
భూకంపం భయంతో డేరాలు వేసుకుని ఆరుబయట నిద్రిస్తున్న నేపాలీలు
కఠ్మాండు: నేపాల్ ను భూప్రకంపనలు వణికిస్తూనే ఉన్నాయి. వరుస భూకంపాలతో అతలాకుతలమైన హిమాలయ దేశాన్ని పరాఘాతాలు(ఆప్టర్ షాక్స్) మరింత భయపెడుతున్నాయి. బుధవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య ప్రాంతంలో 5 పరాఘాతాలు సంభవించాయి.వీటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 4గా నమోదైంది.మంగళవారం 7.3 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత ఇప్పటివరకు మొత్తం 36 పరాఘాతాలు నమోదయ్యాయి. కఠ్మాండు కేంద్రంగా ఇవి సంభవించాయి.
మరో భూకంపం వస్తుందన్న భయంతో ప్రజలు మంగళవారం రాత్రంతా ఆరుబయటే గడిపారు. ఈ ఉదయం వరకు ఎటువంటి కార్యకలాపాలు సాగలేదు. పాఠశాలలు తెరుచుకోలేదు. రహదారులు నిర్మానుష్యంగా మారాయి. మార్కెట్లు, దుకాణాలు తెరుచుకోలేదు. పరాఘాతాలను స్వల్ప భూకంపాలుగా భావిస్తారు. భూకంపం సంభవించిన తర్వాత వచ్చే స్వల్ప ప్రకంపనలను పరాఘాతాలు అంటారు.