అత్యాధునికం
- రూ. 39.25 కోట్లతో పిణ్యా బస్‌స్టాండ్ ఏర్పాటు
- ప్రారంభించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
సాక్షి, బెంగళూరు : స్థానిక ప్రముఖ పారిశ్రామిక కేంద్రం పిణ్యాలో అత్యాధునిక సౌకర్యాలతో కేఎస్‌ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటైంది. 6.29 ఎకరాల్లో రూ. 39.25 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ బస్టాండ్‌ను రాష్ర్ట ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం ప్రారంభించారు. ఈ బస్టాండ్ పనులు 2008 అక్టోబర్ 24న ప్రారంభమయ్యాయి. కాగా, ఈ బస్టాండ్‌లో వచ్చే నెల 1 నుంచి బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. బస్టాండ్ బేస్‌మెంట్, గ్రౌండ్‌ఫ్లోర్ కాక రెండు అంతస్తులు ఉన్నాయి.
ఇందులో కేఎస్ ఆర్టీసీ బస్సులు నిలిపేందుకు బేస్‌మెంట్‌లో 26, అప్పర్ ఫ్లోర్‌లో 17 ప్లాట్‌ఫాంలు ఏర్పాటు చేశారు. బస్టాండ్‌లో ప్రైవేట్ సంస్థలు తమ వాణిజ్య కార్యకలాపాలు సాగించుకునేందుకు సంస్థ అవకాశం కల్పిస్తోందిఇ. మరోవైపు ప్రయాణికుల కోసం పార్కింగ్ వ్యవస్థ, లగేజీ కౌంటర్, వెయిటింగ్ లాంజ్, ముందస్తు రిజర్వేషన్ తదితర సౌకర్యాలను సంస్థ కల్పించింది.
ఈ శాటిలైట్ బస్‌స్టాండ్ నుంచి బెంగళూరులోని కెంపేగౌడ, శాంతినగర బస్‌స్టేషన్‌లకు 32 కనెక్టింగ్ బీఎంటీసీ బస్సులను కూడా అధికారులు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. కాగా, ఇక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ చోట్లకు బయలుదేరే బస్సులు, వాటి సమయం తదితర వివరాల కోసం 080-22221321, 22221223 లో సంప్రదించవచ్చు.