సోషల్ మీడియా యుగంలో ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగాంలో ఎంత ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే అంతగొప్పగా ప్రముఖులు భావిస్తుంటారు. ఇక రాజకీయ నాయకుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీ ప్రచారం, వ్యక్తిగతంగా పేరు ప్రఖ్యాతుల కోసం సోషల్ మీడియా మీదే ఆధారపడుతున్నారు. దాదాపు అన్ని ప్రధాన పార్టీలు సోషల్ మీడియా విభాగాల్ని ఏర్పాటు చేసుకున్నాయి. అయితే మన రాజకీయ నేతల సోషల్ మీడియా ఖాతాల్లోని ఫాలోవర్స్ చాలావరకూ నకిలీ అని తేలుతున్నాయి. ముఖ్యంగా ట్విటర్‌లో సగం ఫాలోవర్స్ ఫేక్ అని ట్విటర్ ఆడిట్, ట్విప్లమసీ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
ఈ నకిలీ ఫాలోవర్స్ జాబితాలో రాహుల్ గాంధీ టాప్‌లో నిలిస్తే ఆ తర్వాత స్థానంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఉన్నారు. రాహుల్‌కి ట్విటర్‌లో 62 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటే వారిలో 68 శాతం మంది ఫేక్ అని సర్వే తేల్చింది. ప్రధాని మోదీకి 4 కోట్ల 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటే వారిలో ఏకంగా 2.5 కోట్ల మంది ఫేక్ అని తెలిపింది. అంతర్జాతీయంగా పోప్ ఫ్రాన్సిస్‌కి 48 శాతం, హిల్లరీ క్లింటన్‌కి 31 శాతం, డొనాల్డ్ ట్రంప్‌కి 26 శాతం నకిలీ అనుచరులు ఉన్నారు. రాజకీయ ప్రముఖుల్ని ఫాలో అవుతున్న వారిలో 5 వేల మందిని శాంపిల్‌గా తీసుకొని ఈ నివేదిక రూపొందించారు.
ఫేక్ ఖాతాల వెనుక గుట్టు ఇది..
ఇందుకోసం ట్విట్టర్‌లో బాట్స్ అనే సాఫ్ట్‌వేర్‌ని వాడుతున్నారు. ట్వీట్, రీ ట్వీట్ , ఫాలోయింగ్ , అన్‌ఫాలోయింగ్, అకౌంట్ మేనేజింగ్‌ను ఆటోమెటిక్‌గా చేసే సాధనమే బాట్స్.. ఈ సాప్ట్‌వేర్‌ని దుర్వినియోగం చేయడం వల్లే ఫేక్ ఫాలోవర్స్ పుట్టుకొస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ప్రధాని మోదీకి కేవలం నెలరోజుల్లోనే 70 లక్షల మంది ఫాలోవర్స్ పెరగడంతో ఆయన పాపులారిటీ పెరిగిందని, ట్రంప్‌ని ఆయన మించిపోతారని అనుకున్నారు.
అయితే నెల వ్యవధిలో అన్ని లక్షల మంది ఫాలోవర్స్ పెరగడం ఎలా సాధ్యమన్న ప్రశ్నలు వినిపించాయి. రాహుల్‌గాంధీకి రెండు నెలల్లోనే 10 లక్షల మంది ఫాలోవర్స్ పెరిగిపోయారు. ఆయన ట్వీట్లకి నిముషాల్లోనే వేల సంఖ్యలో రీట్వీట్లు వస్తున్నాయి. దీనికంతటికీ ఆటోమేటెడ్ బాట్స్ వినియోగించడమే కారణమని తేలింది. ట్విటర్‌లో నకిలీ ఖాతాలు పెరగడంతో దాని యాజమాన్యం కూడా చర్యలు మొదలు పెట్టింది. ఫిబ్రవరిలో అమెరికాలో చాలా మంది సెలిబ్రిటీల ఫేక్ ఫాలోవర్స్ ఖాతాల్ని రాత్రికి రాత్రే రద్దు చేసింది.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment