
నీలిమా.. నీవెక్కడ!!
సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోన్న పూదోట నీలిమకు సాహస క్రీడలంటే ఆసక్తి. అదే ఆమెను హిమాలయాలవైపు నడిపించింది. ఓ అంతర్జాతీయ సంస్థ ప్రపంచం నలుమూలల నుంచి 21 మంది పర్వతారోహకుల్నిఎవరెస్ట్ యాత్రకు తీసుకెళ్లింది. ఆ బృందంలోకి ఎంపికైన సాహస మహిళలు ముగ్గురంటే ముగ్గురే. అందులో హైదరాబాద్కు చెందిన నీలిమ ఒకరు.
నేపాల్ మీదుగా హిమాలయాల్లోకి వెళ్లాలనుకున్నఆమె ఏప్రిల్ 21న కాఠ్మండుకు వెళ్లారు. శనివారం భూకంపం సంభవించిన తర్వాతనుంచి నీలిమ బృందం జాడలేకుండా పోయింది. భూకంప తీవ్రతకు ఎవరెస్ట్ శిఖరం వద్ద మంచు చరియలు విరిగిపడి 18 మంది మృతిచెందిన నేపథ్యంలో నీలిమ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటుచేసిన హెల్స్ లైన్ల ద్వారా నీలిమ క్షేమ సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేశారు.
అయితే శనివారం బెంగుళూరు నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి 'హిమాలయ ప్రాంతంలోని టింపోచె అనే గ్రామంలో నీలిమ బృందం చిక్కుకుందని చెప్పినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆ గ్రామంలో ఎలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థ లేకపోవడంతో ప్రత్యామ్నయ మార్గాల ద్వారానైనా నీలిమ తన జాడను కుటుంబ సభ్యులకు చేరవేసే ప్రయత్నం చేసి ఉంటారని అంతా భావిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమ కూతుర్ని కాపాడాలని, వీలైనంత త్వరగా భారత్కు రప్పించాలని అభ్యర్థిస్తున్నారు.