సీఎంపై కమలం సమరం !
బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ప్రధాన విపక్షమైన భారతీయ జనతా పార్టీ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. అర్కావతి డీ నోటిఫికేషన్ ప్రధాన అస్త్రంగా సమరానికి సిద్ధమవుతోంది. శాసనసభ విపక్ష నాయకుడు జగదీష్ శెట్టర్ అధ్యక్షతన బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
సమావేశంలో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు ప్రహ్లాద్ జ్యోషి, ఎమ్మెల్యే సురేష్‌కుమార్, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సోమణ్ణ, తదితరులు పాల్గొన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... నిబంధనలకు విరుద్ధంగా సిద్ధరామయ్య అర్కావతి డీ నోటిఫికేషన్ చేశారని, ఈ విషయంపై కేసు దాఖలు చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా బీజేపీ శాసనసభ్యులు గవర్నర్ వజుభాయ్ రుడాబాయ్ పటేల్‌ను కోరనున్నారు.
అంతకుముందు డీ నోటిషికేషన్‌కు సంబంధించిన దాఖలాలు అన్నీ ఆయనకు ఇవ్వనున్నారు. డీ నోటిఫికేషన్‌కు సంబంధించి దాదాపు రూ.900 కోట్ల అక్రమాలు జరిగాయని, దీనిపై స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థల ద్వారా విచారణ జరిపించాల్సిందిగా హైకోర్టును కూడా ఆశ్రయించాలని కమలనాథు లు భావిస్తున్నారు. ఈ విషయమై న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకున్నారు.
ఇప్పటికే బీజేపీ పెద్దలు డీ నోటిఫికేషన్ తర్వాత అక్కడ సామాజికంగా, ఆర్థికంగా జరిగిన అభివృద్ధి, బహుళ అంతస్తుల భవంతుల నిర్మాణాలకు సంబంధించిన విషయాలను ప్రముఖ సర్చ్ ఇంజన్ ద్వారా దా ఖలాలు రాబట్టారు. ఈ నిర్మాణాలు ఎవరెవరి పేరుపై ఉన్నాయన్న విషయం కూడా కూపీలాగారు. ఈ విషయాలన్నింటినీ పార్టీ ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి అనుమతి పొం దారు. పండుగ తర్వాత ఎప్పుడైనా గవర్నర్ అనుమతి పొంది అర్కావతి ఢీ నోటిఫికేషన్ ఆధారంగా సిద్ధరామయ్యపై న్యాయపోరాటం చేయడానికి కమల నాథులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు.