మాకీ గతేంటి?
- అధికారుల తీరుపై సీఎం సిద్ధు సీరియస్
- మీ నిర్లక్ష్యంతో మాకు ఇబ్బందులు
- ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలి
- ప్రతి మూడు నెలలకు ఓసారి సమీక్ష నిర్వహించాలి
- జిల్లా ఇన్‌చార్‌జ మంత్రి గైర్హాజర్ అయితే చర్యలు
- పన్నుల వసూలుపై నిర్లక్ష్యం వీడండి
- సహాయక చర్యల్లో అవకతవకలు, జాప్యం చేయొద్దు
సాక్షి, బెంగళూరు : కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా పనిచేస్తుండటంతో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసహనం వ్యక్తం చేశారు. మరోసారి ఇలా జరిగితే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెంగళూరులోని విధానసౌధాలో సీఎం అధ్యక్షతన మంత్రులు, వివిధ ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు, కలెక్టర్లతో ఉన్నత స్థాయి సమావేశం సోమవారం జరిగింది.
అందులో వివిధ శాఖల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, అధికారుల తీరుతెన్నులను సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. నిర్ధిష్ట సమయంలోపు ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఆ పరిస్థితి ఎదురుకాకుండా జాగ్రత్త వహించాలని హితవు పలికారు. ముఖ్యంగా జిల్లా స్థాయి అధికార యంత్రాంగం సరిగా విధులు నిర్వహిస్తే ప్రజల సమస్యల్లో 80 శాతం అప్పటికప్పుడు పరిష్కారమవుతాయన్నారు. ఇందు కోసం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులతో పాటు కలెక్టర్లు రెండు, మూడు నెలలకు ఒకసారి సమీక్ష సమావేశం జరపాలని సూచించారు. ఈ సమావేశంలో పాల్గొనని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రుల పై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
పన్నులు వసూలు చేయండి..
బృహత్ బెంగళూరు మహానగర పాలికే పరిధిలో అనుకున్నంత మేరకు పన్నులు వసూలు కావడం లేదని సిద్ధరామయ్య సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీ ఖాతా పొందన భవన యజమానులు చాలా ఏళ్లుగా పన్నులు కట్టకున్నా సంబంధిత అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం తగదన్నారు. పన్నుల రాబడి పెంచడం కోసం ఎన్ని సమావేశాలు నిర్వహించామన్నది ముఖ్యం కాదని.. ఎంత పన్నులు వసూలు చేశామన్నది ముఖ్యమని పేర్కొన్నారు. ఇక అభివృద్ధి పనుల్లో కూడా సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదన్నారు. ఇందుకు చిన్నపాటి వర్షానికే కొట్టుకుపోతున్న రోడ్లే ప్రత్యక్ష ఉదాహరణమని అసహనం వ్యక్తం చేశారు.
సహాయ కార్యక్రమాలపై సుదీర్ఘ చర్చ
రాష్ట్రంలో ఓ వైపు అతివృష్టి.. మరోవైపు అనావృష్టి ఏర్పడిన వైనంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. సహాయ చర్యలకు అవసరమైన నిధుల కొరత లేదని అధికారులకు స్పష్టం చేశారు. అందువల్ల ప్రజలకు ముఖ్యంగా గ్రామీణులకు ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. కరువు కోరల్లో చిక్కుకున్నవారికి ప్రత్యాన్మాయ పనులు చూపించడంలో విఫలమైతే వలసలు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అతివృష్టి వల్ల నష్టపోయినవారికి పరిహారం చెల్లింపులో ఎటువంటి అవకతవకలు జరిగినా, ఆలస్యమైనా సహించేది లేదని అధికారులను హెచ్చరించారు.