Nepal Earthquake 2015
-
Year End 2023: ప్రపంచాన్ని వణికించిన భూకంపాలు ఇవే..!
ప్రపంచంలో 2023లో భారీ స్థాయిలో భూకంపాలు సంభవించాయి. వీటివల్ల అపార ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ ఏడాది ప్రపంచంలో వచ్చిన కొన్ని ప్రధాన భూకంపాల గురించి తెలుసుకుందాం..! ఫిబ్రవరి 6: టర్కీ-సిరియా భూకంపం ఈ ఏడాది ఫిబ్రవరి 6న టర్కీ, సిరియాలో భారీ స్థాయిలో భూకంపం సంభవించింది. టర్కీ దక్షిణ, మధ్య ప్రాంతంలో భూమి రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో కంపించింది. సిరియాలో ఉత్తర, పశ్చిమ ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి. కొన్ని గంటల వ్యవధిలోనే 7.8 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. భూమిలోపల 95 కిమీ లోపల భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉంది. ఈ విపత్తులో అపార ఆస్తి నష్టం జరిగింది. ఈ భూకంపంలో 59,259 మంది ప్రాణాలు కోల్పోయారు. టర్కీలో 50,783 మంది కాగా.. సిరియాలో 8,476 మంది మృత్యువాతపడ్డారు. టర్కీ జనాభాలో 1.4 కోట్ల మంది ప్రభావితమయ్యారని అంచనా. సుమారు 1.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐరాస అంచనా వేసింది. మార్చి 18: గుయాస్ భూకంపం, ఈక్వెడార్ దక్షిణ ఈక్వెడార్‌లో 2023 మార్చి 18న భారీ స్థాయిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం ఎల్ ఓరో, అజువే, గుయాస్ ప్రావిన్స్‌లలో భారీ నష్టాన్ని కలిగించింది. దాదాపు 446 మంది గాయపడ్డారు. 16 మంది మరణించారు. ఈక్వెడార్ జనాభాలో దాదాపు సగం మంది 8.41 మిలియన్ల మంది ప్రజలు ఈ భూకంపంతో ప్రభావితులయ్యారు. దేశంలోని మొత్తం 24 ప్రావిన్సుల్లోని 13 ప్రావిన్సుల్లో భూమి కంపించింది. మార్చి 21: ఆఫ్ఘనిస్థాన్ భూకంపం 2023, మార్చి 21న ఆఫ్ఘనిస్థాన్‌లోని బదక్షన్ ప్రావిన్స్‌లో భారీ స్థాయిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో భూమి కంపించింది. దాదాపు 1000 కిలోమీటర్ల వైశాల్యంలో భూమి కంపించింది. ఆప్ఘనిస్థాన్‌లోని 9 ప్రావిన్స్‌లలో ప్రజలు ఈ భూకంపంతో ప్రభావితమయ్యారు. కనీసం 10 మంది మరణించారు. 80 మంది గాయపడ్డారు. 665 కంటే ఎక్కువ ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ భూకంపం కారణంగా పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్, క్వెట్టా, పెషావర్లలో ప్రకంపనలు వచ్చాయి. కొండచరియలు విరిగిపడటంతో కారకోరం హైవే మూసుకుపోయింది. బునెర్ జిల్లాలో డజన్ల కొద్దీ ఇళ్లు కూలిపోయి 40 మంది గాయపడ్డారు. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా జమ్ము కశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. సెప్టెంబరు 8: మొరాకో భూకంపం 2023 సెప్టెంబరు 8న మొరాకోలోని మరకేష్-సఫీ ప్రాంతంలో భారీ స్థాయిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.8-6.9 తీవ్రతతో భూమి కంపించింది. దాదాపు 2,960 మంది ప్రాణాలు కోల్పోయారు. మరకేష్‌లోని చరిత్రాత్మక ప్రదేశాలు ధ్వంసమయ్యాయి. స్పెయిన్, పోర్చుగల్, అల్జీరియాలో కూడా భూప్రకంపనలు కనిపించాయి. మొరాకో చరిత్రలో నమోదు చేయబడిన అత్యంత బలమైన భూకంపాల్లో ఇది ప్రధానమైంది. 1960 అగాదిర్ భూకంపం తర్వాత దేశంలో అత్యంత ఘోరమైన భూకంపం ఇదే. 2023లో టర్కీ-సిరియా భూకంపం తర్వాత ఇందులోనే అత్యంత ఎక్కువ ప్రాణ నష్టం సంభవించింది. 1,00,000 మంది పిల్లలతో సహా మరకేష్, అట్లాస్ పర్వతాల పరిసర ప్రాంతాల్లో 2.8 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. అక్టోబర్ 7: హెరాత్ భూకంపం, ఆఫ్ఘనిస్తాన్ 2023 అక్టోబర్ 7న పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్లోని హెరాత్ ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో భూమి కంపించింది. గంటల వ్యవధిలో వరుసగా నాలుగు సార్లు భూకంపం రావడం భారీ నష్టాన్ని కలిగించింది. మొదటి రెండు భూకంపాలు అక్టోబర్ 7న హెరాత్ నగరానికి సమీపంలో సంభవించాయి. అక్టోబర్ 11, 15 తేదీల్లో అదే ప్రాంతంలో మరో రెండు భూకంపాలు 6.3 తీవ్రతతో సంభవించాయి. ఈ భూకంపాల్లో 1,482 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,100 మందికి గాయాలయ్యాయి. 43,400 మంది ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. 1,14,000 మందికి మానవతా సహాయం అవసరమైందని అంచనా. క్షతగాత్రుల సంఖ్య ఎక్కువ స్థాయిలో ఉండటంతో సరైన ఆస్పత్రి సౌకర్యాలు అందలేదు. ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నవంబర్ 3: నేపాల్ భూకంపం 2023 నవంబర్ 3న నేపాల్ కర్నాలీ ప్రావిన్స్‌లోని జాజర్కోట్ జిల్లాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రతతో భూమి కంపించింది. 154 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 375 మంది గాయపడ్డారు. పశ్చిమ నేపాల్, ఉత్తర భారతదేశం అంతటా భూప్రకంపనలు కనిపించాయి. 2015 నుంచి నేపాల్‌లో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపం ఇదే కావడం గమనార్హం. మరణాల్లో జాజర్కోట్ జిల్లాలో 101 మంది ప్రాణాలు కోల్పోగా.. పశ్చిమ రుకుమ్ జిల్లాలో 52 మంది మరణించారు. మరణించిన వారిలో 78 మంది పిల్లలు కూడా ఉన్నారు. నేపాల్‌లోని పదమూడు జిల్లాల్లో దాదాపు 62,039 ఇళ్లు ప్రభావితమయ్యాయి. వాటిలో 26,550 ఇళ్లు కుప్పకూలాయి. నవంబర్ 17: మిండనావో భూకంపం, ఫిలిప్పీన్స్ 2023 నవంబర్ 17న ఫిలిప్పీన్స్ మిండనావో ద్వీపంలోని సారంగని ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూమి కంపించింది. ఈ విపత్తులో 11 మంది మరణించారు. 730 మంది తీవ్రంగా గాయపడ్డారు. పొరుగున ఉన్న ఇండోనేషియాలో కూడా ప్రకంపనలు వచ్చాయి. 644 ఇళ్లు కూలిపోగా.. 4,248 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇదీ చదవండి: Year End 2023: అన్నీ మంచి శకునములే! -
అనువైన వాతావరణం కల్పించండి-నేపాల్
సార్క్ సమావేశాలు నిర్వహించేందుకు అనువైన వాతావరణం కల్పించమంటూ నేపాల్ కోరింది. భారత్ తో పాటు మరో మూడు సభ్య దేశాలు సార్క్ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించిన నేపథ్యంలో నేపాల్ ఈ ప్రకటన చేసింది. సరైన వాతావరణ పరిస్థితులు లేకపోవడంతో పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ లో జరిగే సార్క్ సమావేశాల్లో తాము పాల్గొనలేమంటూ భారత్, బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలు నేపాల్ కు సమాచారం అందించాయి. దీంతో స్పందించిన నేపాల్.. సార్క్ సదస్సు సవ్యంగా జరిగేందుకు అనువైన వాతావరణం సృష్టించాలంటూ పాకిస్థాన్ కు పరోక్షంగా సూచించింది. త్వరలోనే సదస్సు ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ఆశిస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది. సార్క్ సదస్సుకు హాజరు కాలేమని భారత్ నిర్ణయం తీసుకోవడంతో నవంబర్ 9, 10, తేదీల్లో జరగాల్సిన సమావేశాలను వాయిదా వేయాలని, లేదంటే రద్దు చేయాలని పాకిస్థాన్ భావిస్తోంది. ఇదే విషయాన్ని నేపాల్ కు కూడా తెలిపింది. దీనిపై స్పందించిన నేపాల్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనను వెలువరించింది. ముందుగా అనుకున్నట్లుగానే సార్క్ సదస్సును నిర్వహించాలని, అందుకు సభ్యదేశాలన్నీ పాల్గొనే అనుకూల వాతావరణాన్ని కల్పించాలని కోరింది. సమావేశాలను రద్దు చేసే ఆలోచనను తాము తీవ్రంగా భావిస్తున్నామంటూ నేపాల్ విదేశాంగ శాఖ తన వెబ్ సైట్ లో తెలిపింది. 19వ సార్క్ సమావేశాల్లో సభ్యదేశాలన్నీ పాల్గొనేందుకు తగ్గ వాతావరణం కల్పిస్తారని తాము భావిస్తున్నట్లు పేర్కొంది. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కో ఆపరేషన్ (సార్క్) ను 1985 లో స్థాపించగా అందులో ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవులు, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక దేశాలు సభ్యులుగా ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క దేశం సమావేశాలకు హాజరు కావడం లేదని తెలిపినా నిబంధనల ప్రకారం సార్క్ సదస్సు వాయిదా వేయడం లేదా రద్దు చేయడం జరుగుతుంది. అటువంటిది నాలుగు దేశాలు సదస్సునుంచి వైదొలగే వాతావరణాన్ని సృష్టించడంపై పాకిస్థాన్ ను నేపాల్ నిందించింది. సెప్టెంబర్ 18న ఉరీలోని భారతీయ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడులు జరపగా 18 మంది సైనికులు మరణించిన అనంతరం పాకిస్థాన్ భారత్ మధ్య ఈ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దాడికి పాల్పడిన తీవ్రవాదులు పాకిస్థాన్ కు చెందిన జైషే ఇ మొహమ్మద్ కు చెందిన వారుగా గుర్తించడంతో ఇరు దేశాలమధ్య అనుకూల వాతావరణం దెబ్బతింది. ఈ నేపథ్యంలో నేపాల్ పిలుపును పాక్ ఏ రకంగా స్వీకరిస్తుందో వేచిచూడాల్సిందే. -
నేపాల్ భూకంపానికి ఏడాది..
-
'ఆ భూకంపంతో నా జీవితం రంగులమయం'
కఠ్మాండు: ప్రళయం, విపత్తులాంటిది గుర్తొస్తే శరీరం భయంతో కంపిస్తుంది. అది ఎదుర్కొన్నవారికైతే ఓ క్షణం ఆ పాత జ్ఞాపకాలు ఊపిరిని ఓ ఆక్షణం ఆపేసి మళ్లీ వదిలిపెడుతుంటాయి. అందుకే వీలయినంత వరకు ఆక్షణాల గురించి ఆలోచించే సాహసం ఎవరూ చేయరు. కానీ, నేపాల్ ఓ పదహారేళ్ల బాలుడు మాత్రం అలాంటి ప్రళయాన్ని గుర్తు తెచ్చుకునేందుకు సంతోషపడుతున్నాడు. గత ఏడాది నేపాల్ ను నేలమట్టం చేసిన భూకంపం తన జీవితాన్ని మార్చేసిందని చెప్తున్నాడు. అప్పటి వరకు ఎవరూ పట్టించుకోని నీ జీవితం ఇప్పుడు కొత్త వెలుగురేఖలతో ప్రయాణిస్తుందని చెప్తున్నాడు. గత ఏడాది నేపాల్ లో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, అమిర్ బోమ్ జాన్ అనే పదహారేళ్ల బాలుడు మాత్రం బతికి బయటపడ్డాడు. అత్యంత అరుదైన రోగంతో కేవలం తలకాయ మాత్రం పనిచేస్తూ మెడ నుంచి క్రింది భాగం పూర్తిగా చచ్చుబడిపోయి ఉన్న ఇతడు ఓ ఎజెన్సీ గ్రామానికి చెందినవాడు. పేదరికం, నిరక్షరాస్యత, సౌకర్యాల లేమి కారణంగా అతడి తల్లిదండ్రులు ఎప్పుడో ఓ చీకటి గదిలో ఉంచేవారు. అయితే, భూకంపం వచ్చిన వీళ్ల ఊరంతా కూడా దాని బారిన పడి శిథిలాల కింద ఇరుక్కుపోయాడు. సహాయక చర్యల్లో అతడు సురక్షితంగా బయటపడ్డాడు. దీంతో అతడిని కఠ్మాండ్లోని ప్రత్యేక అవసరాలు గల పిల్లల స్కూల్లో చేర్చించారు. ఆ స్కూల్లో చేరిన తర్వాత అతడి గతమంతా మారిపోయింది. పైగా నోటితో బ్రష్ పట్టుకొని పెయింటింగ్ వేయడం నేర్చుకున్నాడు. అతడి టాలెంట్ ను గుర్తించిన కరుణ అనే స్వచ్ఛంద సంస్థ అతడికి ప్రోత్సాహన్నిస్తూ ఆ పెయింటింగ్స్ కూడా కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం స్పెషల్ స్కూల్లోని ఉండి చదువుకుంటూ బొమ్మలు వేసి గడిపేస్తున్న అమిర్ మాట్లాడుతూ 'నాకు చేతి వ్రాత లేదు.. నోటి రాత రాస్తాను' అని జోక్ చేశాడు. రాయగలను, పాడగలను, బొమ్మలు వేయగలను అని చెప్పాడు. ఆ భూకంపం ఎంతో మందిని పొట్టనపెట్టుకొని ఉండొచ్చుకానీ.. నా జీవితాన్ని మాత్రం రంగుల మయం చేసి వెళ్లిందని అంటున్నాడు అమిర్. -
దళారుల గుప్పిట్లో నేపాల్ వలసదారులు
నేపాల్ భూకంపం ఇంకా అక్కడ ప్రజలను పీడకలలా వెంటాడుతూనే ఉంది. గత ఏడాది ఏప్రిల్ 25న సంభవించిన భూకంప ప్రకంపనలు వారిని వీడటం లేదు. ఈ ఘటనలో దాదాపు 9,000మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.అయితే భూకంపంలో సర్వం కోల్పోయి...తినేందుకు తిండిలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భారత్‌లోని పంజాబ్ కు వలస వచ్చినవారిని స్థానిక దళారులు బానిసలుగా మార్చి అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నారు.ముఖ్యంగా పదేళ్లలోపు చిన్నారులను బ్రిటీష్ కుటుంబాలకు వీరిని బానిసలుగా విక్రయిస్తున్నారు. 'రండి..నేపాలీలు మంచి పనిమంతులు. చక్కని,రుచి కరమైన వంటలు తయారు చేస్తారు.ఇంటి పనులు నేపాలీలు చేసినంత చక్కగా మరెవ్వరూ చేయలేరు. వీరిని ఇంగ్లండ్‌లోని మీ ఇంటికి తీసుకువెళ్లండంటూ' దళారులు.. చిన్నారులను విక్రయానికి పెడుతున్నారు. ఓ బాలుడిని బ్రిటన్‌కు పంపేందుకు దళారులకు సుమారు రూ.5లక్షలు ముడుతుంది.కాగా కొనుగోలు చేసిన చిన్నారిని తీసుకెళ్లేందుకు మిగిలిన ఖర్చులన్నీ కొనుగోలుదారే భరించాల్సి ఉంటుంది. నేపాలీ వలసదారుల అక్రమ రవాణాపై హోం శాఖ కార్యదర్శి థెరిస్పా స్పందిస్తూ.. వలసదారుల అక్రమ రవాణాపై విచారణ జరపాల్సిందిగా జాతీయ నేర పరిశోధనా సంస్థను ఆదేశాలు ఇచ్చారు.పిల్లల సంరక్షణకు ప్రభుత్వం గత ఏడాది తీసుకువచ్చిన మోడరన్ స్లేవరీ యాక్ట్‌ను ఆయన ప్రస్తావిస్తూ ఈ చట్టం కింద నేరం రుజువైతే నిందితులకు జీవత ఖైదు పడుతుందన్నారు. -
ఇంకా 19 ఏళ్లేనా..?
నేపాల్ క్రికెట్ కెప్టెన్ వయస్సుపై వివాదం ఢాకా: అండర్-19 ప్రపంచకప్‌లో నేపాల్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రాజు రిజాల్ వాస్తవ వయస్సుపై ముంబై ఆట గాడు కౌస్తుబ్ పవార్ వివాదం లేపాడు. తామిద్దరం కలిసి అండర్-15లో ఆడామని గుర్తు చేశాడు. వాస్తవానికి అతను 24 లేదా 25 ఏళ్లు ఉంటాడని ఫేస్బుక్లో ఆరోపించాడు. ‘అండర్-15లో మేమిద్దరం కలిసి ముంబై జట్టు తరఫున ఆడాం. అప్పుడతను రాజు శర్మగా ఆడాడు. ఇప్పుడు అతను రాజు రిజాల్ పేరిట అండర్-19 నేపాల్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. మాతో పాటు ఇతరుల వయ స్సు 24 లేదా 25గా ఉంటుంది’ అని కౌస్తుబ్ సంచలన ఆరోపణలు చేశాడు. -
మీరు అడ్డంగా మోసపోయారిలా?
2015 సంవత్సరం వెళ్లిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఘటనలు! భూకంపాలు, ప్రకృతి విలయాలు, ఉగ్రవాద బీభత్సాలు, దాడులు, సదస్సులు, సంబరాలు.. అన్నింటినీ తనతోపాటే కాలగర్భంలో కలిపేసుకొని.. ఇక చరిత్ర నిలిచిపోయేందుకు 2015 సిద్ధమవుతోంది. సహజంగానే 2015లో చాలా వీడియోలు, ఫొటోలు ఆన్లైన్లో వైరల్‌లా వ్యాపించాయి. కొన్ని ఉర్రూతలూగిస్తే.. మరికొన్ని హృదయాన్ని హత్తుకొని కంటతడి పెట్టించాయి. అయితే ఇలాంటివాటిలో కొన్ని ఫొటోలు, వీడియోలు మాత్రం నెటిజన్లను మోసం చేశాయి. పాతవో, ఎప్పటివో తెరపైకి వచ్చి.. ఇదే నిజమన్నంతగా భ్రమ కల్పించాయి. అలా నెటిజన్లను మోసపుచ్చి ఇంటర్నెట్లో విపరీతంగా చక్కర్లు కొట్టిన ఫొటోలు, వీడియోల ముచ్చట్లివి.. భూవిలయంలో 'బుజ్జీ వేదన'! అది నేపాల్ భూకంపం నేపథ్యం. 81 ఏళ్లలో కనీవినీ ఎరుగని తీవ్రతతో నమోదైన భూకంపంతో నేపాల్ ఛిన్నాభిన్నమైంది. ఆ సమయంలో భూకంపం వచ్చి భవనాలు వణుకుతుండటం, ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెడుతున్నప్పుడు ఓ బుజ్జి అన్న తన చెల్లాయిని ఇలా ఒడిలో భద్రంగా దాచుకున్నాడంటూ ఈ ఫొటో వైరల్ అయింది. ఫేస్బుక్, ట్విట్టర్ వాసులను చలింపజేసింది. నిజానికి ఇది వియాత్నంలోని మారుమూల గ్రామానికి చెందిన చిన్నారుల ఫొటో. 2007లో ఫొటోగ్రాఫర్ నా సన్ గుయెన్ ఈ ఫొటో క్లిక్ మనిపించాడు. తాను తీసిన ఫొటోల్లో అత్యధికంగా షేర్ ఫొటో ఇదే కావొచ్చునని, కానీ వేరే కారణాలతో ఇది ప్రజలకు చేరిందని ఆయన వ్యాఖ్యానించారు. సిమ్మింగ్‌పూల్‌లో ప్రళయం! ఇది నేపాల్ భూకంపానికి సంబంధించిన వైరల్ అయిన వీడియో. భూకంపం సందర్భంగా కఠ్మాండులోని ఓ హోటల్లో ఉన్న స్విమ్మింగ్‌పూల్ ఇలా ఉప్పొంగి ప్రళయం సృష్టించందంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమైంది. నిజానికి ఇది 2010 నాటి వీడియో. మెక్సికోలో భూకంపం సందర్భంగా ఓ స్మిమ్మింగ్పూల్లోని దృశ్యమిది. దీనిని కొందరు నెటిజన్లు గుర్తించి.. ఎక్కడ భూకంపం వచ్చినా ఈ వీడియోను వాడుకుంటారా? అని అడిగారు కూడా. అంతేకాదు ఈజిప్టులో విధ్వంసాలవి, ఇతరత్రా చాలా రకాల ఫొటోలు నేపాల్ భూకంపానివేనంటూ ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టాయి. ఓ శరణార్థి సెల్ఫీ.. ఓ బూటకం! ఓ శరణార్థి సెనెగాల్ నుంచి స్పెయిన్‌కు వలసవస్తూ.. ఓ సెల్ఫీ తీసుకొని దానిని ఇన్‌స్టాగ్రాంలో పెట్టాడు! అది వెంటనే సూపర్‌హిట్ అయింది. వేలమంది ఫాలోవర్లు, వందలసంఖ్యలో ఉత్సాహపరిచే కామెంట్లు. ఇంకేముంది ఆ శరణార్థి ఇంటర్నెట్లో ఓవర్‌నైట్ సెలబ్రిటీ అయ్యాడు. తన కష్టాలు చిత్రవిచిత్రంగా చెప్తూ సానుభూతి సంపాదించుకునే ప్రయత్నం చేశాడు. తీరా చూస్తే అతడు శరణార్థి కాదని, డాకర్ ప్రాంతానికి చెందిన అబ్దౌద్ దివౌఫ్ అని తేలింది. ప్రజలను ఆకర్షించేందుకు అతను ఇలా బూటక ఫొటోలు పెట్టాడని తేలింది. శరణార్థా? ఐఎస్ ఫైటరా? శరణార్థుల వలస సమస్య యూరప్ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సమయంలో ఇంటర్నెట్లోకి ఎక్కిన ఈ ఫొటో హల్చల్ చేసింది. 'ఇతన్ని గుర్తుపట్టారా? గత ఏడాది ఇతనో ఐఎస్ఐఎస్ ఉగ్రవాది.. ఆ ఫొటోలు కూడా ఫేస్బుక్లో పెట్టాడు. ఇప్పుడు శరణార్థిగా మారాడు' అంటూ ఈ ఫొటోకు వ్యాఖ్య జోడించి.. బాగా ప్రచారమైంది. అయితే ఫొటోలో ఉన్న అతను ఐఎస్ ఉగ్రవాది కాదు. లైత్ ఆల్ సలెది. అతను సిరియా లిబరేషన్ ఆర్మీ కమాండర్. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉదారవాద రెబెల్ ఆర్మీ ఇది. అతను 2015 ఆగస్టులో సిరియా నుంచి మెసిడొనియాకు వలస వెళ్లాడు. ఈగల్స్ ఆఫ్ డెత్ మెటల్ కచ్చేరి! పారిస్‌లో ఉగ్రవాదుల నరమేధం. బ్లాటక్లాన్ థియేటర్లో ముష్కరుల బీభత్సం.. ఉగ్రవాదులు బాటక్లాన్ థియేటర్లో అడుగుపెట్టడానికి కొద్దిముందు.. అందులో సంగీతానికి పరవశులవుతున్న శ్రోతల ఫొటో ఇదని ఆన్లైన్లో బాగా వైరల్ అయింది. ఇదీ పాత ఫొటోనే. డబ్లిన్‌లోని ఒలింపియా థియేటర్లో కచేరి సందర్భంలో తీసిన ఫొటో. కానీ ఈ ఫొటోనే కాదు చాలా తప్పుడు ఫొటోలు పారిస్ దాడులకు సంబంధించినవిగా ప్రచారమయ్యాయి. నిర్మానుష్య పారిస్ వీధులు! పారిస్‌లో ఉగ్రవాదుల దాడులు, ఆత్మహుతి దాడులు, పోలీసుల కాల్పలు నేపథ్యంలో ఆ నగరమిలా చిన్నచీమ కూడా కనిపించినంతా నిర్మానుష్యంగా మారిపోయిందంటూ ఈ ఫోటో షేర్ అయింది. ఇది సైలెంట్ వరల్డ్ సంస్థ పారిస్ నగరం ఇలా ఉంటే బావుంటుందని ఫొటోగ్రఫీ ట్రిక్కులతో ఈ చిత్రాన్ని రూపొందించింది. కానీ ఈ ఫొటో మరోలా ప్రచారమైంది. తప్పుడు సైన్.. పప్పులో కాలు! ఈ నెల లండన్‌లోని ట్యూబ్ స్టేషన్లో ఓ వ్యక్తి ముగ్గురిని పొడిచి గాయపర్చాడు. ఇది ఉగ్రవాద ఘటనగా భావించారు. దీనికి సంబంధించిన 'నువ్వు ముస్లింవి కాదు' అంటూ హాష్‌ట్యాగ్ ఆన్లైన్లో విపరీతంగా షేర్ అయింది. లండన్ మేయర్ అభ్యర్థి సాధిక్ ఖాన్ కూడా దీనిని షేర్ చేసుకున్నాడు. అయితే ఈ హాష్‌ట్యాగ్‌కు కారణమైన ఆన్లైన్ సైన్ (సంతకాల సేకరణ) నకిలీదని, దీనిని సైన్ జనరేటర్ యాప్ ద్వారా సృష్టించారని తర్వాత తేలింది. నీకూ సగం.. నాకూ సగం! భార్యాభర్తలు అంటే చెరిసగం. అందుకే శివపార్వతులను అర్ధనారీశ్వరుడు అంటాం. ఇంగ్లిష్‌లో బెటర్‌హాఫ్ జాతీయముంది. అదేవిధంగా ఓ జర్మన్ వ్యక్తి భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. తన దగ్గర ఉన్న సంపదనంతా చెరిసగం పంచేశాడు. అలా ఈ కారును కూడా ఇలా సగంసగం పంచేసి.. తనవంతు సగాన్నిఅమ్మకానికి పెట్టిండహో అంటూ ఈ ఫొటో హల్చల్ చేసింది. ఈ ఫొటో నెటిజన్లనే కాదు మీడియాను కూడా పిచ్చోళ్లను చేసింది. ఈ కారును 'ఈబే'లో వేలానికి పెట్టింది నిజమే అయినా దాని వెనుక ఉన్న కట్టుకథ మాత్రం ప్రచారం కోసం తామే సృష్టించామంటూ జర్మన్ బార్ అసిసోయేసన్ తెలిపింది. -
నేపాల్ భూకంప బాధితుల కళ్ళలో... 'రోహాన్ కళ'
అతడిలో కేవలం కళాత్మక హృదయమే కాదు... చలించిపోయే మనస్తత్వం ఉన్నట్టు కూడ కనిపిస్తుంది. అందుకే వెళ్ళింది విహార యాత్రకైనా అక్కడి అందాలకు ముగ్ధుడయ్యాడు. తనకు కనిపించిన అద్భుత ప్రకృతి దృశ్యాలతో పాటు, అక్కడి కట్టడాల సౌందర్యాన్నీ.. కంటిపాపలో చిత్రాలుగా పొందుపరచుకున్నాడు. ఢిల్లీకి చెందిన ఆర్కిటెక్ట్ రోహాన్ పట్నాకర్... నేపాల్ సౌందర్యాన్ని చూసి సంవత్సరం కూడ కాలేదు. ఇంతలో వచ్చిన భూ కంపం ఆ ప్రాంతాన్ని అక్కడి జనాన్ని కకావికలం చేయడం తట్టుకోలేక పోయాడు. తన గుండెల్లో సాక్షాత్కరించిన సౌందర్యాన్నినేపాల్ లో తిరిగి సృష్టించేందుకు తనవంతు కృషి చేస్తున్నాడు. భూకంపంతో తునాతునకలైన అందమైన నేపాల్ చిత్ర పటాన్ని తిరిగి ఆవిష్కరించాలని రోహాన్ ఆత్రుత పడుతున్నాడు. తన ప్రతిభతో కుంచెకు రంగులద్ది.. నేపాల్ లోని అద్భుత కట్టడాలను చిత్రాలుగా తీర్చి దిద్దాడు. భూకంపానికి ముందున్న స్థితికి నేపాల్ ను తేవాలన్నదే ఆశయంగా వాటర్ కలర్స్ తో నేపాల్ లోని సౌందర్యాన్ని, చారిత్రక కట్టడాలను స్కెచ్ లు గా మలచి వాటితో వచ్చిన డబ్బును నేపాల్ రూరల్ ప్రాంతాన్ని తిరిగి నిర్మించేందుకు పాటు పడుతున్నాడు. ''మా కంపెనీ ప్రాజెక్టు పనిమీద నేను నేపాల్ వెళ్ళాను. ఆ పర్యటన నన్ను నేపాల్ లోని అందాలను తిలకించేందుకు అవకాశాన్నిచ్చింది. అలాగే అక్కడి నా కొలీగ్స్ ను కలిసేందుకు, వారి సంప్రదాయ వంటకాలను రుచి చూసేందుకు మంచి సందర్భమైంది. అక్కడి నుంచి తిరిగి వచ్చాక నేను నా ప్రతి జ్ఞాపకాన్నీ నోట్ బుక్ లో డ్రాయింగ్స్ గానూ, అక్షరాలుగాను నింపేశాను.'' అంటాడు రోహాన్. ఏప్రిల్ 2015 లో వచ్చిన నేపాల్ భూకంపం రోహాన్ చూసిన ఎన్నో అందాలను తనలో కలిపేసుకుంది. కొందరు సహోద్యోగుల కుటుంబాలు.. ఇళ్ళతో సహా.. బంధువులనూ కోల్పోయారు. ఒకప్పుడు భూలోక సౌందర్యంగా తాను గుర్తించిన ఆ ప్రాంతం భూకంపంతో శిథిలంగా మారిపోయింది. భూకంపం విషయం తెలిసిన వెంటనే రోహాన్ నేపాల్ లోని తన స్నేహితులతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికప్పుడు ఎటువంటి సమాచారం తెలియలేదు. ''కొన్నాళ్ళ తర్వాత నా స్నేహితులు ఢిల్లీకి తిరిగి వచ్చారు. మేమంతా కలసి నేపాల్ లో భూకంప బాధిత ప్రాంత వాసులకు ఏదో ఒక సహాయం అందించాలని అనుకున్నాం. అందుకోసం విరాళాలను సేకరించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాం. కొన్ని వారాల తర్వాత కఠ్మాండు లోని స్నేహితులతో కూడ మాట్లాడాం. అప్పటికే వారు అక్కడి భూకంప బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభించారు. దీంతో వారికి మరింత సహాయం అందించేందుకు మా ప్రయత్నాలు కొనసాగించాం'' అంటాడు రోహాన్. అయితే ఫండ్స్ ఎలా సేకరించాలన్న ఆలోచన మొదట్లో కాస్త ఆందోళనకు గురిచేసినా... రోహాన్ కు వెంటనే సమాధానం దొరికింది. తనకు ఇష్టమైన కళను విరాళాలు సేకరించేందుకు వినియోగించాలని నిశ్చయించుకున్నాడు. నేపాల్ లోని అద్భుతమైన చిత్రాలకు తన కుంచెతో ప్రాణం పోశాడు. అదే సమయంలో చెన్నై, హైదరాబాద్ లకు చెందిన రోహాన్ స్నేహితులు కూడ పుస్తకాల అట్టలపై డ్రాయింగ్స్ తో రోహాన్ కు సహకారం అందించారు. పోస్ట్ కార్డ్, నోట్ బుక్, ఎ3 సైజుల్లో వేసిన డ్రాయింగ్స్ ఫండ్ కోసం అమ్మకానికి పెట్టారు. 150 నోట్ బుక్స్, 30 ఆర్ట్ ప్రింట్లు, 100 పోస్ట్ కార్డ్ డ్రాయింగ్స్ అమ్మగా వచ్చిన సుమారు లక్ష రూపాయలను నేపాల్ పునర్నిర్మాణానికి అందించారు. రోహాన్ కఠ్మాడు ఆర్కిటెక్ట్ స్నేహితులు ఆ విరాళంతో భూకంపంతో శిథిలమైన పలు సిమెంట్, చెక్క నిర్మాణాల స్థానంలో వెదురుతో ఇళ్ళను నిర్మించి బాధితులకు సహాయ పడ్డారు. నాలుగు రకాల మోడల్ హోమ్స్ కట్టి... బాధితులకు అందించారు. తమలాగే మరెవరైనా నేపాల్ బాధితులకు సహాయం అందించేందుకు తోడ్పడాలని రోహాన్... అతిని మిత్రులు సూచిస్తున్నారు. -
భారత కీర్తిని చాటుతున్న మోదీ
ఒకప్పుడు ఆయన ఛాయ్‌వాలా. నేడు ప్రపంచ లోని పలువురు దేశాధినే తలు ఆయనతో మాట్లాడాలని తహతహలాడుతున్నారు. భారతశక్తిని కొత్త గా పరిచయం చేస్త్తున్న రెం డక్షరాలే-మోదీ. నరేంద్ర మోదీ ఏం చేశారు? ఆయన విదేశాంగ నీతి దేశాన్ని ఆసియా దేశాల్లో అగ్రస్థానంలో నిలిపింది. లుక్ ఈస్ట్ నీతితో దేశ సరిహద్దులను పటిష్టం చేయడం మీద పెట్టిన దృష్టి అద్వితీయం. నేపాల్ భూకంప బాధితుల పట్ల క్షణాల్లో స్పందించిన తీరు అభినందనీయం. 58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏనాడూ మన ఇరుగుపొరు గులతోనే కాదు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజీ, మాల్దీవులు లాంటి దూర దేశాలతోనూ సత్సంబం ధాలకు ప్రయత్నించలేదు. కానీ మోదీ ఆయా దేశాలకు స్నేహహస్తం ఇచ్చారు. ఒక పక్క చైనా మన సరిహద్ద్దు దేశాల్లో పాగా వేసి సవాలు విసురుతోంది. పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, భూటాన్‌లకు ఆర్థిక సాయాలంటూ, రోడ్లూ రైళ్లంటూ వారికి దగ్గరవుతూ భారత్‌ను దూరం చేస్తున్నది. చొచ్చుకువస్త్తున్న చైనాను నిలువరించగలిగే విదేశీ నీతిని యూపీఏ అమలు చేయలేకపోయింది. మూడుగంటల ప్రయాణమే అయినా శ్రీలంక వెళ్లడానికి కాంగ్రెస్ ప్రధానుల కు 30 ఏళ్లు పట్టింది. 8 గంటలు ప్రయా ణిస్తే చేరే ఆస్ట్రేలియా వెళ్లడానికి 42 ఏళ్లు, 50 నిమిషాలలో చేరుకునే నేపాల్‌ను సందర్శిం చడానికి 35 ఏళ్లు పట్టాయి. అమెరికాలోని మ్యాడీ సన్ స్క్వేర్‌లో మోదీ చేసిన ప్రసంగం 120 కోట్ల మంది భారతీయుల చెవుల్లో ఇంకా మార్మోగుతూనే ఉంది. యూఏఈ వెళ్లి అక్కడ ‘భారత మాతకు జై’ అంటూ నినదించాడు. మోదీ మసీదు చూసొచ్చిన వెంటనే ఆ దేశ ప్రధాని మందిరానికి స్థలం కేటా యించారు. భారత్‌లో నాలుగు లక్షల యాభై వేల బిలియన్ డాలర్ల పెట్ట్టుబడులు పెట్టేందుకు షేక్‌లు ముందుకు రావడం వెనుక మోదీ కృషి ఉంది. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? ఆయన ఎలా ఎదిగారు? చిరుప్రాయంలోనే రాష్ట్రీ య స్వయం సేవక్ సంఘ్‌లో చేరడం, దేశానికి ఉపయోగపడే విధంగా జీవితా న్ని మలచుకోవడమే దీని వెనుక ఉన్న సూత్రం. దత్తత కాన్సెప్ట్‌తో ఆయా గ్రా మాల స్వావలంబనకు బాటలు పరిచా రు. స్వచ్ఛ భారత్ అంటూ గాంధీజీ కల లను సాకారం చేసేందుకు కృషి చేస్తు న్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఐక్య రాజ్య సమితి ఘనంగా నిర్వహించేలా చేశారు. దేశంలో బ్యాంక్ ఖాతాలు లేని దాదాపు 50 కోట్ల మందికి జన్‌ధన్ యోజనతో ఖాతాలు తెరిపిం చారు. ప్రమాద బీమా, ప్రధాన మంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన పథకాలను రూ.2 కే అందించారు. ఏడాదికి రూ.330తో జీవిత బీమాతో కుటుంబా లను ఆర్థిక కష్టాల నుంచి విముక్తం చేయాలని సురక్ష యోజన తీసుకొచ్చారు. అసంఘటిత రంగంలోని కోట్లాది మంది శ్రమైకజీవులకు దన్నుగా రూ.12 తోనే అటల్ పెన్షన్ యోజన పథకాన్ని తెచ్చారు. బాలికల చదువుకు బేటీ బచావో... బేటీ పడా వో పథకం కింద సుకన్యా సమృద్ధి యోజన పథ కాన్ని మోదీ ప్రవేశపెట్టారు. ఆడశిశువులను గర్భం లోనే చిదిమేసే విషసంస్కృతికి చరమగీతం పాడా లని ఒక యాచకుడిలా అభ్యర్థిస్తున్నానంటూ చెప్పిన మాట ఆయన అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్నది. పంటనష్టపోయిన రైతులకు ఇప్పుడిస్తున్న పరిహా రాన్ని 50 శాతం పెంచాలని ఎన్డీఏ నిర్ణయించింది. మోదీ బాధ్యతలు చేపట్టాక ప్రజాస్వామ్యబద్ధ రాజకీయాలు మొదలై నాయి. కాంగ్రెస్ పార్టీ ఏలికలు నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులే. సమాజ్‌వాదీ పార్టీ, ఎన్సీపీల పరిస్థితి అంతే. ప్రాంతీయ పార్టీల న్నింటిని వారసులే శాసిస్తున్నారు. మోదీకి నా అనే వారెవరంటే సామాన్యులే. పరిశ్రమలు రావాలనీ, కుటుంబంలో ఒక్కరు సంపాదిస్తూ ఉంటే నలుగురు తినడం కాదనీ, అంతా దేశాభివృద్ధిలో భాగస్వాము లు కావాలనీ చెబుతూ సబ్ కే సాత్ సబ్ కా వికాస్ నినాదాన్ని ఎలుగెత్తారు. అందరి అభివృద్ధే దేశానికి శ్రీరామరక్ష అంటూ సాగుతున్న ప్రధానికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. - వ్యాసకర్త బీజేపీ ఏపీ సమన్వయకర్త పురిఘళ్ల రఘురాం raghuram.bjp@gmail.com -
కొండ చరియలు విరిగి పడి: 26 మంది మృతి
కాట్మాండ్: నేపాల్ కస్కి జిల్లాలో బుధవారం రాత్రి ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 26 మంది మరణించారు. మరో 31 మంది గల్లంతయ్యారని మీడియా గురువారం వెల్లడించింది. జిల్లాలో 27 ఇళ్లు నేలమట్టం అయ్యాయని తెలిపింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని... అలాగే గల్లంతైన వారి కోసం చర్యలు చేపట్టినట్లు నేపాల్ ఆర్మీ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే కొండ చరియలు విరిగిపడిన కారణంగా వంతెనలు కూలిపోయాయని తెలిపారు. దాంతో సహాయక చర్యలకు కొంత మేర ఆటంకం ఏర్పడిందని నేపాల్ ఆర్మీ పేర్కొంది. -
నేపాల్ కోసం సాక్షి స్పెషల్ లైఫ్‌లైన్
-
సాయం కావాలి
-
నేపాల్‌కు వంద కోట్ల డాలర్ల ఆర్థిక సాయం
నేపాల్ పర్యటన సందర్భంగా ప్రకటించిన సుష్మా స్వరాజ్ కఠ్మాండూ: పెను భూకంపంతో అతలాకుతలమైన నేపాల్ పునర్నిర్మాణానికి భారత ప్రభుత్వం వంద కోట్ల డాలర్ల భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. నేపాలీల కన్నీళ్లు తుడిచేందుకు నేపాల్ ప్రభుత్వానికి తాము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేసింది. నేపాల్ రాజధాని కఠ్మాండూలో గురువారం జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ నేపాల్స్ రీకన్స్ట్రక్షన్ సదస్సు సందర్భంగా భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఈ మేరకు ప్రకటన చేశారు. నేపాల్ పునర్నిర్మాణానికి నిధులు రాబట్టేందుకు ఆ దేశ ప్రభుత్వం ఈ సదస్సును ఏర్పాటు చేసింది. ఈ సదస్సుకు భారత ప్రభుత్వం తరఫున సుష్మాస్వరాజ్ హాజరయ్యారు. ఈ సదస్సులో సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ.. వంద కోట్ల డాలర్లలో నాలుగో వంతు మొత్తాన్ని గ్రాంట్‌గా అందిస్తామన్నారు. ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడేలా వచ్చే ఐదేళ్లలో మరో వంద కోట్ల డాలర్లను అందజేయనున్నామని, దీంతో ఈ సాయం రెండు వందల కోట్ల డాలర్లకు చేరుతుందని చెప్పారు. ఈ మొత్తంలో 40 శాతాన్ని గ్రాంట్‌గా అందిచనున్నామని చెప్పారు. -
జూన్ 27న సినీ తారలతో టీ డిన్నర్
‘సాక్షి’ ఆధ్వర్యంలో చారిటీ కార్యక్రమం జూన్ 27న సినీ తారలతో టీ డిన్నర్ వచ్చే మొత్తాన్ని బాధితులకు అందజేయనున్న ‘నావా’ హైదరాబాద్: ఏప్రిల్ 25న నేపాల్‌లో వచ్చిన భూకంపం ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. రెండు నెలలు గడుస్తున్నా అక్కడి పరిస్థితుల్లో మార్పు రాలేదు. చిరు దేశం అంత పెద్ద భూకంపం ధాటికి అన్ని రకాలుగా చితికిపోయింది. అక్కడి ఇళ్లు, స్కూళ్లు, ఆసుపత్రులు శిథిలమయ్యాయి. నేపాల్ దేశానికి ముఖ్య ఆర్థిక వనరైన టూరిజం తగ్గిపోయింది. భూప్రకంపనలు ఇంకా కొనసాగుతుండడమే దీనికి ప్రధాన కారణం. జీవనాధారం లేక ప్రజా జీవితం అగమ్యగోచరంగా మారింది. ప్రకృతి ప్రకోపానికి గురయిన అక్కడి ప్రజలు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. పొరుగు దేశపౌరులుగా నేపాల్ ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యతను అందరం పంచుకుందాం. వీలైనంత సాయమందిద్దాం... సాక్షి మీడియా సామాజిక బాధ్యతతో బాధితులకు సహాయం అందించటానికి అవకాశం కల్పిస్తోంది. నేపాల్ భూకంప బాధితులకు విరాళాలు అందించేందుకు తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌తో కలసి ఒక చారిటీ కార్యక్రమాన్ని చేపట్టింది. వివరాలివి: తాజ్ ఫలక్‌నుమాలో జూన్ 27న జరిగే ఈ కార్యక్రమంలో నటి రెజీనా సహా పలువురు సినీతారలతో కలసి టీ, డిన్నర్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి తగు మొత్తంతో కూడిన డోనర్ పాస్‌లు విక్రయిస్తారు. పాస్‌ల ద్వారా వచ్చే మొత్తాన్ని నేపాల్ బాధితులకు నేపాల్ ఆర్మీ వైవ్స్ అసోసియేషన్(నావా) వారు అందచేయనున్నారు. ఇతర వివరాలకు, డోనర్ పాస్‌ల కోసం 9989613749, 9000913320, 040-66298518 నంబర్లను సంప్రదించవచ్చు. చెక్ ద్వారా తమ విరాళాలను పంపాలనుకునే వారు... నేపాల్ ఆర్మీ వైవ్స్ అసోసియేషన్, ఫ్లాట్ నంబర్ 401, పీఎస్ఆర్ మెన్షన్, హోలీమేరీ బిజినెస్ సూల్ దగ్గర, లీలా నగర్, ధరమ్ కరమ్ రోడ్, అమీర్‌పేట్, హైదరాబాద్... అడ్రస్‌కి పంపించవచ్చు. -
కొండచరియలకు వైద్య దంపతులు బలి
కఠ్మాండు: నేపాల్‌లో ఇద్దరు భారతీయ వైద్య దంపతులు మృత్యువాత పడ్డారు. లుంబినీ జోన్ లో తాము వెళుతున్న కారుపై కొండచరియలు విరిగి పడటంతో ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల వివరాల ప్రకారం డాక్టర్ తరుణ్ దీప్ సింగ్(కంటి వైద్యుడు), అతడి భార్య యశోద కొచ్చర్ (గైనకాలజిస్ట్) బుతావల్ నుంచి పాల్పా వద్ద గల ఆస్పత్రికి వెళుతుండగా బైర్వాడా జిల్లాలోని సిద్ధబాబా ప్రాంతంలో ప్రమాదానికి గురయ్యారు. ఒక్కసారిగా కుప్పపోసినట్లుగా బురద, రాళ్లు వారి కారుపై పడ్డాయి. దీంతో వారిని సమీప ఆస్పత్రికి తరలించినప్పటికీ వారు తీవ్ర గాయాలవల్ల చనిపోయారు. బుధవారం పలుమార్లు నేపాల్ లో భూమి కంపించడం వల్లే కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. -
ఆ భూకంపం ఎవరెస్టును జరిపేసింది
బీజింగ్: నేపాల్ వచ్చిన భూకంపం మాములు భూకంపం కాదని ఇప్పటికే అర్థమైనా అది ఎంత శక్తిమంతమైనదో ఈ విషయం తెలిస్తే ఇట్టే బోధపడుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్టును నేపాల్ భూకంపం ఏకంగా 1.2 సెంటీమీటర్లు జరిపినట్లు చైనాకు చెందిన ఓ సంస్థ వెల్లడించింది. గత ఏప్రిల్ 28న నేపాల్ 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. దీని కారణంగా దాదాపు పదివేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ భూకంపం సంభవించిన తర్వాత మౌంట్ ఎవరెస్టులో వచ్చిన మార్పులపై చైనాలోని జియోలాజికల్ సంస్థ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో ఎవరెస్టు.. నైరుతి దిక్కుకు 1.2 సెంటీ మీటర్లు జరిగినట్లు తెలిసిందని పేర్కొంది. -
నేపాల్ బాధితులకు పీసీబీ ఉద్యోగుల విరాళం
సనత్‌నగర్ (హైదరాబాద్) : నేపాల్ భూకంప బాధితుల సహాయార్థం ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి( పీసీబీ) కార్యాలయ ఉద్యోగులు స్వచ్ఛందంగా విరాళాలు అందజేసి తమ దాతృత్వాన్ని చాటారు. తమ వేతనాల నుంచి కొంత మొత్తాన్ని విరాళంగా అందజేశారు. రూ.1,36,300లను చెక్ రూపంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి బీబీఎస్ ప్రసాద్ రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధికి మంగళవారం అందించారు. -
ఆదరించిన ఊరును ఆదుకున్న నేస్తం
♦ నేపాల్‌లోని ‘టెచో' గ్రామానికి హెచ్‌సీయూ విద్యార్థుల అండ ♦ తాత్కాలిక నివాసాల ఏర్పాటుకు సాయం నేపాల్ భూకంపం.. ప్రతి మనిషిని కదిలించిన, కలచివేసిన ఉపద్రవం. ఈ వైపరీత్యం తర్వాత ఆ దేశాన్ని చూసి ‘ఆయ్యో పాపం’ అనుకున్నవారు ఉన్నారు. ఆదుకునేందుకు ముందుకు వచ్చినవారూ ఉన్నారు. రెండేళ్ల క్రితం చదువులో భాగంగా నేపాల్ వెళ్లిన ఓ హైదరాబాద్ కుర్రాడు తనకు ఆశ్రయమిచ్చిన గ్రామానికి సాయం చేయడానికి ఉద్యమించాడు. స్నేహితుల సాయంతో విరాళాలు సేకరించి భూకంపంలో నేలమట్టమైన ఇళ్ల నిర్మాణానికి ఖర్చు చేశాడు. ఇందుకు తానే స్వయంగా అక్కడకు వెళ్లి ప్రతి రూపాయి బాధితులకు అందేలా చూశాడు. ఆ యువకుడి పేరు ‘సిపాయి సర్వేశ్వర్’. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ ఆంత్రోపాలజీ విద్యార్థి. ఇతడికి స్నేహితులు, వారి స్నేహితులు, ప్రొఫెసర్లు బాసటగా నిలిచారు. ఈ మహా యజ్ఞంలో మరో హెచ్‌సీయూ పీహెచ్డీ విద్యార్థి, బీహార్ వాసి నీలేశ్, ఢిల్లీ జేఎన్‌యూ పీహెచ్డీ విద్యార్థి హైదరాబాద్ వాసి గరిమెళ్ల సురేశ్ పాలుపంచుకున్నారు. - సాక్షి, సిటీబ్యూరో నివాసాల కోసం.. ‘విరాళాల సేకరణ కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో ఫ్లాష్ మాబ్ నిర్వహించాం. భోజ్‌పురి, ఫోక్ సాంగ్స్ పాడాం. నేపాల్ బాధితులకు చేయూతనిచ్చేందుకు హైదరాబాదీల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలా మేం రూ. 5.50 లక్షలు సేకరించాం. (నేపాల్ కరెన్సీలో 8.80 లక్షలు) ఆ డబ్బుతో మే 23న హైదరాబాద్ బస్సులో నేపాల్‌లోని టెచో గ్రామానికి చేరుకున్నాం. అక్కడి హపఫుచ ఆర్గనైజేషన్‌తో కలిసి ఏం చేయాలనేదానిపై చర్చించాం. అక్కడి విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్‌తో కలిసి సర్వే చేస్తే మొత్తం 2543 ఇళ్లు ఉన్న గ్రామంలో 550 ఇళ్లు ధ్వంసమయ్యాయి. సహాయం అందని 230 కుటుంబాలను గుర్తించాం. అక్కడివారికి తిండి, దుస్తులు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఒక్కో టెంట్ కింద రెండు, మూడు కుటుంబాలు ఉంటున్నాయి. వచ్చేది వానాకాలం.. బాధితులు ఉండేందుకు తాత్కాలిక నివాసాలను ఏర్పాటు అవసరం. ఇతర సంస్థలు వెదురు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. బహిరంగ ప్రాంతాల మరమ్మతు కోసం రూ.90 వేలు మినహా మిగతా డబ్బుతో సీజీఐ షీట్స్ కొని తాత్కాలిక నివాసాల నిర్మాణ ం చేపట్టాం. ఇలా ఒక్కో ఇంటికి రూ. 3,434 ఖర్చు చేశాం’ అవి వివరించారు. మళ్లీ వెళ్తాం.. ‘నేపాల్‌లో చేయాల్సిన సహాయక కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. మేం రెండో విడత విరాళాలు సేకరించాలనుకుంటున్నాం. నేపాల్ నుంచి ‘సెవెన్ వండర్స్ బ్యాండ్’ను హైదరాబాద్‌కు రప్పిస్తున్నాం. వీరితో ఇక్కడ షోలు నిర్వహించి వచ్చిన డబ్బుతో అక్కడ సాయం చేస్తాం. నేపాల్ కల్చరల్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు అక్కడి నుంచి చెఫ్‌లను తీసుకొస్తున్నాం. వాటితో వచ్చిన డబ్బుతో టెచో గ్రామ రూపు రేఖలు మార్చుతాం’ అంటూ వివరించాడు సర్వేశ్. ఫేస్బుక్ సాయం.. ఆంత్రోపాలజీలో పీహెచ్డీ చేస్తున్న సర్వేశ్ ఫీల్డ్‌వర్క్‌లో భాగంగా 2013లో నేపాల్‌లోని లలిత్పూర్ జిల్లా ‘టెచో’ గ్రామానికి వెళ్లాడు. దాదాపు ఏడాదిన్నర పాటు అక్కడి ప్రజలతో మమేకమై వారి వారి జీవన విధానం, సమస్యలపై పరిశోధన చేశాడు. ఈ సమయంలో స్థానిక ‘హపఫుచ వలంటరీ యూత్ ఆర్గనైజేషన్’తో పరిచయం ఏర్పడింది. ఇటీవల నేపాల్‌లో భూకంపంలో ఈ గ్రామం కూడా దెబ్బతింది. ఇళ్లు, తిండి లేక ఈ గ్రామ ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీంతో ఈగ్రామానికి చెందిన లెక్చరర్ మహేశ్ ‘మా గ్రామస్తులను ఆదుకోండి’ అని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఇది చదివి చలించిన సర్వేశ్ తాను ఫీల్డ్‌వర్క్ చేసిన ఆ గ్రామానికి చేయూతనివ్వాలనుకున్నాడు. విషయాన్ని ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకున్నాడు. విరాళాల సేకరణకు ఫేస్బుక్లో పేజీ క్రియేట్ చేశాడు. దాదాపు 700 మందికి పైగా సభ్యులుగా చేరి విరాళాల సేకరణలోనూ భాగమయ్యారు. ఫ్రెండ్స్, ఫ్రొఫెసర్లు.. ఇలా అందరూ తమకు తోచిన ఆర్థిక సాయం చేశారు. -
సేవకు సలామ్
మనిషికి ఎలాంటి శారీరక, మానసిక సమస్య ఎదురైనా తలచుకునేది దైవాన్ని.. కలుసుకునేది వైద్యుడిని. అలాంటి వైద్య వృత్తికే వన్నె తెచ్చారు సిటీకి చెందిన యువ డాక్టర్లు. నేపాల్ భూకంపంలో క్షతగాత్రులైనవారికి సేవలు అందించేందుకు ముందుకు రావాలని ‘క్యూరోఫి’ యాప్‌లో పోస్ట్ వచ్చింది. ఇది చూసిన సిటీకి చెందిన ‘ఆకృతి, విశిష్ట, యశ్వంత్’ స్పందించారు. కామినేని ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్న ఆకృతి, నిమ్స్‌లో ఫిజియోథెరపిస్ట్‌గా సేవలందిస్తున్న విశిష్ట, శ్రీకాకుళం జీఎంఎస్ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్న యశ్వంత్ ఇక్కడి నుంచి పయనమయ్యారు. వీరికి భోపాల్ నుంచి ముగ్గురు డాక్టర్లు, ముంబై, ఢిల్లీ నుంచి ఒక్కో వైద్యుడు చేయందించారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్న నేపాల్ ప్రజలకు వైద్య సేవలు అందించారు. అక్కడ తాము ఎదుర్కొన్న అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు ఆకృతి, విశిష్ట, యశ్వంత్. ఆ వివరాలు వారి మాటల్లోనే.. - సాక్షి, సిటీబ్యూరో - నేపాల్ భూకంప ప్రాంతంలో వైద్యశిబిరాలు - ప్రాణాలను పణంగా పెట్టి సిటీ వైద్యుల సేవలు ఇలా మొదలైంది.. ‘మే 6న కాట్మాండ్‌కు బయలుదేరాం. ఏడున అక్కడ మెడికల్ క్యాంప్ పూర్తయింది. మరుసటి రోజు మధ్యాహ్నానికి సింధుపాల్ చౌక్ ప్రాంతానికి చేరుకున్నాం. నేపాల్‌లో ఎక్కడ భూకంపం వచ్చినా ఆది సింధుపాల్ చౌక్ నుంచి మొదలువుతుందని విన్నాం. అక్కడ పరిస్థితి భయానకంగా ఉంది. సమీప ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం. రక్తపు మడుగుల్లో ఉన్నవారిని చూస్తే బాధేసింది. పోలీసులు, నేపాల్ ఆర్మీతో కలిసి క్షతగాత్రులకు వైద్యం అందించాం. అప్పటికే కొండచరియలు విరిగిపడటంతో మెడిసిన్ బ్యాగులను మోసుకుంటూ కొండలపైకి వెళ్లాం. 10,11 తేదీల్లో గ్రామాల్లో మెడికల్ క్యాంప్ చేశాం. ఆ తర్వాత లమసాంగ్ నుంచి 11.5 కిలోమీటర్ల దూరంలో ఉండే నేపాల్, చైనా బార్డర్‌కు బయలుదేరాం. ఈ సమయంలోనే మా కళ్ల ముందే మరోసారి భూకంపం వచ్చి కొండచరియలు విరిగిపడ్డాయి’ సమయం: మే 13 ఉదయం.. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య మరోసారి భూకంపం వస్తుందని ప్రకటించారు. ఆర్మీ అధికారులు వెంటనే కాట్మాండ్ బయలుదేరమన్నారు. లమ్సాంగ్ నుంచి కాట్మాండ్‌కు 2.30 గంటలు పడుతుంది. మధ్యలో అన్నీ కొండలే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎలాగైతేనేం సాయంత్రానికి కాట్మాండ్ చేరుకున్నాం. మరుసటి రోజు అక్కడి పోలీసు అకాడమీలో వైద్య శిబిరం నిర్వహించాం. ఆ రోజు రాత్రికే మమ్మల్ని ఢిల్లీకి పంపించారు. అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నాం. సేవ ముందు మా ప్రాణ భయం మోకరిల్లింది’ అంటూ ముగించారు. క్షణక్షణం భయం భయం.. ‘జంబూ విలేజ్‌కు చేరుకోగానే కొండచరియ విరిగిపడటంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఆ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం భూకంపం వచ్చింది. కొండలు పడిపోయాయి. చాలా మంది చనిపోయారు. జంబూ కొండ దిగువనున్న గంగా నది వద్ద రెండు గంటలు పాటు ఉన్నాం. అప్పటికే సాయంత్రమైంది. మేం వైద్యులమని తెలియగానే జంబూ గ్రామస్తులు సమూహంగా మా వద్దకు వచ్చారు. వారందరికి వైద్యం చేశాం. అప్పటికి ఆర్మీ రోడ్డును క్లియర్ చేసింది. జంబూలోని విరిగిపడిన పెద్ద కొండను పెకలించాలంటే బాంబు పెట్టాలి. అప్పటికే సమయం దాటిపోయింది. దీంతో రోడ్డుపై పడిన కొండ ఎక్కి, దూకాం. రోడ్డు ఇరువైపులా ఉన్న కొండలు ఏ సమయంలోనైనా పడిపోవచ్చనే సమాచారంతో సుమారు ఎనిమిది కిలోమీటర్లు పరుగుపెట్టాం. రాత్రి ఎనిమిది గంటల సమయంలో అటువైపుగా వచ్చిన ఆర్మీ జీపు ఎక్కి లమసాంగ్‌కు వెళ్లాం. అప్పటికే మాకు కేటాయించిన గెస్ట్‌హౌస్ కకావికలమైంది. ఆ రోజు రాత్రంతా కొండ ఊగింది.. ఎవరికీ నిద్ర లేదు. ఇంత భయంలోనూ మా వైద్య సేవలు ఆపలేదు. మేం ఎక్కడ ఉంటే అక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించాం. -
భారత్, నేపాల్‌లో మళ్లీ భూకంపం!
-
భారత్, నేపాల్‌లో మళ్లీ భూకంపం!
భూకంపం వరుసపెట్టి వణికిస్తోంది. నేపాల్‌లో శనివారం సాయంత్రం మరోసారి భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైంది. నేపాల్ భూకంపం ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, సిలిగురిలో కూడా స్వల్ప స్థాయిలోప్రకంపనలు వచ్చాయి. దాంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నేపాల్‌లో భూకంపం కారణంగా ఎంత నష్టం సంభవించిందన్న వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. -
8,460 కు చేరిన మృతుల సంఖ్య
కఠ్మాండు: నేపాల్ భూకంప మృతుల సంఖ్య 8,460 కు చేరింది. ఏప్రిల్ 25న సంభవించడంతో నేపాల్ చిన్నాభిన్నమైంది. 4,571 మంది గాయపడ్డారు. ఇప్పటివరకు 8,399 మృతదేహాలను సంబంధీకులకు అప్పగించినట్టు నేపాల్ హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. మే 12న మరోసారి భూమి కంపించింది. దీంతో మరో 117 మంది ప్రాణాలు కోల్పోగా, 1,700 మంది గాయపడ్డారు. వరుస భూవిలయాలతో నేపాల్ ప్రజలు వణికిపోతున్నారు. -
భూకంప బాధితులకు హన్సిక చేయూత
చెన్నై : నేపాల్‌లో భూకంపం విళయతాండవం సృష్టించిన విషయం తెలిసిందే. ఎనిమిదివేల మంది పైగా మృత్యువాత పడ్డారు. ఎందరో క్షతగాత్రులయ్యారు. మంగళవారం కూడా అక్కడ భూకంపం వచ్చి మరికొందరి ప్రాణాలను బలిగొంది. అలాగే నేపాల్ కోలుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేని పరిస్థితి. అలాంటి నేపాల్ ప్రభుత్వాన్ని ఆదుకోవడానికి పలు దేశాలు సాయం అందిస్తున్నాయి. చాలామంది వ్యక్తిగతంగాను ఆపన్న హస్తం అందిస్తున్నారు. అదే విధంగా నటి హన్సిక నేపాల్ భూకంప బాధితుల సహాయార్థం ఆరు లక్షలు అందించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. తన సేవా నిరతిని నిరూపించుకున్నారు. ఆమె ఇప్పటికే తన పుట్టినరోజు కొక్కరి చొప్పున అనాథ బాలలను దత్తత తీసుకుని వారి సంరక్షణ బాధ్యతను నిర్వహిస్తున్నారు. త్వరలో ముంబైలో వారికి ఒక చక్కని ఆశ్రమాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న హన్సిక సేవానిరతికి జోహార్లు. -
జనం భీతావహం
నేపాల్‌లో క్షణం క్షణం భయం భయం.. తాజా భూకంపంలో 79కి చేరిన మృతులు కఠ్మాండు: నేపాల్‌లో భూ ప్రకోపం కొనసాగుతూనే ఉంది. మంగళవారం నాటి భారీ భూకంపం అనంతరం తీవ్రస్థాయి భూప్రకంపనలు ఆ దేశాన్ని చిగురుటాకులా వణికిస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ 33 ప్రకంపనలు సంభవిస్తే బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ మరో 13 పైగా ప్రకంపనలు సంభవించాయి. భూకంప మృతుల సంఖ్య 79కి పెరిగింది. వరుస భూకంపాలతో ఇళ్లు పేకమేడల్లా కూలి పోతుండటం.. వందలాదిప్రాణాలు గాలిలో కలిసిపోతుండటంతో వేలాది మంది నేపాల్ ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇళ్లలోకి వెళ్లకుండా ప్రాణా లు అరచేతిలో పెట్టుకుని ఆరుబయటే ప్లాస్టిక్ టెంట్లలో జీవిస్తున్నారు. మూడు వారాల క్రితం సంభవించిన ఆ భూకంపం 8,000 మందిని బలి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ విల యం నుంచి కోలుకునేందుకే అష్టకష్టాలు పడుతున్న నేపాల్‌ను మంగళవారం రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతగా నమోదైన భూకంపం మరోసారి దెబ్బతీసింది. దేశంలోని 32 జిల్లాలు తాజా భూకంపం ప్రభావానికి గురయ్యాయని పోలీసులు తెలిపారు. కఠ్మాండుకు ఈశాన్యం గా పర్వతప్రాంతాల్లో ఉన్న మారుమూల జిల్లాలపై ఈ భూకంపం ప్రభావం ఎక్కువగా ఉంది. పెద్ద సంఖ్యలో ఇళ్లు, భవనాలు కుప్పకూలగా.. కొండచరియలు విరిగిపడి పలు ప్రాంతాల్లో దారులు మూసుకుపోయాయి. అమెరికా సైనిక విమానం అదృశ్యం... నేపాల్‌లోని భూకంప బాధితులకు సహాయ సరకులు అందించేందుకు ప్రయాణిస్తున్న అమెరికా సైనిక విమానం జాడ తెలియకుండా పోయింది. ఇందులో ఆరుగురు అమెరికా మెరైన్లు, ఇద్దరు నేపాల్ సైనికులు ఉన్నారు. దీంతో ఈ హెలికాప్టర్, అందులోని సైనికులు కోసం భారీ ఎత్తున గాలింపు చేపట్టారు. కాగా, నేపాల్‌లో తాజా భూకంపం నేపధ్యంలో ఆ దేశ ప్రధాని సుశీల్ కొయిరాలాతో భారత ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. భారత్ నుంచి సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. 21కి పెరిగిన బిహార్ మృతులు పట్నా: మంగళవారం సంభవించిన తీవ్ర భూకంపం వల్ల బిహార్‌లో మృతుల సంఖ్య 21కి, క్షతగాత్రుల సంఖ్య 84కి పెరిగింది. భూకంప బాధితులు, వారి కుటుంబాలకు సహాయం అందించేందుకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ప్రధాన కార్యదర్శి వ్యాస్జీ తెలిపారు. భూకంపం ప్రభావం పట్నా, తూర్పు చంపారన్ జిల్లాలపై ఎక్కువగా ఉంది. రెండు జిల్లాల్లోనూ ముగ్గురు చొప్పున చనిపోయారు. మాధేపురా, పూర్ణియా, వైశాలి, శివాన్, దర్భంగా జిల్లాల్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. సీతామార్హి, ఖగారియా, షేక్‌పురా జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతిచెందారు. -
హడలెత్తిస్తున్న 'ఆప్టర్ షాక్స్'
కఠ్మాండు: నేపాల్ ను భూప్రకంపనలు వణికిస్తూనే ఉన్నాయి. వరుస భూకంపాలతో అతలాకుతలమైన హిమాలయ దేశాన్ని పరాఘాతాలు(ఆప్టర్ షాక్స్) మరింత భయపెడుతున్నాయి. బుధవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య ప్రాంతంలో 5 పరాఘాతాలు సంభవించాయి.వీటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 4గా నమోదైంది.మంగళవారం 7.3 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత ఇప్పటివరకు మొత్తం 36 పరాఘాతాలు నమోదయ్యాయి. కఠ్మాండు కేంద్రంగా ఇవి సంభవించాయి. మరో భూకంపం వస్తుందన్న భయంతో ప్రజలు మంగళవారం రాత్రంతా ఆరుబయటే గడిపారు. ఈ ఉదయం వరకు ఎటువంటి కార్యకలాపాలు సాగలేదు. పాఠశాలలు తెరుచుకోలేదు. రహదారులు నిర్మానుష్యంగా మారాయి. మార్కెట్లు, దుకాణాలు తెరుచుకోలేదు. పరాఘాతాలను స్వల్ప భూకంపాలుగా భావిస్తారు. భూకంపం సంభవించిన తర్వాత వచ్చే స్వల్ప ప్రకంపనలను పరాఘాతాలు అంటారు.