2020 నాటికి 40 లక్షల ఐటీ ఉద్యోగాలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ప్రస్తుతం ఐటీ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 లక్షల మంది ఉపాధి పొందుతుండగా, 2020 నాటికి ఈ సంఖ్య రెండింతలు కానుందని ఐటీ, బీటీ శాఖ మంత్రి ఎస్‌ఆర్. పాటిల్ వెల్లడించారు. ఐటీ, బీటీ రంగంలో కొత్త పరిణామాల గురించి తెలియజేయడానికి మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ ఐటీ ఎగుమతుల్లో మూడో వంతు కర్ణాటక నుంచే సాగుతోందని తెలిపారు. గత ఏడాది రూ.1.65 లక్షల ఐటీ ఎగుమతులు జరిగాయని చెబుతూ, 16 నుంచి 17 శాతం వృద్ధి నమోదైందని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా బెంగళూరులోని పలు ప్రాంతాల్లో ఉచిత వైఫై సదుపాయాన్ని కల్పించామని గుర్తు చేస్తూ, కెంగేరి, శివాజీ నగర, జయ నగర, బనశంకరి, విజయనగర బస్సు స్టేషన్లకు కూడా ఇటీవల ఈ సదుపాయాన్ని విస్తరించామని చెప్పారు.
ఏడాదిలోగా మొత్తం బెంగళూరుతో పాటు జిల్లా కేంద్రాలకు ఈ సదుపాయాన్ని విస్తరించదలిచామని వెల్లడించారు. దీనిపై ఆసక్తి కలిగిన కంపెనీలను ఆహ్వానించగా, ఆరు సంస్థలు ముందుకు వచ్చాయని తెలిపారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు, ఇతర ప్రక్రియలను ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. కాగా పారిశ్రామికాసక్తి, నవ కల్పనలను ప్రోత్సహించడానికి మైసూరు, తుమకూరు, గుల్బర్గ, ధార్వాడ, బిజాపుర, బాగలకోటె, ఉడిపి, బెల్గాం, శివమొగ్గల్లోని తొమ్మిది ఇంజనీరింగ్ కళాశాలకు కొత్త తరం ఇన్‌క్యుబేషన్ సెంటర్లను మంజూరు చేశామని తెలిపారు. ఈ కేంద్రాలకు మూడేళ్ల పాటు రూ.40 లక్షల చొప్పున ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని వెల్లడించారు.
తమ అనుభవాలను, బోధనలను పంచుకోవడానికి ఈ కేంద్రాలన్నిటినీ అనుసంధానం చేస్తామని కూడా చెప్పారు. యువతకు ప్రయోజనం కలిగే విధంగా నైపుణృ్య అభివద్ధికి పలు కార్యక్రమాలను చేపట్టే దిశగా సాగుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగా పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. నగరంలోని ఎలక్ట్రానిక్స్ సిటీలో రూ.80 కోట్ల వ్యయంతో ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని తెలిపారు. ఇందులో కేంద్రం రూ.50 కోట్లు సమకూరుస్తుందన్నారు. మైసూరులో కూడా రూ.30 కోట్ల వ్యయంతో ఇలాంటి క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
తప్పు చేయకపోతే భయమెందుకు?
విపక్ష బీజేపీ నేత జగదీష్ శెట్టర్ సవాల్ విసిరారు. బళ్లారి శివారులోని సంగనకల్లులో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 542 ఎకరాలకు సంబంధించిన అర్కావతి లే ఔట్‌లో ఎకరం రూ. 15 కోట్లకు పైబడి ధర పలుకుతోందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన 14 నెలలకు సంబంధించి బళ్లారి జిల్లా, రాష్ట్రంలో చేపట్టిన అభిృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బళ్లారికి సోనియా గాంధీ ప్రకటించిన రూ.33వేల కోట్ల ప్యాకేజీపై కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. కార్పొరేషన్లకు ప్రతి ఏటా రూ. వంద కోట్లను కేటాయించిన ఘనత బీజేపీకే దక్కుతుందని అన్నారు. కేపీఎస్‌సీ-11 నియామకాలు రద్దు చేయడం సబబు కాదని అన్నారు. కష్టపడి చదువుకుని ర్యాంకులు తెచ్చుకున్నవారి జీవితాలను బుగ్గిపాలు చేసేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కేపీఎస్‌సీ నియామకాల రద్దు వివాదాన్ని పునఃపరిశీలించాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ డీసీఎం అశోక్, మాజీ ఎమ్మెల్యే సోమలింగప్ప, విధాన పరిషత్ సభ్యుడు మృత్యుంజయ జినగ, జిల్లా బీజేపీ అధ్యక్షుడు నేమిరాజ్ నాయక్, మాజీ జిల్లా బీజేపీ అధ్యక్షుడు విరుపాక్షిగౌడ, జిల్లా బీజేపీ యువమోర్చా నాయకుడు సుధీర్, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి మురారీగౌడ పాల్గొన్నారు.