పెల్లుబికిన నిరసన
- మంత్రి మండలి నిర్ణయంపై గెజిటెడ్ ప్రొబెషనరీ అభ్యర్థుల ఆగ్రహం
- ఒకరి ఆత్మహత్యాయత్నం
- కొనసాగుతున్న ధర్నా
సాక్షి, బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన గురువారంజరిగిన మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. బాధితుల్లో కొంతమంది బెంగళూరులో అత్మహత్య యత్నం కూడా చేయడం గమనార్హం.
వివరాలు... 2011లో గెజిటెడ్ ప్రొబెషనరీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని సీఐడీ దర్యాప్తులో తేలడంతో సదరు నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు మంత్రి మండలి తాజాగా నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఆ పోస్టులకు నూతన నోటిఫికేషన్ విడుదలకు అంగీకారం తెలిపింది. ఇక 2011లో గెజిటెడ్ ప్రొబెషనరీ పరీక్ష రాసిన అభ్యర్థులకు తాజాగా పరీక్షలు రాయదల్చుకుంటే వయోపరిమితి సడలింపు ఇవ్వడానికి మంత్రిమండలి సభ్యులు సమ్మతించారు.
అయితే అప్పటి నోటిఫికేషన్‌కు సంబంధించి ఇంటర్వ్యూ కూడా పూర్తిచేసుకుని ఉద్యోగానికి ఎంపికయిన 362 మంది అభ్యర్థులు ప్రభుత్వ తాజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బెంగళూరులోని ఫ్రీడం పార్కు వద్ద ధర్నా చేపట్టారు. ఒకరిద్దరు చేసిన పనికి ఎంతో కష్టపడి ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల భవిష్యత్తును బలిచేయడం సరికాదని వారు వాపోయారు.
ఇదిలాఉండగా ఫ్రీడం పార్క్ వద్ద ఉషారాణి అనే అభ్యర్థి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించారు. అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో తప్ప తాము ఎవరితోనూ మాట్లాడబోమని అభ్యర్థులు తేల్చి చెప్పారు. గురువారం రాత్రి పొద్దుపోయేంతవరకూ బాధిత అభ్యర్థులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ఫ్రీడం పార్కు వద్ద ధర్నా చేస్తూనే ఉన్నారు.