సాక్షి, బళ్లారి : బళ్లారి గ్రామీణ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మాజీ సీఎం జగదీష్ శెట్టర్ పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థి ఓబుళేసు తరుఫున సోమవారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు బళ్లారికి వచ్చారు. ఈ సందర్భంగా శెట్టర్‌కు గాలి సోమశేఖరరెడ్డి, బీజేపీ అభ్యర్థి ఓబుళేసు, పలువురు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అల్లీపురం మహాదేవ తాత మఠం నుంచి వినాయకనగర్, కువెంపునగర్, కౌల్‌బజార్, బెళగల్లు క్రాస్, రైల్వే ఫస్ట్ గేట్ తదితర ప్రాంతాల్లో భారీ రోడ్డు షో చేపట్టారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో శెట్టర్ మాట్లాడుతూ ఈ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు మినహా ఇక్కడ జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. నిత్యం అందుబాటులో ఉండే బీజేపీ అభ్యర్థినే గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
బళ్లారి ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరుఫున పాల్గొనేందుకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్‌శెట్టర్ వచ్చిన సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. సోమవారం సాయంత్రం ఆయన బెంగళూరు నుంచి నేరుగా బళ్లారి చేరుకుని నగర శివార్లలోని అల్లీపురం నుంచి రోడ్డు షో చేపట్టారు. రోడ్డు షోకు ముందు బీజేపీ కార్యకర్తలు బైక్ ర్యాలీ చేపడుతుండగా బైక్ ర్యాలీకి అనుమతి పత్రాలు చూపించాలని ఎన్నికల అధికారి నఫీసా అడ్డుకుని, మూడు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు.
ఈ సందర్భంగా కేఎంఎఫ్ అధ్యక్షుడు గాలి సోమశేఖరరెడ్డి మాట్లాడుతూ అధికారులు అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో యువకులు బైక్‌ర్యాలీలు జరపడం సహజమేనని, ఇది అన్ని పార్టీలలో జరుగుతుందని గుర్తు చేశారు. అయితే కేవలం బీజేపీని అడ్డుకోవడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, విధాన పరిషత్ సభ్యులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి : శెట్టర్
Published Tue, Aug 12 2014 2:48 AM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM
Advertisement