క్రికెట్ బెట్టింగ్ అక్రమాలపై దర్యాప్తుకు.. సీబీ‘ఐ’.
బెంగళూరు : రాష్ట్రంలో జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్ అక్రమాలకు సంబంధించి సీబీఐతో విచారణ చేయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని విధానసభలో రాష్ట్ర హోంశాఖ మంత్రి కే.జే జార్జ్ ప్రకటించారు. సభాకార్యక్రమాల్లో భాగంగా విపక్షనాయకుడు జగదీష్ శెట్టర్ శాసనసభలో శుక్రవారం ప్రస్తావించిన విషయానికి సంబంధించి జార్జ్ స్పందిస్తూ రాష్ట్రంలో క్రికెట్ బెట్టింగ్ హుబ్లీ, ధార్వాడలకు మాత్రమే పరిమితం కాలేదని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా జరుగుతోందన్నారు.
గతంలో బాంబే, ఢిల్లీ వంటి పెద్దపెద్ద నగరాలకు, పట్టణాలకు పరమితమైన ఈ బెట్టింగ్ ఇటీవల చిన్నచిన్న గ్రామాలకు సైతం వ్యాపించడం కలవరపెడుతోందని అన్నారు. హుబ్లీలో క్రికెట్ బెట్టింగ్ బయటకు వచ్చిన వెంటనే ఈ అక్రమ దందాలో భాగస్వాములుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డీసీపీ, కానిస్టేబుల్స్‌తో పాటు పలువురు హోంశాఖ సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు గుర్తు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ప్రభుత్వం క్రికెట్ బెట్టింగ్‌పై ఉదాసీనతతో వ్యవహరించబోదన్నారు. అయితే ఈ విషయంలో విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. కేవలం ప్రచారం కోసమే కొంత మంది రాజకీయ నాయకులు ఈ క్రికెట్ బెట్టింగ్‌ను పట్టుకుని వేలాడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమయంలో అధికార, విపక్ష నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్పీకర్ కాగోడు తిమ్మప్ప కల్పించుకుని పరిస్థితిని సరిదిద్దారు. కాగా, అంతకు ముందు శెట్టర్ మాట్లాడుతూ...‘క్రికెట్ బెట్టింగ్ విషయంలో రాష్ట్రంలోని చాలా మంది సీనియర్ పోలీసు అధికారులకు భాగస్వామ్యం ఉంది. ఈ విషయంలో నిస్పక్షపాత దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది.’ అని శాసనసభలో పేర్కొన్నారు.