామరం.
నేడు భారత్ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి మూడవ స్థానం వైపుకి అడుగులు వేయటానికి మన్మోహన్ సింగ్ ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలే పునాది వేశాయి. రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌గా, యూజీసీ చైర్మన్‌గా, అంతర్జాతీయ వ్యాపార అర్థశాస్త్రంలో నిష్ణాతుడైన ప్రొఫెసర్‌గా, ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, ఆర్థిక మంత్రిగా, భారత ప్రధాన మంత్రిగా... భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన గోడలు నిర్మించారనే చెప్పాలి.
ప్రపంచ వాణిజ్యంలో భారత్ వాటాను పెంచే క్రమంలో తాను రూపొందించిన ఎగుమతులు– దిగుమతుల (ఎగ్జిమ్ పాలసీ) విధానం, విదేశాంగ విధానం భారతదేశాన్ని ప్రపంచంలో ఒక అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టాయి. 1991 బడ్జెట్‌లో 1992 నూతన సరళీకరణ ఆర్థిక విధాన ప్రకటనతో భారత ఆర్థిక వ్యవస్థసంకెళ్లను తెంచి ప్రపంచంతో పోటీపడే విధంగా ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దిన తీరు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది.
బంగారాన్ని తాకట్టుపెట్టి విదేశీ మారక ద్రవ్య నిల్వలను సమకూర్చుకునే స్థాయి నుండి నేడు ప్రపంచంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో భారత్‌ని 8వ స్థానంలో నిలబెట్టే స్థాయికి పునాదులు వేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్.
పది సంవత్సరాలు వరుసగా ప్రధానమంత్రిగా తాను తీసుకున్న అనేక విప్లవాత్మక నిర్ణయాలు దేశ ప్రజల మనః ఫలకంపై చెరగని ముద్రవేశాయి. 2005లో సమాచార హక్కు చట్టం, అమెరికాతో పౌర అణు ఒప్పందం, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం), గ్రామీణ ప్రాంతాలలో నైపుణ్యం లేని వారి ఉపాధి కోసం చేసిన ‘ఉపాధి హామీ చట్టం’ (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్), 2013లో తెచ్చిన భూ సేకరణ చట్టం, ఆహార భద్రతా చట్టాలు, ఆధార్ కార్డ్, రైతు రుణమాఫీ దేశ పాలన వ్యవస్థలో మైలు రాళ్లుగా నిలబడిపోయాయి.
‘దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి బయటపడవేసి ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికీ, స్థిరమైన వృద్ధిని సాధించడానికీ ఆర్థిక సంస్క రణలను ప్రారంభిస్తున్నాము. ఎవరి మెప్పు కోసమో ఆర్థికసంస్కరణలను ప్రారంభించడం లేద’ని నాడు తాను చెప్పిన మాటలు నేడు నిజమైనాయి. మాటల కంటే నిశ్శబ్దంగా పనిచేయటా నికి ప్రాధాన్యత ఇచ్చే మన్మోహన్ సింగ్ నిరాడంబర వ్యక్తిత్వం గల వివాదరహితునిగా పేరు తెచ్చుకున్నారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యులైన పి.వి. నరసింహారావుని భారత ప్రభుత్వం భారతరత్న అవార్డుతో సత్కరించిన విధంగానే మన్మోహన్ సింగ్‌కి కూడా భారతరత్న అవార్డు ఇవ్వాలి. ఆ పురస్కారానికి ఆయన అన్ని విధాలా అర్హులు.
-వ్యాసకర్త కాకతీయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ ‘ 98854 65877
-డా‘‘ తిరునహరి శేషు
Comments
Please login to add a commentAdd a comment