రాష్ర్టంలో అధికార కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. తన వ్యవహార శైలి పట్ల ఎమ్మెల్యేలు అసంతృప్తితో లేరని తెలిపారు.
=కొట్టిపారేసిన సీఎం సిద్ధు
=కాంగ్రెస్‌లో విభేదాలు లేవు
=ఎమ్మెల్యేలలో అసంతృప్తి లేదు
=ఇది ప్రతిపక్షాల కుట్రే
=నీరు, రోడ్లు, విద్యుత్ సౌకర్యాలు కల్పిస్తాం
= రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడమే లక్ష్యం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో అధికార కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. తన వ్యవహార శైలి పట్ల ఎమ్మెల్యేలు అసంతృప్తితో లేరని తెలిపారు. బీదర్‌లో గురువారం ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారులు, ఉద్యోగుల బదిలీల్లో ముఖ్యమంత్రి తమ సూచనలను పెడచెవిన పెడుతున్నారని ఆరోపిస్తూ 20 మంది ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు వచ్చిన కథనాలపై ఆయన స్పందిస్తూ, తమ పార్టీలో ఎలాంటి అసమ్మతి, అపస్వరాలు లేవని తేల్చి చెప్పారు.
అందరూ ఒకటిగానే సాగుతున్నామని చెప్పారు. ప్రతి పక్షాలు అభూత కల్పనతో ఆరోపణలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. తద్వారా గందరగోళాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌లో అసమ్మతిపై తమ కంటే ప్రతిపక్షాలే ఎక్కువగా ఆందోళన చెందుతున్నాయని ఎద్దేవా చేశారు. కాగా తాగు నీరు, రోడ్లు, విద్యుత్ సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వెనుకబడిన ప్రాంతాలు, పట్టణాలు, నగరాలను అభివృద్ధి చేయడం ద్వారా దేశంలోనే తొలి స్థానంలో నిలవాలని లక్ష్యం విధించుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో సాగు నీటి పథకాలకు ఏటా రూ.10 వేల కోట్ల చొప్పున, వచ్చే ఐదేళ్లలో రూ.50 వేల కోట్లను ఖర్చు చేయాలని సంకల్పించామన్నారు.