బెల్గాం విషయమై మహారాష్ట్రకు చెందిన నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసహనం వ్యక్తం చేశారు.
సాక్షి, బెంగళూరు : బెల్గాం విషయమై మహారాష్ట్రకు చెందిన నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసహనం వ్యక్తం చేశారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసిన బెల్గాంను మహారాష్ట్రకు వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. బెల్గాంలో ఆయన మీడియాతో ఆదివారం మాట్లాడుతూ... మహాజన్ నివేదికను అనుసరించి బెల్గాం ప్రాంతం కర్ణాటకకు చెందుతుందన్నారు.
అయితే ఈ విషయంలో రాజకీయ ప్రయోజనం ఆశించి కొంతమంది నాయకులు స్థానిక ప్రజల శాంతియుత జీవనానికి ఆటంకం కలిగిస్తూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో భాగంగా శికారిపురలో మాత్రం కాంగ్రెస్‌కు జేడీఎస్ మద్దతు ఇస్తోందని తెలిపారు. అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయడం కోసమే కేపీఎస్‌సీ11 నియామకాలను రద్దు పై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.