వికసించిన కమలం | Political Roundup 2014 | Sakshi
Sakshi News home page

వికసించిన కమలం

Published Fri, Dec 26 2014 2:18 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

వికసించిన కమలం - Sakshi

వికసించిన కమలం

పొలిటికల్ రౌండప్ 2014

పుంజుకున్న బీజేపీ
తడబడిన కాంగ్రెస్
 చతికిల పడిన జేడీఎస్

 
‘బీజేపీకు ఆయన అవసరం ఎక్కువ’ అని పేరుగాంచిన మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, బళ్లారి ప్రాం తంలో బీజేపీకి జవసత్వాలు నింపిన శ్రీరాములు... ఇలా చాలా మంది నాయకులు శాసనసభ ఎన్నికల సందర్భంగా బీజేపీ నుంచి వెళ్లిపోవడంతో 2013 ఏడాదిలో ఆ పార్టీ రాష్ట్రంలో చతికిల పడింది. అయితే 2014 ఏడాదిలో జరిగిన పార్లమెంటు ఎన్నికల సందర్భంగా యడ్యూరప్పతో పాటు శ్రీరాములు కూడా తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. దీంతో పార్టీ బలం పుంజుకొంది. ఈ పరిణామాలు పార్లమెంటు ఎన్నికల్లో ప్ర స్ఫుటంగా కనిపించాయి. రాష్ట్రంలోని మొత్తం 28 పార్లమెం టు స్థానాలకు గాను 17 స్థానాలను బీజేపీ తన ఖాతాలో వేసుకోగలిగింది. ఇందుకు ‘నమో’ గాలి కూడా దోహదం చేసిందని చెప్పవచ్చు. ఈ ఫలితాలతో సంతృప్తి చెందిన ప్రధాని నరేంద్రమోడీ కర్ణాటకకు ఏకంగా మూడు కేంద్ర మంత్రి పదవులను కేటాయించారు. అందులోనూ ప్రత్యేక బడ్జెట్ ఉన్న రైల్వే శాఖను క్లీన్ ఇమేజ్ ఉన్న సదానంద గౌడకు కేటాయించడం గమనార్హం. ఇక రసాయనాలు ఎరువుల శాఖను పార్లమెంటు ఎన్నికల్లో డబుల్ హాట్రిక్ సాధించిన అనంతకుమార్‌కు, సిద్దేశ్వర్‌కు పౌరవిమానయాన సహాయ శాఖ దక్కింది.

తిరిగి బీజేపీలోకి చేరి శివమొగ్గ నుంచి పార్లమెంటుకు ఎన్నికైన యడ్యూరప్పకు ఏకంగా పార్టీ జాతీయ ఉపాధ్యక్ష పదవి వరించింది. ఈ విధంగా కేంద్ర రాజకీయా ల్లో బీజేపీ రాష్ట్ర శాఖ తనదైన ముద్ర వేసింది. ఇక రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే శాసనసభ ఎన్నికల్లో జేడీఎస్, బీజేపీలకు సమానంగా 40 సీట్లు వచ్చినా ఓట్ల శాతం పరిణనలోకి తీసుకోవడంతో  ప్రధాన విపక్ష స్థానం జేడీఎస్‌ను వరించింది. అయితే పూర్వాశ్రమ నాయకులు య డ్డీ, శ్రీరాములు తదితర నాయకులు తిరిగి బీజేపీలోకి రావడంతో శాసన సభలో ఆ పార్టీ బలం పెరిగింది. దీంతో ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కడమే కాకుండా మాజీ ముఖ్యమంత్రి జగదీష్‌శెట్టర్‌ను ప్రధాన విపక్ష నాయకుడి హోదాను కట్టబెట్టింది. బీజేపీ రాష్ట్ర శాఖ రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా తెలంగాణకు చెందిన మురళీధర్‌రావు నియామకం, గవర్నర్‌గా బీజేపీకు చెందిన వజుభాయ్ రుడాభాయ్ వాలా నియామకం రాజకీయ పరంగా చెప్పుకోదగ్గ పరిణామాలు. ఇదిలా ఉండగా 2014లో బీజేపీలో కొన్ని అపశృతులూ లేకపోలేదు.

శాసన సభకు జరిగిన ఉప ఎన్నికల్లో బళ్లారి గ్రామీణ నియోజకవర్గం చేజారి పోవడం ఇందులో ప్రధానమైందని చెప్పవచ్చు. అంతేకాక సరైన పనితీరు కని పించడం లేదంటూ సదానందగౌడను రైల్వేశాఖ నుంచి ప్ర ధాని మోదీ తప్పించారు. అదేవిధంగా శీతాకాల సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ప్రభుచౌహాన్ శాసనసభ కార్యకలాపాలు జరుగుతున్న సమయంలోనే సెల్‌ఫోన్ చూస్తూ పట్టుబడటం ఆ పార్టీ రాజకీయ చరిష్మాకు తగిలిన ఎదురుదెబ్బ. ఇలాంటి రెండు మూడు విషయాలను పక్కన పెడితే 2014 ఏడాది బీజేపీకు రాజకీయంగా కలిసొచ్చిందనే చెప్పవచ్చు.

ఆద్యంతం అనైక్యతా రాగమే

 ఒకటి రెండు తప్ప కాంగ్రెస్ పార్టీలో 2014 ఏడాదిలో రాజకీయ మెరుపులు తక్కువే. ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ‘నమో’ గాలిలో కొట్టుకుపోగా కర్ణాటకలో మాత్రం 9 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇది మంచి విజయమేనని చెప్పవచ్చు. ఇక పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్‌లీడర్‌గా కర్ణాటకకే చెందిన మల్లికార్జున ఖర్గేకు కాంగ్రెస్ హైకమాండ్ పదవిని కట్టబెట్టింది. ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ జాతీయస్థాయిలో కొంత గుర్తింపు పొం దింది. అయితే రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీ ఈ ఏడాది ఆరం భం నుంచి విపక్ష నాయకులే కాకుండా స్వపక్ష నాయకుల నుంచి కూడా విమర్శలను మూటగట్టుకుంది.  పార్లమెంటు ఎన్నికల సందర్భంగా పార్టీలో అసమ్మతి మిన్నంటడంతో మండ్యా, మైసూరు సిట్టింగ్ ఎంపీలైన రమ్యా, విశ్వనాథ్‌లు పరాజయంపాలు కావాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా ఐటీ దిగ్గజ్జం నందన్‌నిలేఖని పార్లమెంటు ఎన్నికల సందర్భంగా పార్టీలో చేరి బెంగళూరుదక్షిణ టికెట్టును దక్కించుకున్నారు. అయితే అనంతకుమార్ చేతిలో ఓడిపోయిన తర్వాత తిరిగి ఇప్పటి వరకూ కేపీసీసీ ప్రధాన కార్యాలయం మొహం చూడకపోవడం గమనార్హం.  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్‌సింగ్, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌కు మంత్రిమండలిలో స్థానం అని అక్టోబర్‌లో ప్రకటించినా ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. దీంతో పభుత్వసారధి సీఎం సిద్ధరామయ్య, రాష్ట్రంలో పార్టీ సారధి అయిన కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌కు మధ్య జరుగుతున్న కోల్డ్‌వార్ కాస్తా బహిర్గతమయిపోయింది. ఏడాదిన్నర కా లంగా ఊరిస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ నవంబర్ చివర్లో జరిగినా ఇప్పటికీ అసమ్మతి చిచ్చు మాత్రం ఆరలేదు. ఈ విషయంపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి అంబరీష్ అలిగి గుల్బర్గాలో జరిగిన మంత్రి మండలికి గైర్హాజరయ్యారు.

మరోవైపు మంత్రులు అందుబాటులో లేకపోవడం వల్ల నియోజక వర్గంలో అభివృద్ధి జరగడంలేదని నిధుల కేటాయింపుల కోసం కమీషన్‌లు వసూలు చేస్తున్నారని శీతాకాల సమావేశాల సందర్భంగా బెళగావిలో జరిగిన సీఎల్పీ సమావేశాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే విమర్శించడం ఆపార్టీలో ఉన్న అనైక్యత తేటతెల్లమయ్యింది. మరో వైపు మంత్రి స్థానంలో ఉన్న అంబరీష్ శాసనసభలో సెల్‌ఫోన్‌లతో కాలం గడపడం, తాను 300 అమ్మాయిలతో తిరిగానని చెప్పడం ఆ పార్టీకు తల ఒంపులు తీసుకువచ్చింది. అయితే ఈ ఏడాది జ రిగిన ఉప ఎన్నికల్లో బళ్లారిగ్రామీణ నియోజక వర్గం స్థానం తో సహా రెండు స్థానాలను కైవసం చేసుకోవడం రాష్ట్రంలో రాజకీయంగా ఆ పార్టీకు కొంత ఊరట ఇచ్చే విషయం.

ఉనికికోసం పాకులాట

జేడీఎస్‌తో పాటు అమ్ ఆద్మీ పార్టీలు ఈ ఏడాది రాష్ట్రంలో ఉనికి కోసం పడరాని పాట్లు పడ్డాయి. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కొంతమంది ఎమ్మెల్యేలు పూర్వాశ్రమమైన బీజేపీలోకి చేరడంతో జేడీఎస్‌కు శాసనసభలో ప్రధాన విపక్షహోదా దూరమయ్యింది. ఈ ఏడాది రాజకీయంగా ఆ పార్టీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ. ఇక పార్లమెంటు ఎన్నికల సందర్భం గా సరైన అభ్యర్థులు లేక ఆ పార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ముఖ్యంగా టికెట్టు కేటాయించినా కూడా ఉత్తర కన్నడ జేడీఎస్ అభ్యర్థి శివానంద నాయక్ ఉప సంహరణ చివరి రోజు ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవడం ఆ పార్టీ దీన స్థితిని తెలియజేస్తుంది. పార్లమెంటు ఎన్నికల్లో చిక్కబళాపుర నుంచి పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి శాసన సభలో జేడీఎస్ ఫ్లోర్‌లీడర్ అయిన కుమార స్వామి ఓడిపోయారు. ఇలాంటి పరిణామాలతో పార్లమెంటు ఎన్నికల్లో 28 స్థానాలకు గాను కేవలం రెండు చోట్ల మాత్రమే గెలుచుకుని ఎన్నికల సమరంలో మూడో స్థానంతో జేడీఎస్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది.  తదనంతర పరిణామాల్లో జేడీఎస్ జాతీయాధ్యక్షుడు దేవెగౌడ  రాష్ట్ర రాజకీయాలకు కేంద్రబిందువైన బెంగళూరు నుంచి తన మకాంను హాసన్‌కు మార్చడం కూడా ఆ పార్టీలో రాజకీయంగా చోటు చేసుకున్న మార్పులు. ఇక పార్టీ జరిపిన శాసనసభ పక్ష సమావేశాలకు చాలా మంది నాయకులు గైర్హాజరు కావడం, జమీర్ అహ్మద్, బసవరాజ్ బొమ్మయ్ లాంటి అగ్రశ్రేణి నాయకులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటమే కాకుండా ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడైన కుమారస్వామి పై బహిరంగ విమర్శలకు దిగారు. పార్టీ రాష్ట్రాధ్యక్షుడుగా ఉన్న కృష్ణప్ప హఠాన్మరణం తర్వాత చాలా కాలం ఖాళీగా ఉన్న పార్టీ రాష్ట్రాధ్యక్ష పదవిలో కుమారస్వామిని కూర్చోబెట్టడంతో ‘జేడీఎస్ అప్ప మక్కల పార్టీ’ అన్న విమర్శల చట్రం నుంచి బయటకు రాలేకపోవడం ఇంటా బయట విమర్శలకు దారి తీసింది.

ఇక శాసనసభలో ఫ్లోర్ లీడర్ కుమారస్వామికి సరైన మద్దతు లభించక పోవడం ఆ పార్టీలోని అనైక్యతకు పరాకాష్ట. మొత్తంగా జేడీఎస్‌కు 2014 కూడా చేదు అనుభవాలనే మిగిల్చింది. ఇదిలా ఉండగా పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా కర్ణాటకలో పాగా వేయాలని భావించిన ఆమ్ ఆద్మీ పార్టీకి ముఖభంగం తప్పలేదు. ఆ ఎన్నికల్లో ఐటీ దిగ్గజం బాలకృష్ణన్ ఆప్ తరఫున ఎన్నికల బరిలో దిగడం... స్వయంగా కేజ్రీవాల్ ప్రచారం చేసినా కూడా ఒక్క సీటు గెలుచుకోవడం అటుంచి. కనీసం ఒక్క స్థానంలో కూడా రెండో స్థానంలో నిలబడలేక పోయింది. మరోవైపు 28 పార్లమెంటు స్థానాల్లో నోటా (నన్ ఆఫ్ ది అబౌ) కింద 2,57,873 ఓట్లు రాగా, ఆప్‌కు అంతకంటే తక్కువగా 2,54,501 ఓట్లు మాత్రమే వచ్చాయంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థితిలో ఉన్న జేడీఎస్, పరాదర్శక పాలన నినాదంతో రాష్ట్రంలోకి అడుగుపెట్టిన ఆప్‌లు 2014లో పార్టీ బలోపేతానికి కాక పార్టీ ఉనికి కోసం పాట్లు పడ్డాయని చెప్పవచ్చు.     
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement