- రాష్ర్టంలో కుంటు పడుతున్న అభివృద్ధి
- నత్తనడకన సంక్షేమ పథకాలు
- అధికారులు, మంత్రుల మధ్య సమన్వయ లోపం
- మంత్రుల మధ్య లోపిస్తున్న సఖ్యత
సాక్షి, బెంగళూరు : వివిధ ప్రభుత్వ శాఖలకు అవసరమైన నిధులు విడుదల చేయడంలోనూ ఆర్థిక వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంలోను సిద్ధరామయ్య ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటు పడుతోంది. సంక్షేమ పథకాలు నత్తనడకన సాగుతున్నాయి.
2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌లో రూ. 66,463 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ ఆర్థిక ఏడాది తొలి నాలుగు నెలల్లో రూ.9,196 కోట్లు విడుదల కాగా, ఇప్పటి వరకు రూ. 4,751 కోట్లను వివిధ పథకాలు, అభివృద్ధి కోసం వెచ్చించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో బడ్జెట్‌లో పేర్కొన్న పథకాలు ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. అంతేకాక గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని సంక్షేమ పథకాలను కొనసాగించలేని పరిస్థితి నెలకొంది.
లోపించిన సఖ్యత
రాష్ట్ర మంత్రుల మధ్య సఖ్యత లోపించింది. మరోవైపు అధికారులు, మంత్రుల మధ్య సమన్వయం లేకుండా పోయింది. ఈ వైఖరిల వల్లనే నిధుల వినియోగం సక్రమంగా కాకపోవడానికి కారణమవుతున్నట్లు తెలుస్తోంది. ఎస్‌సీ, ఎస్‌టీ పాడి రైతులకు ప్రోత్సహాకాన్ని రూ. 4కు అదనంగా రూ. 2 పెంచే విషయంపై పశుసంవర్ధక శాఖ మంత్రి టి.బి.జయచంద్ర, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి హెచ.ఆంజనేయులు ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఏకాభిప్రాయానికి రాకపోవడం వల్ల ఆ పథకం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. దీంతో సాంఘిక సంక్షేమ శాఖలో నిధులున్నా ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొంది.
ఇక ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల క్షేత్ర స్థాయిలో పనులు సక్రమంగా సాగడం లేదు. ‘రాష్ట్రంలోని 32 ప్రభుత్వ శాఖల్లో దాదాపు 1.90 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మానవ వనరులు తక్కువగా ఉండటం వల్ల అభిృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సరిగా జరగడంలేదు. దీంతో ఆయా శాఖలకు కేటాయించిన నిధులు మురిగిపోతున్నాయి.’ అని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సభ్యుడు రామకృష్ణ పేర్కొన్నారు.