... ఆ బిల్లు వెనక్కు
చివరి రోజు విధానసభలో ఆర్కావతి వేడి
బెంగళూరు: నూతన సంవత్సరానికి సంబంధించిన మొదటి అసెంబ్లీ సమావేశాల చివరి రోజున కర్ణాటక హిందూ ధార్మిక సంస్థల నియంత్రణ(సవరణ) బిల్లును రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. బెళగావిలో జరిగిన శీతాకాల సమావేశాల్లో రాష్ట్రంలోని మఠాలపై నియంత్రణను పొందేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బిల్లుపై రాష్ట్రంలోని వివిధ మఠాధిపతులు, విపక్షాలతో పాటు స్వపక్షం నుంచి సైతం విమర్శలు వెల్లువెత్తడంతో ఈ సమావేశాల్లో బిల్లును రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. శాసనసభ కార్యకలాపాల్లో భాగంగా శుక్రవారం రోజున విధానసభలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర ఈ బిల్లును వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో అన్ని పక్షాలు ఇందుకు అంగీకారం తెలిపాయి.
ఇక శుక్రవారం రోజున సైతం విధానసభలో ఆర్కావతి వాగ్యుద్ధం కనిపించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ప్రతిపక్ష నాయకుడు జగదీష్ శెట్టర్‌ల మధ్య ఆర్కావతి అంశానికి సంబంధించి ఆరోపణలు, ప్రత్యారోపణలతో విధానసభ దద్దరిల్లింది. గవర్నర్ ప్రసంగానికి కృతజ్ఞతలు తెలియజేయడంపై జరుగుతున్న చర్చ సందర్భంలో ఆర్కావతి అంశం అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం ప్రారంభమైంది. దీంతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప సభను సాయంత్రం 4గంటలకు వాయిదా వేశారు. అనంతరం సభా కార్యక్రమాలు సాయంత్రం 7గంటల వరకు కొనసాగాయి. వివిధ అంశాలపై చర్చ కొనసాగిన అనంతరం స్పీకర్ కాగోడు తిమ్మప్ప అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేశారు.