
అంతా క్షణాల్లోనే జరిగిపోయింది!
ఇప్పటికీ వణికిపోతున్న నేపాల్ భూకంప బాధితులు
న్యూఢిల్లీ/చిత్తూరు/గాజువాక/: నేపాల్ భూకంపం నుంచి బయటపడి ఢిల్లీకి చేరుకుంటున్న తెలుగువారు ఆ భయంకర క్షణాలను తలచుకొని ఇప్పటికీ వణికిపోతున్నారు. కళ్ల ముందే తాము ప్రత్యక్ష ప్రళయాన్ని చూశామంటూ భయకంపితులవుతున్నారు. ‘‘అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. చూస్తుండగానే పెద్దపెద్ద భవనాలు కూలిపోయాయి. కరెంటు స్తంభాలు నేలవాలాయి. మేం మా పిల్లలను తీసుకుని భయంతో పరుగులు తీశాం’’ అని చిత్తూరు జిల్లా మదనపల్లెకి చెందిన రమణ ‘సాక్షి’ కి తెలిపారు.
కఠ్మాండులోని ఇండియన్ ఎంబసీ కేంద్రీయ విద్యాలయంలో టీచర్‌గా పనిచేస్తున్న రమణ.. మూడేళ్లుగా అక్కడే ఉంటున్నారు. ‘‘భూకంపం వచ్చిన రోజు మొదట ఏమీ అర్థం కాలేదు. ఇళ్లంతా ఊగిపోయింది. దేవుడి దయవల్లే బయటపడ్డాం’’ అని ఆయన వివరించారు. కాగా, ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన 28 మందిని స్వస్థలాలకు చేర్చినట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భవన్ సిబ్బంది తెలిపారు. ఏపీలోని కడప, తిరుపతి, అమలాపురం,విశాఖపట్నం, తిరుపతికి చెందిన 14 మందిని ఢిల్లీ నుంచి వారి స్వస్థలాలకు పంపారు. మరో 200 మందిని గోరక్‌పుర్ నుంచి రైలు మార్గంలో నేరుగా పంపినట్టు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు తెలిపారు.
నేపాల్ నుంచి ఇప్పటి వరకు 200 మంది తెలుగువారిని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు పంపినట్టు ఆయన చెప్పారు. ఇంకా 300 మందికి పైగా తెలుగువారు నేపాల్‌లో ఉన్నారని, వారిని సాధ్యమైన త్వరగా వెనక్కి తెచ్చే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌కు చెందిన 8 మంది వైద్య విద్యార్థులను, హైదరాబాద్‌లో ఉప్పుగూడకు చెందిన ఐదుగురిని, చార్మినార్ ప్రాంతవాసి, సాయిబాబా ట్రావెల్స్‌కి చెందిన రాజ్‌కుమార్ అనే యువకుణ్ని విమానంలో హైదరాబాద్‌కి పంపినట్టు తెలంగాణ భవన్ అధికారులు పేర్కొన్నారు. కరీంనగర్‌కు చెందిన మరికొందరు యాత్రికులు కఠ్మాండు ఎయిర్‌పోర్టులో ఉన్నారని, ఈ రాత్రికి వారు ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉందని వివరించారు. తెలుగువారందరినీ సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. నేపాల్ నుంచి ఢిల్లీకి చేరుకున్న భూకంప బాధితులను సోమవారం ఆయన పరామర్శించారు.
ఆ విద్యార్థులు క్షేమం..: నేపాల్‌లోని భరత్‌పూర్‌లోని కాలే జీ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (సీఎంఎస్)లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు క్షేమంగా ఉన్నారు. కళాశాలలో మొత్తం 300 మంది విద్యార్థులు చదువుతుండగా తెలుగు రాష్ట్రాలకు చెందినవారు 72 మంది ఉన్నారు. కఠ్మాండుకు 100 కిలోమీటర్ల దూరంలో ఈ కళాశాల ఉంది. శనివారం నాటి భూకంపానికి కాలేజీ గోడలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో విద్యార్థులు సమీపంలోని ఓ దేవాలయంలో తలదాచుకొన్నారు. కాలేజీ యాజమాన్యం బస్సు ద్వారా విద్యార్థులను గోరఖ్‌పూర్ వరకు పంపింది. అక్కడ్నుంచి యశ్వంత్‌పూర్ రైలు ద్వారా వీరు మంగళవారం సాయంత్రానికి హైదరాబాద్ చేరుకోనున్నారు.