
నేను క్షేమంగానే ఉన్నా: నీలిమ
హైదరాబాద్: నేపాల్ లో చిక్కుకున్న హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నీలిమ సురక్షితంగా ఉంది. తాను క్షేమంగా ఉన్నట్టు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలిపింది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుంచి కిందకు దిగుతున్నట్టు తమ కుమార్తె ఫోన్ లో చెప్పిందని నీలిమ కుటుంబ సభ్యులు తెలిపారు. మరో రెండు రోజుల్లో నీలిమ బృందం రాష్ట్రానికి తిరిగి రావొచ్చని వెల్లడించారు.
ఈనెల 18 వ తేదీన ఎవరెస్ట్ పర్వతారోహణకు వెళ్లిన నీలిమ.. భూకంపం రావడంతో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద చిక్కుకుపోయింది. మరికొన్ని గంటల్లో ఎవరెస్ట్‌పైనున్న టింగ్‌బోచి అనే బేస్‌క్యాంప్‌నకు చేరుకుంటారనగా... భూకంపం సంభవించడంతో నీలిమ బృందం ఆచూకీ గల్లంతయ్యింది. ఈ బృందంలో వివిధ దేశాలకు చెందిన మొత్తం 21 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో కొందరు అమెరికాకు చెందినవారు. నీలిమ క్షేమంగా ఉందన్న తెలియడంతో ఆమె తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.