2015 సంవత్సరం వెళ్లిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఘటనలు! భూకంపాలు, ప్రకృతి విలయాలు, ఉగ్రవాద బీభత్సాలు, దాడులు, సదస్సులు, సంబరాలు.. అన్నింటినీ తనతోపాటే కాలగర్భంలో కలిపేసుకొని.. ఇక చరిత్ర నిలిచిపోయేందుకు 2015 సిద్ధమవుతోంది. సహజంగానే 2015లో చాలా వీడియోలు, ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్‌లా వ్యాపించాయి. కొన్ని ఉర్రూతలూగిస్తే.. మరికొన్ని హృదయాన్ని హత్తుకొని కంటతడి పెట్టించాయి. అయితే ఇలాంటివాటిలో కొన్ని ఫొటోలు, వీడియోలు మాత్రం నెటిజన్లను మోసం చేశాయి. పాతవో, ఎప్పటివో తెరపైకి వచ్చి.. ఇదే నిజమన్నంతగా భ్రమ కల్పించాయి. అలా నెటిజన్లను మోసపుచ్చి ఇంటర్నెట్‌లో విపరీతంగా చక్కర్లు కొట్టిన ఫొటోలు, వీడియోల ముచ్చట్లివి..
భూవిలయంలో 'బుజ్జీ వేదన'!
అది నేపాల్ భూకంపం నేపథ్యం. 81 ఏళ్లలో కనీవినీ ఎరుగని తీవ్రతతో నమోదైన భూకంపంతో నేపాల్ ఛిన్నాభిన్నమైంది. ఆ సమయంలో భూకంపం వచ్చి భవనాలు వణుకుతుండటం, ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెడుతున్నప్పుడు ఓ బుజ్జి అన్న తన చెల్లాయిని ఇలా ఒడిలో భద్రంగా దాచుకున్నాడంటూ ఈ ఫొటో వైరల్ అయింది. ఫేస్‌బుక్, ట్విట్టర్ వాసులను చలింపజేసింది. నిజానికి ఇది వియాత్నంలోని మారుమూల గ్రామానికి చెందిన చిన్నారుల ఫొటో. 2007లో ఫొటోగ్రాఫర్ నా సన్ గుయెన్ ఈ ఫొటో క్లిక్ మనిపించాడు. తాను తీసిన ఫొటోల్లో అత్యధికంగా షేర్ ఫొటో ఇదే కావొచ్చునని, కానీ వేరే కారణాలతో ఇది ప్రజలకు చేరిందని ఆయన వ్యాఖ్యానించారు.
సిమ్మింగ్‌పూల్‌లో ప్రళయం!
ఇది నేపాల్ భూకంపానికి సంబంధించిన వైరల్ అయిన వీడియో. భూకంపం సందర్భంగా కఠ్మాండులోని ఓ హోటల్‌లో ఉన్న స్విమ్మింగ్‌పూల్ ఇలా ఉప్పొంగి ప్రళయం సృష్టించందంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమైంది. నిజానికి ఇది 2010 నాటి వీడియో. మెక్సికోలో భూకంపం సందర్భంగా ఓ స్మిమ్మింగ్‌పూల్‌లోని దృశ్యమిది. దీనిని కొందరు నెటిజన్లు గుర్తించి.. ఎక్కడ భూకంపం వచ్చినా ఈ వీడియోను వాడుకుంటారా? అని అడిగారు కూడా. అంతేకాదు ఈజిప్టులో విధ్వంసాలవి, ఇతరత్రా చాలా రకాల ఫొటోలు నేపాల్ భూకంపానివేనంటూ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టాయి.
ఓ శరణార్థి సెల్ఫీ.. ఓ బూటకం!
ఓ శరణార్థి సెనెగాల్ నుంచి స్పెయిన్‌కు వలసవస్తూ.. ఓ సెల్ఫీ తీసుకొని దానిని ఇన్‌స్టాగ్రాంలో పెట్టాడు! అది వెంటనే సూపర్‌హిట్ అయింది. వేలమంది ఫాలోవర్లు, వందలసంఖ్యలో ఉత్సాహపరిచే కామెంట్లు. ఇంకేముంది ఆ శరణార్థి ఇంటర్నెట్‌లో ఓవర్‌నైట్ సెలబ్రిటీ అయ్యాడు. తన కష్టాలు చిత్రవిచిత్రంగా చెప్తూ సానుభూతి సంపాదించుకునే ప్రయత్నం చేశాడు. తీరా చూస్తే అతడు శరణార్థి కాదని, డాకర్ ప్రాంతానికి చెందిన అబ్దౌద్ దివౌఫ్ అని తేలింది. ప్రజలను ఆకర్షించేందుకు అతను ఇలా బూటక ఫొటోలు పెట్టాడని తేలింది.
శరణార్థా? ఐఎస్ ఫైటరా?
శరణార్థుల వలస సమస్య యూరప్ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సమయంలో ఇంటర్నెట్‌లోకి ఎక్కిన ఈ ఫొటో హల్‌చల్ చేసింది. 'ఇతన్ని గుర్తుపట్టారా? గత ఏడాది ఇతనో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాది.. ఆ ఫొటోలు కూడా ఫేస్‌బుక్‌లో పెట్టాడు. ఇప్పుడు శరణార్థిగా మారాడు' అంటూ ఈ ఫొటోకు వ్యాఖ్య జోడించి.. బాగా ప్రచారమైంది. అయితే ఫొటోలో ఉన్న అతను ఐఎస్ ఉగ్రవాది కాదు. లైత్ ఆల్ సలెది. అతను సిరియా లిబరేషన్ ఆర్మీ కమాండర్. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉదారవాద రెబెల్ ఆర్మీ ఇది. అతను 2015 ఆగస్టులో సిరియా నుంచి మెసిడొనియాకు వలస వెళ్లాడు.
ఈగల్స్ ఆఫ్ డెత్ మెటల్ కచ్చేరి!
పారిస్‌లో ఉగ్రవాదుల నరమేధం. బ్లాటక్లాన్ థియేటర్‌లో ముష్కరుల బీభత్సం.. ఉగ్రవాదులు బాటక్లాన్ థియేటర్‌లో అడుగుపెట్టడానికి కొద్దిముందు.. అందులో సంగీతానికి పరవశులవుతున్న శ్రోతల ఫొటో ఇదని ఆన్‌లైన్‌లో బాగా వైరల్ అయింది. ఇదీ పాత ఫొటోనే. డబ్లిన్‌లోని ఒలింపియా థియేటర్‌లో కచేరి సందర్భంలో తీసిన ఫొటో. కానీ ఈ ఫొటోనే కాదు చాలా తప్పుడు ఫొటోలు పారిస్ దాడులకు సంబంధించినవిగా ప్రచారమయ్యాయి.
నిర్మానుష్య పారిస్ వీధులు!
పారిస్‌లో ఉగ్రవాదుల దాడులు, ఆత్మహుతి దాడులు, పోలీసుల కాల్పలు నేపథ్యంలో ఆ నగరమిలా చిన్నచీమ కూడా కనిపించినంతా నిర్మానుష్యంగా మారిపోయిందంటూ ఈ ఫోటో షేర్ అయింది. ఇది సైలెంట్ వరల్డ్ సంస్థ పారిస్ నగరం ఇలా ఉంటే బావుంటుందని ఫొటోగ్రఫీ ట్రిక్కులతో ఈ చిత్రాన్ని రూపొందించింది. కానీ ఈ ఫొటో మరోలా ప్రచారమైంది.
తప్పుడు సైన్.. పప్పులో కాలు!
ఈ నెల లండన్‌లోని ట్యూబ్ స్టేషన్‌లో ఓ వ్యక్తి ముగ్గురిని పొడిచి గాయపర్చాడు. ఇది ఉగ్రవాద ఘటనగా భావించారు. దీనికి సంబంధించిన 'నువ్వు ముస్లింవి కాదు' అంటూ హాష్‌ట్యాగ్ ఆన్‌లైన్‌లో విపరీతంగా షేర్ అయింది. లండన్ మేయర్ అభ్యర్థి సాధిక్ ఖాన్ కూడా దీనిని షేర్ చేసుకున్నాడు. అయితే ఈ హాష్‌ట్యాగ్‌కు కారణమైన ఆన్‌లైన్ సైన్ (సంతకాల సేకరణ) నకిలీదని, దీనిని సైన్ జనరేటర్ యాప్ ద్వారా సృష్టించారని తర్వాత తేలింది.
నీకూ సగం.. నాకూ సగం!
భార్యాభర్తలు అంటే చెరిసగం. అందుకే శివపార్వతులను అర్ధనారీశ్వరుడు అంటాం. ఇంగ్లిష్‌లో బెటర్‌హాఫ్ జాతీయముంది. అదేవిధంగా ఓ జర్మన్ వ్యక్తి భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. తన దగ్గర ఉన్న సంపదనంతా చెరిసగం పంచేశాడు. అలా ఈ కారును కూడా ఇలా సగంసగం పంచేసి.. తనవంతు సగాన్నిఅమ్మకానికి పెట్టిండహో అంటూ ఈ ఫొటో హల్‌చల్ చేసింది. ఈ ఫొటో నెటిజన్లనే కాదు మీడియాను కూడా పిచ్చోళ్లను చేసింది. ఈ కారును 'ఈబే'లో వేలానికి పెట్టింది నిజమే అయినా దాని వెనుక ఉన్న కట్టుకథ మాత్రం ప్రచారం కోసం తామే సృష్టించామంటూ జర్మన్ బార్ అసిసోయేసన్ తెలిపింది.
మీరు అడ్డంగా మోసపోయారిలా?
Published Mon, Dec 28 2015 2:39 PM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM
Advertisement