హుబ్లీ, న్యూస్‌లైన్ : మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ కుటుంబ రాజకీయాలకు తెర తీశారు. అందుకే సోదరుడు ప్రదీప్ శెట్టర్‌ను విధాన పరిషత్ ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా బరిలో దించారు. దీని వెనుక కుంటుంబ రాజకీయాల విత్తనం నాటే రాజకీయ ఎత్తుగడ ఉందని ఆ పార్టీలోనే చెవులు కొరుక్కుంటున్నారు. విధాన పరిషత్ ఉప ఎన్నికలలో అభ్యర్థిగా ఎవరిని బరిలో దించాలనే ప్రశ్న తలెత్తినప్పుడు మొదటిగా వినిపించిన పేరు మాజీ ఎమ్మెల్యే శంకర్ పాటిల్ మునేనకొప్పది. అయితే పోటీకి ఆయన ససేమిరా అన్నారు.
అనంతరం మరో అభ్యర్థి కోసం అన్వేషించారు. కళకప్ప బండి, మహేష్ టెంగినకాయల పేర్లు వినిపించినా వీరిని వద్దనే అభిప్రాయాలు పార్టీలు వ్యక్తమయ్యాయి. చివరిగా ఇదే ఎన్నికలలో గతంలో పోటీ చేసిన ఎంఆర్. పాటిల్, వీరేష్‌లలో ఎవరో ఒకరిని ఎంపిక చేస్తారని అనుకోగా ప్రదీప్ శెట్టర్ పేరు తెరపైకి వచ్చింది. ప్రదీప్ శెట్టర్ మాజీ సీఎం జగదీశ్ శెట్టర్‌కు సోదరుడైనందున పోటీలో ప్రభావం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఎంఆర్. పాటిల్, అంచటగేరిల అభిప్రాయాలు తెలుసుకోకుండానే ప్రదీప్ శెట్టర్ పేరును ఖరారు చేశారు. శెట్టర్ తమ్ముడైన ప్రదీప్ అభ్యర్థిగా ఉంటే తగిన ప్రభావం చూపవచ్చని పైకి కనిపించే విషయమైనా లోపల మాత్రం కుటుంబ రాజకీయాలకు పునాదులు వేసే ప్రయత్నమేనన్నారు.
ఇవి కార్యకర్తలు అర్థం చేసుకుంటారని శెట్టర్ అండ్ ఫ్యామిలీ అనుకున్నా వాస్తవంగా బీజేపీలోనే వేడివాడిగా ఈ విషయంపై చర్చించుకుంటున్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ, యడ్యూరప్ప కుటుంబ రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శలు చేస్తునే జగదీశ్ శెట్టర్ కూడా అదే బాటలో నడవడం గమనార్హం. ముఖ్యమంత్రిగా అధికార వైభవాలు అనుభవించారు. ప్రస్తుతం తమ్ముడిని రంగంలోకి దింపి ఆయనను రాజకీయంగా పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నారని కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు.
మాజీ ముఖ్యమంత్రికి ప్రతిష్టాత్మకంగా మారిన ఈ క్షేత్రంలో ఎన్నికల ఖర్చు కోట్లాది రూపాయలే ఉంటుంది. అందుకు ఎవరినో అభ్యర్థిగా నిలబెట్టి చేతులు కాల్చుకోవడం కంటే తమ్ముడినే నిలబెడితే బాగుంటుందని భావించినట్లు తెలుస్తోంది. ఈ అంచనాతోనే ప్రదీప్ శెట్టర్ అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. దీని వెనుక అసలు ఉద్దేశం అసెంబ్లీ ఎన్నికలపైనే దృష్టి అన్నది శెట్టర్ వ్యూహంగా కనిపిస్తోంది. తమ్ముడిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెడితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టికెట్ దక్కించుకునేందుకు సానుకూలంగా ఉంటుందని శెట్టర్ ఎత్తుగడ అని సమాచారం.
కుటుంబ రాజకీయాలకు తెర లేపిన జగదీష్ శెట్టర్
Published Tue, Aug 13 2013 3:55 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
Advertisement