
భూకంపం నుంచి బయటపడ్డ హీరోయిన్
కాఠ్మండు: నేపాల్ సంభవించిన భారీ భూకంపం నుంచి సినీ నటి కవితా శ్రీనివాసన్ తృటిలో తప్పించుకున్నారు. భూకంపం వచ్చిన రోజు (శనివారం) కవిత కాఠ్మండులో ఉన్నారు. 'మేం మూడో ఫ్లోర్లో ఉన్నాం. భూప్రకంపనల ధాటికి గదిలో అటూఇటూ ఊగిపోయాం. క్షేమంగా బయటపడతామని ఊహించలేదు. రాత్రంతా విద్యుత్, నీరు, ఫోన్ లేకుండా గడిపాం. మేం ప్రాణాలతోనే ఉన్నాం. కష్టకాలంలో అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు' అని కవిత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కాళీచరణ్ అనే తెలుగు సినిమాలో కవిత నటించారు. 2013లో ఈ సినిమా విడుదలైంది. మరో తమిళ చిత్రంలో కూడా నటించారు. అనంతరం వివాహం చేసుకున్న కవిత కొన్ని నెలల క్రితం నేపాల్ వెళ్లింది. కాఠ్మండులో నివసిస్తున్న కవిత.. పెను విపత్తు నుంచి ప్రాణాలతో బయటపడిన తర్వాత తాను క్షేమంగా ఉన్నానంటూ సోషల్ మీడియాలో బంధువులు, స్నేహితులకు తెలియజేశారు.