వేసవికాలం ఎండలకు సమాంతరంగా కర్ణాటకలో ఎన్నికల వేడి రోజురోజుకు పెరిగిపోతోంది. అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీజేపీ బలగాలను మోహరిస్తున్నాయి. వ్యూహ, ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్ ఉపఎన్నికల్లో దెబ్బతిన్న (సాక్షి ప్రత్యేకం) బీజీపీకి కర్నాటక ఎన్నికల్లో పాగా వేయడం తక్షణ అవసరం. అలాగే నరేంద్రమోడికి వ్యతిరేకంగా భావ సారూప్యత ఉన్నా లేకున్నా శత్రువు శత్రువులని కూడగట్టుకొని బీజేపీని చావుదెబ్బకొట్టి కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవడం రాహుల్ గాంధీకి తక్షణ కర్తవ్యం.
ఎన్నికలు కర్ణాటక విధానసౌధ కోసం అయినా.... నమో, రాగాలకు ఇవి 2019 ఎన్నికలకు ముందు ప్రతిష్టాత్మకమైనవే.. గణాంకాలు ఏమి చెప్పినా, కుల సమీకరణాలు ఎలా ఉన్నా అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడానికి రెండు పార్టీలు సిద్ధంగా లేవు.
గత అసెంబ్లీ ఎన్నికలకు (2013) ముందు కర్ణాటక జనతాపక్ష పార్టీ ఏర్పాటు చేసి 9.8 శాతం ఓట్లు 6 సీట్లు సాధించిన మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తిరిగి సొంతగూటికికి చేరి బీజేపి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తన అదృష్టాన్ని, పార్టీ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఇప్పటికే 75 రోజుల పాటు రాష్ట్రమంతా పర్యటించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై విమర్శలు దాడి మొదలు పెట్టేసారు. ఫిబ్రవరి 4న జరిగిన బెంగుళూరు సభలో ప్రధాని నరేంద్రమోడి సిద్ద రామయ్య ప్రభుత్వ అవినీతిని ఉద్దేశించి ‘‘10 శాతం ప్రభుత్వం’’ గా చిత్రీకరించారు. కర్ణాటకలో రాజకీయ హింస కాదు... రాజకీయ తీవ్రవాదం రాజ్యమేలుతోందని దాడికి దిగారు. గత అయిదు సంవత్సరాల్లో 23 మంది బీజేపీ నాయకుల హత్యలు జరిగాయనేది ఆ పార్టీ ఆరోపణ. అదే సమయంలో గౌరీలంకేశ్ హత్యపై ప్రధాని మౌనం ఇబ్బంది కలిగించే అంశమే.
ఫిబ్రవరి 4కి ఇప్పటికి పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఉత్తరప్రదేశ్, బీహార్ ఎన్నికల్లో బీజీపీ చావుదెబ్బతినడం ఆ పార్టీ వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ని ప్రచారస్త్రంగా వినియోగించుకోవాలన్న ఎత్తుగడ విషయంలో ఆ పార్టీ పునరాలోచనలో పడింది. (సాక్షి ప్రత్యేకం) యోగీ ముందు ఉత్తరప్రదేశ్ గురించి ఆలోచిస్తే బాగుంటుందని సిద్దరామయ్య విమర్శల దాడి మొదలుపెట్టారు.
బీజీపీ (2008–2013) హయాంలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. అవినీతి ఆరోపణలు, కుమ్ములాటలు మత ఉద్రిక్తతలు ఆ పార్టీని చావు దెబ్బ తీసాయి. 2013 ఎన్నికల్లో అధికారం కోల్పోయి 40 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దేవెగౌడ పార్టీ బీజీఎస్ తో సమానంగా సీట్లు గెలుచుకున్నప్పటికి ఆ పార్టీ కన్నా తక్కువశాతం ఓట్లతో మూడోస్థానంతో సరిపెట్టుకొంది. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న సిద్దరామయ్య బలమైన నాయకుడిగా నిలదొక్కుకున్నారు. అయితే శాంతిభద్రతలు, అవినీతి ఆరోపణలు, రైతుల ఆత్మహత్యలు (ఈ ఐదేళ్ల కాలంలో దాదాపు 4000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు గణాంకాలు చెపుతున్నాయి) సిద్ధరామయ్యకు ఇబ్బందికరమైన అంశాలు. బీజీపీ ఈ అంశాలనే ప్రచారాస్త్రాలుగా వాడుకొంటున్నాయి. (సాక్షి ప్రత్యేకం)
ఇక 1985 తర్వాత ఏ పార్టీ కూడా కర్ణాటకలో రెండవసారి అధికారంలోకి రాలేదు. ఏ ముఖ్యమంత్రి కూడా రెండవసారి ప్రమాణ స్వీకారం చేయలేదు. దళితులు, వెనకబడిన తరగతులు, కురబలు, ముస్లింల ఓట్లపై కాంగ్రెస్ ఆధారపడుతూ వస్తోంది. లింగాయత్‌లు, బ్రాహ్మణులు బీజేపీ అండగా ఉంటోండగా మరో బలమైన పార్టీ జేడీఎస్ వక్కళిగల ఓటుబ్యాంక్‌పై నమ్మకాన్ని పెట్టుకున్నాయి.
2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అసెంబ్లీ సెగ్మంట్ల వారీగా పరిశీలిస్తే బీజేపీ 132 అసెంబ్లీ సీట్లలో మెజారిటీ సాధించింది. కాంగ్రెస్ 77 సీట్లలో మెజారిటీ సాధించగా, జీజీఎస్ 15 స్థానాలకే పరిమితమైంది. అయితే అప్పటి మోడీ హవా వేరు. (సాక్షి ప్రత్యేకం) గత సంవత్సర కాలంలో 10 రాష్రాల్లో ఎన్నికలు జరగగా బీజేపీ , బీజేపీ మిత్ర పక్షాలు తొమ్మిందింటిలో పాగా వేశాయి. పంజాబ్ మినహా.. దేశంలో 21 రాష్ట్రాల్లో కాషాయం జెండా రెపరెపలాడుతోంది. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో లింగాయత్‌లకు ప్రత్యేక మతహోదా కల్పిస్తూ సిద్దరామయ్య ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. రాష్ట్ర జనాభాలో 17% లింగాయత్‌లు ఇప్పటివరకు బీజేపీకి మద్దతుగా ఉన్నారు.
నాలుగు దశాబ్ధాల్లో ఐదు సంవత్సరాల పూర్తి కాలం పనిచేసిన మొట్టమొదటి కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రికార్డు సృష్టించారు. ఈ ఐదు సంవత్సరాల్లో బలమైన నాయకుడిగా ఎదిగారు సిద్ధరామయ్య. మంత్రులపైన అవినీతి ఆరోపణలు కాంగ్రెస్‌కు సిద్ధరామయ్యకు కొంచెం చికాకు కలిగించే అంశాలే. సిద్దరామయ్య చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, కన్నడిగుల ఆత్మగౌరవ నినాదంతో తలపెట్టిన ‘ప్రత్యేక జండా’ ఉద్యమం వెనుకబడిన కులాలు, దళితులు, ముస్లింల మద్దతు కాంగ్రెస్‌కు కలిసివచ్చే అంశాలు. (సాక్షి ప్రత్యేకం) ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయలేమి, కాంగ్రెస్ సంస్కృతిలో భాగమైన గ్రూపులు. కాంగ్రెస్‌కు ప్రతిబంధకాలుగా కనపడుతున్నాయి.
పది సంవత్సరాల క్రితం వింధ్య పర్వతాలకు ఈవల మొదటిసారిగా పాగా వేసిన బీజేపి బలమైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన యడ్యూరప్పని ముఖ్యమంత్రిని చేసింది. తర్వాత జరిగిన వివిధ పరిణామాల వల్ల ముగ్గురు ముఖ్యమంత్రులు మారి 2013లో పీఠం కోల్పోయింది. యడ్యూరప్ప తప్ప మరో బలమైన నాయకుడిని తయారు చే సుకోలేకపోయిన బీజీపి ఈ సారి కూడా యడ్యూరప్పని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేస్తోంది. (సాక్షి ప్రత్యేకం) అలాగే బీజీపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా చాణక్యం, ప్రధానమంత్రి మోడీ ఆకర్షణలో గట్టెక్కాలని బీజీపి ఆరాటం. అంతర్గత కుమ్ములాటలు కూడా అధిగమించడం బీజీపికి తక్షణ అవసరం.
మూడో ప్రధానమైన పార్టీ జేడీఎస్ తండ్రీకొడుకుల పార్టీ ముద్ర నుండి బయటపడలేక పోయింది. అసంఘటితరంగ కార్మికుల్లో కుమారస్వామికి మంచిపేరే ఉంది. బీఎస్‌సీ, వామపక్ష పార్టీలతో పొత్తు కొంత వరకు కలిసి వచ్చే అంశం.
అటు రాహుల్ గాంధీ, ఇటు అమిత్‌షా సర్వశక్తులూ ధారపోసి కర్ణాటకలో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. పంజాబ్ తర్వాత హస్తం చేతుల్లో ఉన్న పెద్ద రాష్ట్రం కర్ణాటక మాత్రమే. ఉత్తరప్రదేశ్, బీహార్ ఉప ఎన్నికల్లో ఎదురు దెబ్బతిన్న బీజేపీకి కర్ణాటకలో షాక్ ఇచ్చి 2019 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం అవాలనేది కాంగ్రెస్ వ్యూహం. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ కొట్టాలనేది బీజేపీ ప్రతివ్యూహం. (సాక్షి ప్రత్యేకం) కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే ఆ గెలుపు రాహుల్ గాంధీ ఖాతాలోకి వెళుతుంది. తద్వారా జాతీయ స్థాయిలో జరుగుతున్న రాజకీయ శక్తుల పునరేకీకరణ కార్యక్రమంలో కాంగ్రెస్ తన మాటను చెల్లించుకునే అవకాశం దొరుకుతుంది. ఓడిపోతే... ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’’ ... షా... మోడీల నినాదానికి ప్రజల మద్దతు దొరికినట్టు అవుతుంది. ఎన్నికలు మే 12న ... ఫలితాలు మే 15న ... నడివేసవిలో కమలం వికసిస్తుందా... హస్తం పిడికిలి బిగిస్తుందా...
ఎస్ . గోపీనాథ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment