- సోషల్ మీడియా వైపు సిద్ధు దృష్టి
- ముఖ్యమంత్రి పేరుతో వెబ్‌సైట్, ఫేస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్లు
- యూట్యూబ్‌లోనూ సీఎం కార్యక్రమాలు
- యువతకు చేరువ కావడమే లక్ష్యమన్న సీఎం
- మోడీతో కలిసే బెంగళూరు నుంచి తుమకూరు వెళ్తానని స్పష్టీకరణ
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలోని యువతకు చేరువ కావడం కోసమే తాను సోషల్ మీడియా వైపు దృష్టి సారించానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. సీఎం పేరిట ప్రత్యేక వెబ్‌సైట్, ఫేస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా విధాన సౌధలో సోమవారం జరిగిన కార్యక్రమంలో సీఎం వీటిని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలను నేరుగా కలుసుకోవడానికే తాను ఇష్టపడతానన్నారు.
రాష్ట్ర జనాభాలో 35 ఏళ్ల కంటే తక్కువ వయసుతో దాదాపు 65 శాతం మంది ఉన్నారని వెల్లడించారు. వీరంతా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌ట్యాప్‌లను చేత పట్టుకుని ఎప్పుడూ సోషల్ మీడియాలను అనుసరిస్తుంటారని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాల్సి ఉంటుందన్నారు. అందువల్లే రాష్ట్ర యువతకు చేరువ కావడం కోసం తాను కూడా ఈమీడియాలో సభ్యుడిని కావాల్సి వచ్చిందని వివరించారు.
ఈ అంశాల్లో తనకు సాంకేతిక పరిజ్ఞానం కొంత తక్కువ కనుక, త్వరలోనే అవగాహన పెంచుకుంటానని చెప్పారు. కాగా ప్రధాని నరేంద్ర మోడీతో కలిసే తాను బెంగళూరు నుంచి తుమకూరుకు వెళతానని తెలిపారు. తనకు వ్యతిరేకంగా ఎవరూ ఎలాంటి నినాదాలు చేయబోరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సీఎం సామాజిక సైట్ల నిర్వహణ కోసం నియమించిన ప్రత్యేక అధికారి శివరుద్రప్ప మాట్లాడుతూ... ఇక పై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొనే ప్రతి కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, ప్రసంగ పాఠాలను ఈ వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేస్తామన్నారు.
అంతేకాకుండా సీఎం పాల్గొనబోయే అధికారిక కార్యక్రమాలను కూడా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ముఖ్యమంత్రి అనుమతి తీసుకుని తాము ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో సందేశాలను (మెసేజ్) పోస్ట్ చేస్తామన్నారు. యూట్యూబ్‌లో కూడా సీఎం పాల్గొన్న కార్యక్రమాలను అప్‌లోడ్ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సమాచారశాఖ మంత్రి రోషన్ బేగ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
www.cmkarnataka.gov.in
ఫేస్‌బుక్ : cmofkarnataka
ట్విట్టర్ : cmofkarnataka