- అర్కావతి లేఔవుట్ దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తే...
- రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి
సాక్షి, బళ్లారి : అర్కావతి లే అవుట్‌లో చోటు చేసుకున్న అక్రమాలపై సీబీఐతో దర్యాప్తు చేయిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు జైలు శిక్ష తప్పదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి జోష్యం చెప్పారు. బళ్లారిలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అర్కావతి లే అవుట్ అక్రమాలపై తమ వద్ద పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ విపక్షనేత జగదీష్ శెట్టర్ పేర్కొంటున్నప్పటికీ సీబీఐ దర్యాప్తునకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు.
వాస్తవాలు వెలుగు చూస్తే తనకు జైలు శిక్ష తప్పదని తెలుసుకునే సీబీఐ దర్యాప్తునకు ముఖ్యమంత్రి వెనుకంజ వేస్తున్నారని ఎద్దేవా చేశారు. తన కుమారుడితో ఇసుక మాఫియాను నడుపుతున్న ముఖ్యమంత్రికి ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించే అర్హత లేదని అన్నారు. ఉప ఎన్నికల సందర్భంగా బళ్లారిలో అధికారదుర్వినియోగానికి తెరలేపారని మండిపడ్డారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.
ఉప ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టడం ద్వారా అధికార కాంగ్రెస్ పార్టీకి హెచ్చరికలు చేయాలంటూ ఓటర్లకు జగదీష్ శెట్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు సదానందగౌడ, అనంత్‌కుమార్, బళ్లారి ఎంపీ శ్రీరాములు, కేఎంఎఫ్ అధ్యక్షుడు గాలి సోమశేఖరరెడ్డి, బళ్లారి మాజీ ఎంపీ శాంత, మాజీ మేయర్ ఇబ్రహీంబాబు పాల్గొన్నారు.