యూపీఏ పాలనలో దేశం అధోగతి | Under the country yupie adhogati | Sakshi
Sakshi News home page

యూపీఏ పాలనలో దేశం అధోగతి

Published Sun, Sep 15 2013 1:18 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

Under the country yupie adhogati

సాక్షి, బళ్లారి :  యూపీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశం అధోగతి పాలైందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ అన్నారు. ఆయన నగరంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిలో దేశాన్ని గాడిలో పెట్టే శక్తి ఒక్క నరేంద్ర మోడీకే ఉందన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించడం హర్షణీయమని, యావత్ దేశం కూడా మోడీ వైపు చూస్తోందన్నారు.

దేశాన్ని ప్రగతి పథంలోకి నరేంద్ర మోడీ తీసుకుని వెళ్లగలరనే నమ్మకంతోనే తమ పార్టీ ముందుగానే ఆయన పేరును ప్రకటించిందన్నారు. యూపీఏలోని మంత్రులు అవినీతి కుంభకోణాల్లో మునిగిపోయారని, ఆర్థిక పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోందన్నారు. మోడీ పేరు ప్రకటించడంతో కర్ణాటకలో బీజేపీకి మరింత బలం చేకూరుతుందన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో దేశంలో ఎన్‌డీఎ కూటమి అధికారంలోకి వచ్చి మోడీ ప్రధానిగా కావడం ఖాయమన్నారు. కర్ణాటకలో గత లోక్‌సభ ఎన్నికల్లో 19 సీట్లు గెలుచుకున్నామని, ఈసారి జరిగే లోక్‌సభ ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ సీట్లు తమ పార్టీ అభ్యర్థులు గెలుపొందుతారన్నారు.

మోడీని ప్రధాని అభ్యర్థిగా తమ పార్టీ నేతలు వెల్లడించడంతో దేశంలో రాజకీయాలకతీతంగా మోడీకి మద్దతు ఇస్తున్నారన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పను పార్టీలోకి చేర్చుకునే విషయం పూర్తిగా హైకమాండ్ చూసుకుంటుందన్నారు. హైకవ ూండ్ తీసుకునే ఎలాంటి నిర్ణయాన్నైనా తాము స్వాగతిస్తామన్నారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిపోయిందన్నారు.

సీఎం సిద్ధరామయ్యకు పాలనపై పట్టు లేదన్నారు. మంత్రులు తమ తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఓ వైపు అతివృష్టి, మరో వైపు అనావృష్టితో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం విదేశీ పర్యటన చేయడం సరికాదన్నారు. సీఎం చైనా పర్యటనకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 51 గనుల కంపెనీల లెసైన్సులు రద్దు చేయడం సరికాదని, ఇందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి గనులే ఎక్కువగా ఉన్నందున సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలన్నారు.

అక్రమ గనుల తవ్వకాలపై బెంగళూరు నుంచి బళ్లారికి పాదయాత్ర చేసిన సీఎం సిద్ధరామయ్య అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయినా అక్రమ గనులు తవ్వకాల విషయాన్ని సీబీఐకి అప్పగించకుండా మౌనంగా ఉన్నారన్నారు. బళ్లారిలో జరిగిన అక్రమ గనుల తవ్వకాలన్నింటిపైనా సీబీఐ విచారణ చేయాలని సూచించారు. నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన పై తేదీ ఇంకా ఖరారు కాలేదన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement