సాయం కరువు
- కరువును ఎదుర్కోవడంలో సర్కార్ వైఫల్యంపై విపక్ష నేత శెట్టర్ ధ్వజం
- కరువు పీడిత ప్రాంతాలో రుణాల వసూలు వాయిదా : సీఎం
- దీర్ఘకాలిక రుణాలుగా మధ్య కాలిక రుణాలు
- కరువును ఎదుర్కోనేందుకు ప్రభుత్వం సిద్ధం
- ప్రభుత్వ సమాధానంతో సంతృప్తి చెందని విపక్షం
- సభ నుంచి బీజేపీ సభ్యుల వాకౌట్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడం లేదని శాసనసభలో ప్రతిపక్ష నేత జగదీష్ శెట్టర్ మండిపడ్డారు. కరువును ఎదుర్కోవడంలో అవసరమైన సన్నాహాలు చేయడం లేదంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
సభలో కరువుపై చర్చ మొదలైన వెంటనే ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలోని పలు తాలూకాల్లో మూడేళ్లుగా కరువు నెలకొందని తెలిపారు. జూన్, జులై మాసాల్లో వర్షపాతం తక్కువగా నమోదవుతోందన్న సమాచారం ముందుగా అందినప్పటికీ ముఖ్యమంత్రి నేతత్వంలోని విపత్తు నిర్వహణా కమిటీ సమావేశం జరగలేదని విమర్శించారు. వెంటనే కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యాచరణను రూపొందించాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ రుణాల వసూలు వాయిదా
రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వ్యవసాయ రుణాల వసూలును వాయిదా వేయాలని సహకార సంఘాలు, బ్యాంకులకు సూచించినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. రాష్ర్టంలో నెలకొన్న కరువు పరిస్థితులపై శుక్రవారం శాసన సభలో జరిగిన స్వల్ప వ్యవధి చర్చకు రెవెన్యూ శాఖ మంత్రి వీ. శ్రీనివాస ప్రసాద్ సమాధానం ఇస్తున్న సందర్భంలో ఆయన జోక్యం చేసుకుంటూ, రైతుల నుంచి బలవంతంగా రుణాలను వసూలు చేయరాదని ఆదేశించినట్లు చెప్పారు.
మధ్య కాలిక రుణాలను దీర్ఘ కాలిక రుణాలుగా, స్వల్ప కాలిక రుణాలను మధ్య కాలిక రుణాలుగా మార్పు చేయాలని సూచించామని చెప్పారు. కరువును ఎదుర్కోవడానికి ప్రభుత్వం సర్వ సిద్ధంగా ఉందని ప్రకటించారు. దీని కోసం రూ.564 కోట్లు కేటాయించగా, ఇప్పటికే రూ.126 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు.
తాగు నీటి కోసం కొత్తగా బోర్ల తవ్వకాలకు, తాగు నీటి సమస్య తీవ్రంగా ఉన్న వెయ్యి గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఈ పనులకు నిధుల కొరత లేదని చెప్పారు. అయితే ప్రతిపక్షాలు చెబుతున్నట్లుగా రాష్ర్టంలో అంత తీవ్రంగా కరువు లేదని అన్నారు. కాగా ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు.