తుమకూరులో ఈ నెల 24 ప్రధాని నరేంద్ర మోడీ సభలో పాల్గొంటానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. నగరంలోని ఛాన్సెరీ పెవిలియన్...
- సీఎం సిద్ధరామయ్య వెల్లడి
- అది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి హాజరవుతా
- లేకుంటే ఆ కార్యక్రమాన్ని బీజేపీ హైజాక్ చేస్తుంది
- బీజేపీ హయాంలో జరిగిన డీ నోటిఫికేషన్లపై దర్యాప్తు చేయిస్తా
- దసరా అనంతరం కార్పొరేషన్లు, బోర్డుల నియామకాలు
- బీబీఎంపీ విభజన వల్లే సమస్యల పరిష్కారం
- మూడు డివిజన్లుగా విభజించే యోచన
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : తుమకూరులో ఈ నెల 24 ప్రధాని నరేంద్ర మోడీ సభలో పాల్గొంటానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. నగరంలోని ఛాన్సెరీ పెవిలియన్ హోటల్‌లో శనివారం రోజంతా జరిగిన కేపీసీసీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతున్న సందర్భంగా, మోడీ సభలో పాల్గొనవద్దని పదాధికారులు డిమాండ్ చేశారు.
మహారాష్ట్రలో మన పార్టీకి చెందిన ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, మోడీ సభలో పాల్గొన్నప్పుడు చేదు అనుభవం ఎదురైందని గుర్తు చేశారు. కనుక ఆ సమావేశానికి వెళ్లకపోవడమే మంచిదని సూచించారు. దీనిపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ కార్యక్రమం కనుక ప్రధాని పాల్గొనే సభకు ముఖ్యమంత్రిగా తాను హాజరు కావడం రాజ్యాంగ విధి అని అన్నారు. ఒక వేళ తాను హాజరుకాకపోతే బీజేపీ ఈ మొత్తం కార్యక్రమాన్నే హైజాక్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కనుక ఏదెలా ఉన్నా ప్రోటోకాల్‌ను పాటించడం తన కర్తవ్యమని ఆయన చెప్పారు.
బీజేపీ డీ నోటిఫికేషన్లపై దర్యాప్తు
రాష్ర్టంలో బీజేపీ హయాంలో జరిగిన పది వేల ఎకరాల డీ నోటిఫికేషన్ వ్యవహారంపై దర్యాప్తు జరిపిస్తానని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్కటంటే ఒక ఎకరాను కూడా డీనోటిఫై చేయలేదని తెలిపారు.
బీజేపీ నాయకులు అసత్యాలను వాస్తవాలుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కనుక వారి హయాంలో జరిగిన డీనోటిఫికేషన్లపై దర్యాప్తు జరిపించడం ద్వారా వారి అసలు రంగు బయటపెడతానని సవాలు విసిరారు. కాంగ్రెస్ రహిత భారత్ అంటూ బీజేపీ వారు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. దసరా అనంతరం కార్పొరేషన్లు, బోర్డుల నియామకాలను చేపడతామని ఆయన వెల్లడించారు.
మూడుగా బీబీఎంపీ
పాలనా సౌలభ్యం దృష్ట్యా బీబీఎంపీని మూడు డివిజన్లుగా విభజించాలని యోచిస్తున్నట్లు సీఎం తెలిపారు. దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ, నివేదిక సమర్పించిన వెంటనే ప్రభుత్వ నిర్ణయం వెలువడుతుందన్నారు. బెంగళూరు నగర విస్తీర్ణం ఇప్పుడు 80 చదరపు కిలోమీటర్లు దాటిపోయిందని, దీని వల్ల అనేక పాలనా సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. బీబీఎంపీ విభజనే దీనికి పరిష్కారమని ఆయన స్పష్టం చేశారు..