విశ్రాంత జీవనం.. హాయిగా..!  | Money Paathshaala Founder Vivek law on Retirement Planning | Sakshi
Sakshi News home page

విశ్రాంత జీవనం.. హాయిగా..! 

Published Mon, Feb 27 2023 4:55 AM | Last Updated on Mon, Feb 27 2023 4:55 AM

Money Paathshaala Founder Vivek law on Retirement Planning - Sakshi

ప్రజల ఆయుర్ధాయం పెరుగుతోంది. గతంలో మాదిరి కాకుండా నేటి యువత ప్రైవేటు రంగంలోనే ఎక్కువగా ఉపాధి పొందుతున్నారు. లేదంటే సొంత వ్యాపారాలు, ఇతర స్వయం ఉపాధి మార్గాలతో స్థిరపడుతున్నారు. జీవించి ఉన్నంత కాలం ఉద్యోగ, వ్యాపారాలు నిర్వహించలేం. ఉద్యోగంలో అయితే 58 ఏళ్లకు దిగిపోవాల్సిందే. స్వయం ఉపాధిలోని వారికి వయో పరిమితి లేదు. అయినా కానీ ఏదో ఒక రోజు చేస్తున్న పనికి విరామం పలకాల్సిందే. శారీరక, ఆరోగ్య పరమైన మార్పులు మునుపటి మాదిరిగా పనిచేయనీయవు. కనుక వృద్ధాప్యంలో పనికి విరామం పలికిన తర్వాత జీవన అవసరాలను తీర్చుకోవడం ఎలా అన్నది ముందే ఆలోచించాలి. దీనివల్ల విశ్రాంత రోజుల్లో ప్రశాంతమైన జీవనానికి అవకాశం లభిస్తుంది. ఈ అంశంపై ‘మనీ పాత్‌శాల’ వ్యవస్థాపకులు వివేక్‌ లా ఏం చెబుతున్నారో చూద్దాం... 

రిటైర్మెంట్‌ అనేది తప్పనిసరి దీర్ఘకాల ప్రణాళిక. అంతేకాదు, జీవితంలో ఖరీదైన లక్ష్యాల్లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే రిటైర్మెంట్‌ తర్వాత మరో 20–30 ఏళ్లు జీవించాల్సి రావడం, అందుకు కావాల్సినంత నిధిని సమకూర్చుకోవడం చిన్న విషయం కాదు. దీనికి డబ్బు విలువను హరించే ద్రవ్యోల్బణ ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని ఎదుర్కొనే స్థాయిలో రిటైర్మెంట్‌ కోసం కేటాయింపులు చేసుకోవాలి.

చేస్తున్న పనికే రిటైర్మెంట్‌ కానీ, మన జీవన అవసరాలకు కాదు. ఉద్యోగం/వ్యాపారం ఆగిపోయినా, మన జీవన అవసరాలను తీర్చే ఆదాయం ఆగిపోకూడదని అనుకుంటే అందుకు ముందు నుంచి తగిన ఏర్పాట్లు ఉండాలి. ఆర్జన ఆరంభించిన వెంటనే రిటర్మెంట్‌ ప్రణాళిక మొదలు పెట్టాలి. నిజానికి చాలా మంది యువత దీని ప్రాధాన్యాన్ని గుర్తించడం లేదు. దీంతో రిటైర్మెంట్‌ తర్వాత జీవితం ఎంతో మందికి సవాలుగా మారుతోంది.  

వాయిదా సరికాదు.. 
రిటైర్మెంట్‌ ఆలస్యం చేసిన కొద్దీ లక్ష్యం భారంగా మారుతుంది. పెట్టుబడి ఎంత ముందుగా ప్రారంభిస్తే కాంపౌండింగ్‌ ప్రయోజనంతో దీర్ఘకాలంలో అది మంచి నిధిగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల పెట్టుబడి ఎన్నో రెట్లు వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు 25 ఏళ్ల వయసు నుంచే ప్రతి నెలా రూ.5,000 చొప్పున 60 ఏళ్ల వరకు ఇన్వెస్ట్‌ చేస్తే.. 35 ఏళ్ల కాలంలో ఎంత సమకూరుతుంది? 12% కాంపౌండింగ్‌ రాబడి అంచనా ప్రకారం రూ.3.24 కోట్లు సమకూరుతుంది.

కేవలం నెలకు రూ.5వేలు అంత పెద్ద నిధిగా మారిందంటే అదే కాంపౌండింగ్‌ మహిమ. ఒకవేళ ఈ పెట్టుడిని ఒక ఏడాది ఆలస్యంగా మొదలు పెట్టారని అనుకుందాం. అంటే 26 ఏళ్లకు ఇన్వెస్ట్‌మెంట్‌ మొదలైతే రూ.37 లక్షలు తక్కువ మొత్తం సమకూరుతుంది. ఏడాది ఆలస్యం చేయడం వల్ల ఏర్పడిన నష్టం రూ.37 లక్షలు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయకూడని, అన్నింటికంటే ముందు ఆరంభించే పెట్టుబడి ప్రణాళిక రిటైర్మెంట్‌ ఫండ్‌ కావాలి. 

ఉపసంహరించుకునే దశ 
మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకుంటే, రిటైర్మెంట్‌ తర్వాత సిస్టమ్యాటిక్‌ విత్‌డ్రాయల్‌ మార్గాన్ని ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల ప్రతీ నెలా నిర్ణయించుకున్న మేర బ్యాంకు ఖాతాకు జమ అవుతుంటుంది. మిగిలిన మొత్తాన్ని ఈక్విటీల్లోనే ఉంచడం వల్ల రాబడులతో అది వృద్ధి చెందుతూ ఉంటుంది. దాంతో ద్రవ్యోల్బణ నష్టం నుంచి రిటైర్మెంట్‌ ఫండ్‌ విలువను కాపాడుకోవచ్చు.

ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్‌ చేసి ఉంటే కనుక రిటైర్మెంట్‌ నాటికి సమకూరిన మొత్తం నుంచి 60 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. దీనిపై పన్ను భారం ఉండదు. అయితే ఈ మొత్తాన్ని తిరిగి మెరుగైన రాబడులను ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. అప్పుడే మిగిలిన 30 ఏళ్ల జీవన అవసరాలకు అనుగుణంగా పెట్టుబడి వృద్ధిని చేసుకోవచ్చు. ప్రణాళిక  విషయంలో ఆర్థిక నిపుణుడి సేవలు తప్పకుండా తీసుకోవాలి.

రిటైర్మెంట్‌ నిధిని సమకూర్చుకునే విషయంలో భయం, ఊహాజనిత, ఉద్రేకాలకు అవకాశం ఇవ్వకుండా, క్రమశిక్షణతో ఇన్వెస్ట్‌ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. గృహ రుణం ఇంకా తీర్చాల్సి ఉన్నా లేదా తమపై కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నా.. రిటైర్మెంట్‌ తీసుకున్నప్పటికీ కొన్ని రకాల రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకోవాలి. గృహ రుణం తీరేంత వరకు, తమ ఆదాయంపై కుటుంబ సభ్యులు ఆధారపడే కాలానికి టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలి. అలాగే, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కూడా తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. 

ఆర్థిక క్రమశిక్షణ 
45–55 ఏళ్లకే రిటైర్మెంట్‌ తీసుకుని ప్రపంచమంతా తిరిగి రావాలి? ఇది కొందరి లక్ష్యం కావచ్చు. కానీ, 60 ఏళ్లు వచ్చే నాటికి అయినా దీన్ని సాధించగలిగారా? అని ప్రశ్నిస్తే.. ఎక్కువ మంది నుంచి లేదన్నదే సమాధానం వస్తుంది. సంపాదన మొదలైన నాటి నుంచే రిటైర్మెంట్‌ కోసం ఇన్వెస్ట్‌ చేయాలని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, మనలో చాలా మంది ఆర్జించే మొత్తం చెప్పుకోతగ్గ గొప్పగా ఉండదు. దీంతో పరిమిత ఆర్జన, అవసరాల నడుమ.. రిటైర్మెంట్‌ 60 ఏళ్లప్పుడు కదా, తర్వాత చూద్దాంలే? అని చాలా మంది అనుకుంటూ ఉంటారు.

యుక్త వయసు, ఆరోగ్యం సహకరిస్తున్న రోజుల్లోనే అలా అనుకుంటే.. వృద్ధాప్యానికి చేరువ అవుతున్న సమయంలో రిటైర్మెంట్‌ ఫండ్‌ వంటి భారీ లక్ష్యం ఎలా సాధ్యపడుతుంది? ఒక్కసారి ఆలోచించాలి. పిల్లల విద్య, వారి వివాహం, ఇతర బాధ్యతలతో రిటైర్మెంట్‌కు ముందు వరకు చాలా మంది తీరిక లేకుండా ఉంటారు. కనుక ఏ లక్ష్యాన్నీ నిర్లక్ష్యం చేయడానికి, వాయిదా వేయడానికి లేదు.

25–30 ఏళ్ల కెరీర్‌లో రోజువారీ అవసరాల్లో ఎలాంటి రాజీ పడకుండా, రిటైర్మెంట్‌కు కావాల్సినంత నిధిని సమకూర్చుకోవడం ఎలా? ఆర్థిక ప్రణాళిక ఇందుకు మార్గం చూపుతుంది. జీవితంలో ఏవి కావాలని కోరుకుంటున్నారు? అందుకోసం ఏం చేయాలి, ఎలా చేయాలనేది? ఆర్థిక ప్రణాళిక స్పష్టం చేస్తుంది.  

ఆర్థిక క్రమశిక్షణ ప్రతి ఒక్కరికీ అవసరం. కారణాలు ఏవైనా, రిటైర్మెంట్‌ నాటికి కావాల్సినంత నిధి సమకూర్చుకోలేకపోతే తిరిగి మునుపటి మాదిరి యువకుల్లా పనిచేయడం సాధ్యపడదు? అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలి. ఉదాహరణకు మీరు 60 ఏళ్లకు రిటైర్మెంట్‌ తీసుకుంటారని అనుకుంటే, 90 ఏళ్ల వరకు జీవించి ఉండేట్టు అయితే కనీసం 30 ఏళ్ల అవసరాలకు సరిపడా నిధి అవసరమవుతుంది.

ఇది చాలా పెద్ద లక్ష్యమే అనడంలో సందేహం లేదు. ఆరోగ్య సంరక్షణ అవసరాలు, పిల్లల విద్య, వారి వివాహాలు, వృద్ధాప్యంలో జీవన అవసరాలు, ద్రవ్యోల్బణం వల్ల పెరిగిపోయే జీవన వ్యయాలను విస్మరించడానికి లేదు. ఉదాహరణకు రిటైర్మెంట్‌ తర్వాత ప్రతి నెలా అవసరాలు తీర్చుకునేందుకు రూ.3 లక్షలు కావాలని అనుకుంటే.. ఏటా 7 శాతం ద్రవ్యోల్బణం అంచనా ఆధారంగా రూ.10 కోట్ల నిధిని సమకూర్చుకోవాల్సి ఉంటుంది.

35 ఏళ్ల వయసులో ఇన్వెస్ట్‌మెంట్‌ ఆరంభించారని అనుకుంటే.. 60 ఏళ్ల వయసు వచ్చే నాటికి మీ చేతిలో 25 ఏళ్లు మిగిలి ఉంటుంది. ఇందుకు గాను ప్రతి నెలా రూ.55,000 చొప్పున ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఇది ఏటా 12% చొప్పున వృద్ధిని చూస్తుందనుకుంటే 60 ఏళ్ల నాటికి రూ.10 కోట్లు సమకూరుతుంది.  

అందుకే మొదటి నెల వేతనం నుంచే రిటైర్మెంట్‌ నిధి సమకూర్చుకోవడానికి తొలి అడుగు పడాలి. తల్లిదండ్రులు లేదా తాతలు ప్రభుత్వరంగంలో ఉద్యోగులుగా పనిచేసి రిటైర్మెంట్‌ అవ్వడంతో, వారికి పెన్షన్‌ సదుపాయం ఉండేది. కానీ మన పరిస్థితి అలా కాదు. గ్యారంటీడ్‌ పెన్షన్‌ అనేది లేదు.

ఎవరికి వారే సొంతంగా నిధిని సమకూర్చుకుని, దానిపై ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కావడంతో మన దేశంలో సగటు ద్రవ్యోల్బణం 4–6 శాతం మధ్యలో ఉంటుందని అంచనా. అంటే నేడు పాకెట్‌లో ఉన్న రూ.1000 విలువ ఏడాది తర్వాత రూ.96కు తగ్గుతుంది. ఇలా తరిగిపోయే విలువకు తగిన రక్షణగా అదనపు పెట్టుబడి అవసరం ఉంటుంది.   

మిగులు లేదని చెప్పుకోవద్దు.. 
రిటైర్మెంట్‌ కోసం ఇన్వెస్ట్‌ చేయడానికి వెసులుబాటు లేదని కొందరు చెబుతుంటారు. తర్వాత వీలు చూసుకుని మొదలు పెడదామని, అనుకుంటూ ఉంటుంటారు. కానీ, విలువైన సమయాన్ని వృధా చేసిన తర్వాత ప్రతి నెలా ఎంత మొత్తం పొదుపు చేసినా అది గణనీయమైన వృద్ధిని చూడడానికి కావల్సిందన వ్యవధి ఉండదు. ఇంతకుముందు చెప్పుకున్న ఉదాహరణలోనే 25 ఏళ్లకు కాకుండా, తీరిగ్గా 45 ఏళ్ల వయసులో రిటైర్మెంట్‌ కోసం ఇన్వెస్ట్‌మెటు మొదలు పెట్టారని అనుకుందాం.

ప్రతి నెలా రూ.50,000 చొప్పున అక్కడి నుంచి 15 ఏళ్లు ఇన్వెస్ట్‌ చేస్తే.. 12 శాతం కాంపౌండింగ్‌ రాబడి చొప్పున 2.5 కోట్లు సమకూరుతుంది. 25 ఏళ్ల వయసులో ఆరంభించడం వల్ల కేవలం ప్రతి నెలా రూ.5వేలతోనే రిటైర్మెంట్‌ నాటికి రూ.3.24 కోట్లు సమకూరుతుంటే.. 20 ఏళ్లు ఆలస్యంగా మొదలు పెట్టడం వల్ల ప్రతి నెలా రూ.50వేల చొప్పున పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. అప్పటికీ సమకూరే మొత్తం కేవలం రూ.2.5 కోట్లు కావడాన్ని గమనించాలి. 

సమకూర్చుకునేది ఎలా? 
రిటైర్మెంట్‌ ప్రణాళికలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి రిటైర్మెంట్‌ సమయం వచ్చేంత వరకు కావాల్సిన నిధిని సమకూర్చుకోవడం. రిటైర్మెంట్‌ తర్వాత ఆ నిధి నుంచి ప్రతి నెలా రాబడి పొందడం రెండోది అవుతుంది. 25–30 ఏళ్ల కాల వ్యవధి ఉంటుంది కనుక, పెట్టుబడులకు ఈక్విటీలను మెరుగైన మార్గంగా చూడాలి.  దీర్ఘకాలంలో ఈక్విటీలను మించి కాంపౌండెడ్‌ రాబడులను ఇచ్చిన మెరుగైన సాధనం మరొకటి లేదనే చెప్పుకోవాలి.  

ఇందుకోసం మ్యూచువల్‌ ఫండ్స్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. లేదంటే ఎన్‌పీఎస్‌లోనూ ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆర్థిక సలహాదారు సూచనలను తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది. నిపుణుల సాయంతో రాబడుల అంచనాలు, కాల వ్యవధి ఆధారంగా పోర్ట్‌ఫోలియోను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. రిటైర్మెంట్‌కు సమయం దగ్గర పడుతుండగా, ఈక్విటీ పెట్టుబడులను క్రమంగా ఉపసంహరించుకుని, డెట్‌కు మళ్లించుకోవడంలో ఆర్థిక సలహాదారు సాయపడతారు. తద్వారా మీ లక్ష్యాలు  నెరవేరతాయి. 

ఉపసంహరించుకునే దశ 
మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకుంటే, రిటైర్మెంట్‌ తర్వాత సిస్టమ్యాటిక్‌ విత్‌డ్రాయల్‌ మార్గాన్ని ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల ప్రతీ నెలా నిర్ణయించుకున్న మేర బ్యాంకు ఖాతాకు జమ అవుతుంటుంది. మిగిలిన మొత్తాన్ని ఈక్విటీల్లోనే ఉంచడం వల్ల రాబడులతో అది వృద్ధి చెందుతూ ఉంటుంది. దాంతో ద్రవ్యోల్బణ నష్టం నుంచి రిటైర్మెంట్‌ ఫండ్‌ విలువను కాపాడుకోవచ్చు.

ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్‌ చేసి ఉంటే కనుక రిటైర్మెంట్‌ నాటికి సమకూరిన మొత్తం నుంచి 60 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. దీనిపై పన్ను భారం ఉండదు. అయితే ఈ మొత్తాన్ని తిరిగి మెరుగైన రాబడులను ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. అప్పుడే మిగిలిన 30 ఏళ్ల జీవన అవసరాలకు అనుగుణంగా పెట్టుబడి వృద్ధిని చేసుకోవచ్చు. ప్రణాళిక  విషయంలో ఆర్థిక నిపుణుడి సేవలు తప్పకుండా తీసుకోవాలి.

రిటైర్మెంట్‌ నిధిని సమకూర్చుకునే విషయంలో భయం, ఊహాజనిత, ఉద్రేకాలకు అవకాశం ఇవ్వకుండా, క్రమశిక్షణతో ఇన్వెస్ట్‌ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. గృహ రుణం ఇంకా తీర్చాల్సి ఉన్నా లేదా తమపై కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నా.. రిటైర్మెంట్‌ తీసుకున్నప్పటికీ కొన్ని రకాల రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకోవాలి. గృహ రుణం తీరేంత వరకు, తమ ఆదాయంపై కుటుంబ సభ్యులు ఆధారపడే కాలానికి టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలి. అలాగే, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కూడా తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement