
విలేకరులతో మాట్లాడుతున్న ఎల్ సీ గోయల్
న్యూఢిల్లీ: నేపాల్ భూకంపం ప్రభావంతో తమ దేశంలో 62 మంది మృతి చెందారని భారత హోంశాఖ కార్యదర్శి ఎల్ సీ గోయల్ తెలిపారు. 259 మంది గాయపడ్డారని చెప్పారు. బీహార్ లో 46, ఉత్తరప్రదేశ్ లో 13, పశ్చిమ బెంగాల్ ఇద్దరు, రాజస్థాన్ లో ఒకరు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. విదేశాంగ కార్యదర్శి ఎస్ జయశంకర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆదివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... సహాయక చర్యల కోసం బీహార్ కు 4, ఉత్తరప్రదేశ్ కు ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తరలించినట్టు చెప్పారు. బీహార్ కు చెందిన ఇద్దరు నేపాల్ లో మృతి చెందారని వెల్లడించారు. భూకంప బాధిత రాష్ట్రాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, అవసరమైన సహాయం చేసేందుకు సర్వదా సిద్ధంగా ఉన్నామని ఎల్ సీ గోయల్ తెలిపారు.