హాస్యాస్పదం!
డీ నోటిఫికేషన్‌పై సీఎంని నిలదీసిన శెట్టర్
మొరాయించిన మైకులు
పది నిమిషాల పాటు సభ వాయిదా
బెంగళూరు : రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక్క ఇంచు భూమి కూడా డీనోటిఫై చేయలేదని చెప్పడం హాస్యాస్పందంగా ఉందని విపక్ష నేత జగదీష్ శెట్టర్ ఎద్దేవా చేశారు. శాసనసభలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ... అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఆర్కావతికి సంబంధించిన భూములే కాకుండా మరో మూడు ప్రాంతాల్లోని భూములను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డీనోటిఫై చేశారని తెలిపారు. ‘లాల్‌బాగ్‌కు దగ్గరగా ఉన్న సిద్ధపుర ప్రాంతంలో 2.39 ఎకరాలను, బనశంకరి 6, 5వ క్రాస్‌లో వరుసగా 7.15 ఎకరాలు, 2.6 ఎకరాలను నిబంధనలకు విరుద్ధంగా సిద్ధరామయ్య డీ నోటిఫై చేశారు.
అప్పటి ఐఏఎస్ అధికారి సత్యమూర్తి ఈ అక్రమాల్లో భాగస్వామి’ అని వివరించారు. ఈ మూడు చోట్ల డీ నోటిఫికేషన్‌కు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరగాలని శెట్టర్ డిమాండ్ చేశారు. ఆర్కావతి డీ నోటిఫికేషన్‌కు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్న న్యాయమూర్తి కెంపణ్ణ కమిషన్ అడిగిన దాఖలాలను ఫిబ్రవరి చివరిలోపు ప్రభుత్వం అందజేయాలని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోందని అసహనం వ్యక్తం చేశారు.
మొరాయించిన మైక్
జగదీష్ షెట్టర్ ప్రసంగించే సమయంలో పదేపదే మైక్ మొరాయించింది. అదేవిధంగా జేడీఎస్ ఫ్లోర్‌లీడర్ కుమారస్వామి మాట్లాడే సమయంలో కూడా మైక్ సరిగా పనిచేయలేదు. దీంతో స్పీకర్ పదినిమిషాల పాటు శాసనసభను వాయిదా వేయాల్సి వచ్చింది.