ఏం సాధించారని సాధన సమావేశాలు: జగదీష్
బెంగళూరు: రెండేళ్లలో అసలు ఏం సాధించారని కాంగ్రెస్ నేతలు సాధన సమావేశాలు నిర్వహిస్తున్నారంటూ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ మండిపడ్డారు. శనివారం ఇక్కడ తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ఇంతటి నిర్లక్ష్య, నిర్లిప్త ప్రభుత్వాన్ని తన జీవితంలో చూడనే లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ‘సర్వోదయ’ పేరుతో సమావేశాన్ని నిర్వహించడం కాంగ్రెస్ నేతలకే చెల్లిందంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. తమకెంతో మేలు చేస్తారని వెనకబడిన వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పై ఎన్నో ఆశలు పెట్టుకుంటే, అయితే వారి ఆశలన్నింటినీ సిద్ధరామయ్య తుంచివేశారని ఆరోపించారు. సిద్ధరామయ్య అధికారాన్ని చేపట్టాక పాలనా వ్యవహారాల్లో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని, ఇసుక, గనుల మాఫియాలు ప్రభుత్వ అధికారులనే బెదిరించే స్థాయికి చేరుకున్నాయని విమర్శించారు.
రాష్ట్రంలోని రైతులు ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లేక కన్నీరుపెట్టే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇవన్నీ ఏవీ పట్టించుకోకుండా కేవలం రెండేళ్లు ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడమే పెద్ద ఘనకార్యం అన్నట్లు సిద్దరామయ్య సంబరాలు జరుపుకోవడం హాస్యాస్పదమని జగదీష్ శెట్టర్ పేర్కొన్నారు.