సాక్షి, బెంగళూరు : రాజకీయ ప్రత్యర్థులు ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్యలు ఇప్పుడు పాలు–నీళ్లలా కలిసిపోయారు! దీంతో అంతంతమాత్రం బలమున్న యడియూరప్ప ప్రభుత్వం సాఫీగా నడుస్తోందని తెలుస్తోంది. యడియూరప్ప పరిపాలనపై సిద్ధరామయ్య మెతక ధోరణితో స్పందిస్తుండడం, సిద్ధరామయ్య ఏదైనా డిమాండ్ చేయగానే యడియూరప్ప సానుకూలంగా వ్యవహరించడం గమనార్హం. ఇంత స్నేహానికి కారణాలేమిటని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.
ప్రస్తుత సీఎం యడియూరప్ప, మాజీ సీఎం సిద్ధరామయ్యలు 1983లో ఏకకాలంలో ఎమ్మెల్యేలుగా గెలిచి అడుగు పెట్టారు. ఇద్దరి మధ్య సిద్ధాంత వైరుధ్యం ఉన్నప్పటికీ ఎవరికి వారు ఆయా రాజకీయ పార్టీల్లో కొనసాగుతూ ప్రత్యర్థులుగా ముందుకు సాగుతున్నారు. ఒకరు అధికారంలో ఉంటే మరొకరు ప్రతిపక్షంలో ఉంటూ పరస్పరం రాజకీయ పోరాటం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో సఖ్యతగా ఉండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి గొలుపుతోంది. మరో మూడేళ్లు అధికారంలో కొనసాగాలంటే సిద్ధరామయ్య అండ ముఖ్యమని యడియూరప్ప కూడా భావిస్తున్నారు.
సంకీర్ణం కూల్చివేత నుంచి
ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్–జేడీఎస్ సర్కారు ఏర్పడి కుమారస్వామి సీఎం అయ్యారు. ఇది సిద్ధరామయ్యకు ఎంతమాత్రం నచ్చలేదు. తన సన్నిహితులకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని, సీఎం కుమారస్వామి ఏకపక్షంగా నడుచుకుంటున్నారని సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. చివరకు సిద్ధరామయ్య శిష్యులే ఎక్కువమంది అసమ్మతి ఎమ్మెల్యేల శిబిరంలో చేరడం, సర్కారు కూలిపోవడం తెలిసిందే. అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాల వెనుక సిద్ధరామయ్యే ఉన్నారన్న ఆరోణలు వినిపించాయి. దేవెగౌడ, కుమారస్వామిల కంటే యడియూరప్ప మేలు అని సిద్ధరామయ్య భావించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థిని నిలపకుండా బీజేపీకి సాయం చేశారనే విమర్శలున్నాయి.
(‘అమూల్యకు నక్సలైట్లతో సంబంధాలున్నాయి’)
బాదామికి రూ. 600 కోట్లు
సిద్ధరామయ్య నియోజకవర్గం బాదామికి సీఎం యడియూరప్ప ఏకంగా రూ. 600 కోట్లను విడుదల చేశారు. సిద్ధరామయ్య ఏమి అడిగినా యడియూరప్ప లేదనే మాట చెప్పడం లేదు. అసెంబ్లీ సమావేశాల్లోనూ సిద్ధరామయ్య మాట్లాడుతున్న సందర్భంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు పదే పదే అడ్డుపడుతున్న సందర్భంలో యడియూరప్ప మధ్యలో కలుగజేసుకుని ఎవరూ మాట్లాడొద్దని సముదాయించి వారిని సీట్లలో కూర్చొబెట్టడం కూడా కనిపించింది. (అధిష్టానానికి తలనొప్పిగా ఆ రాష్ట్ర వ్యవహారం)
సీఎం బర్త్‌డేకి హాజరు
27న జరిగే యడియూరప్ప పుట్టినరోజు వేడుకలకు యడ్డి కుమారుడు విజయేంద్ర వెళ్లి సిద్ధరామయ్యను ఆహ్వానించారు. నివాసానికి వెళ్లి పుట్టిన రోజు వేడుకలకు రావాలని ఆహ్వానించడం కూడా వీరి మధ్య నెలకొన్న అన్యోన్య స్నేహానికి ప్రతీకగా ఉందని చర్చించుకుంటున్నారు. అనుకున్నట్లుగానే గురువారం రాత్రి జరిగిన యడియూరప్ప పుట్టినరోజు వేడుకలకు సిద్ధరామయ్య హాజరై పొగడ్తలతో ముంచెత్తారు. వీరిద్దరి స్నేహం మూడు ప్రధాన పార్టీల్లోనూ చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment