ముసాయిదాలను కన్నడలోనే రూపొందించండి | Create Kannada Drafts | Sakshi
Sakshi News home page

ముసాయిదాలను కన్నడలోనే రూపొందించండి

Published Mon, Oct 21 2013 12:48 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

Create Kannada Drafts

 

= ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
 = కన్నడలో తీర్పు చెప్పిన న్యాయమూర్తులకు సన్మానం

 
సాక్షి,బెంగళూరు: రాష్ట్ర చట్టసభల్లో ప్రవేశపెట్టే ముసాయిదాలను మొదట కన్నడలో రూపొందించి అటుపై ఆంగ్లంలోకి తర్జుమా చేయాలని దీని వల్ల మాతృభాషకు ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధికి తోడ్పడిన వాళ్లమవుతామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో కన్నడలో తీర్పు చెప్పిన 48 మంది న్యాయమూర్తులకు బెంగళూరులోని రవీంద్ర కళాక్షేత్రలో కన్నడ ప్రాధికార సంస్థ ఆదివారం సన్మాన కార్యక్రమం నిర్వహించింది.

ఈ సందర్భంగా సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ... ప్రస్తుతం శాసనసభ, శాసనమండలిలో ప్రవేశపెట్టే ముసాయిదాలను మొదట ఇంగ్లీషులో రూపొందించి తర్వాత కన్నడలోకి మారుస్తున్నారని గుర్తుచేశారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని ఇందుకు అవసరమైన నిబంధనలు రూపొందించాల్సిందిగా న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి టీ.బీ జయచంద్రకు సూచించారు. కన్నడ భాషకు ఎంతో చరిత్ర ఉందన్నారు. ఎనిమిది మంది కన్నడ సాహితీవేత్తలకు జ్ఞానపీఠ పురస్కారం అందిందన్నారు. ఇంతటి ఘనచరిత్ర ఉన్న కన్నడపై ప్రజలకు ఆసక్తి తగ్గుతోందనే విమర్శలు రావడం సరికాదన్నారు.
 
కన్నడ భాషలో చదివిన వారు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉన్నత స్థానాలకు వెళ్లరనే ఆలోచన వీడాలని ఈ సందర్భంగా సీఎం సిద్ధరామయ్య ప్రజలకు హితవు పలికారు. హైకోర్టు, సుప్రీం కోర్టులో కన్నడలో వాదన లు చేయడానికి, తీర్పును వెలువరించడానికి కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవమన్నారు. అయితే రాష్ట్రంలోని కొన్ని చోట్ల కోర్టు వ్యవహారాలకు సంబంధించి కన్నడ భాష ఉపయోగించుకోవడానికి అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితిని పూర్తిగా సద్వినియోగం చేసుకుని న్యాయవాదులు కన్నడలోనే వాదనలు వినిపించాలన్నారు.

అదేవిధంగా న్యాయమూర్తులు కూడా కన్నడలోనే తీర్పు వెలువరించాలని సీఎం సిద్ధు అభిప్రాయపడ్డారు. దీని వల్ల సామన్య ప్రజలకు కూడా కోర్టు వ్యవహారాలు అర్థమవుతాయన్నారు. కాగా, కార్యక్రమంలో భాగంగా సన్మానం పొందిన ఒక్కొక్క న్యాయమూర్తికి రూ.10 వేల నగదు, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో కన్నడ ప్రాధికార సంస్థ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రు, సీనియర్ జడ్జి ఎన్.కుమార్ తదితరులు  పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement