
అద్వానీపై యడ్యూరప్ప ఫైర్
బెంగళూరు : నరేంద్రమోదీ ప్రధాని కావడాన్ని సహించలేకే బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీతో పాటు మరికొంత మంది నేతలు ఆయనపై విమర్శలకు దిగుతున్నారని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప పేర్కొన్నారు. గురువారం బెంగళూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... నరేంద్రమోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సారథ్యంలో ఇప్పటి వరకు బీజేపీ ఎన్నో విజయాలు సాధించిందని అన్నారు.
అయితే అదే సమయంలో ఆ విజయాలన్నీ తమ కారణంగానే లభించాయని మోదీ, అమిత్ షాలు ఏనాడూ చెప్పుకోలేదని తెలిపారు. బీహార్ ఓటమికి కేవలం నరేంద్రమోదీ, అమిత్‌షాలను మాత్రమే బాధ్యులను చేయడం ఎంతమాత్రం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ ఓటమి నుంచి బీజేపీలోని వారందరూ పాఠాలు నేర్చుకోవాల్సి ఉందని అన్నారు. ఇక పార్టీ వైఖరికి సంబంధించి ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉంటే వాటిని నాలుగ్గోడల మధ్య చర్చించుకుని, పరిష్కరించుకోవాలి తప్ప ఇలా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని హితవు పలికారు.