
పాపఫలమే భూకంపమన్న మన గాంధీ
న్యూఢిల్లీ: భీకర భూకంపంతో కుప్పకూలిన కఠ్మాండులో సరైన సహాయక చర్యలు అందక అక్కడి ప్రజలు అలమటిస్తుంటే భారత్‌లో మాత్రం భూకంపానికి మత విశ్వాసాలకు ముడిపెడుతూ మత ఛాందసవాదులు పెను భూకంపాన్ని సృష్టిస్తున్నారు. రాహుల్ గాంధీ కేదార్‌నాథ్ సందర్శించడం వల్లనే భూకంపం వచ్చిందని విశ్వహిందూ పరిషద్ కార్యకర్త సాధ్వీ ప్రచీ ఆరోపించగా, బీజేపీ ఎంపీ సాక్షీ మహరాజ్ మరో అడుగు ముందుకేసి రాహుల్ గాంధీ ‘మాంసం’తినడం వల్లనే భూకంపం వచ్చిందని తీర్మానించారు.
ప్రపంచంలోనే ఏకైక హిందూ దేశం నేపాల్ అని, క్రైస్తవ మిషనరీలను ఆ భూభాగంతో పెరిగిపోతుండడం వల్లనే భూకంపం వచ్చిందని ‘ఇండియా ఫ్యాక్ట్స్’ చీఫ్ ఎడిటర్ సందీప్ బాలకృష్ణ వ్యాఖ్యానించారు. మోకాలుకు బోడిగుండుకు ముడిపెట్టే ఇలాంటి రాజకీయాలు భారత్‌కు ఇప్పుడే కొత్త కాదు. ఎనిమిది దశాబ్దాలుగా కొనసాగుతున్నవే. 1934లో పెను భూకంపం నేపాల్‌తోపాటు బీహార్‌ను తీవ్రంగా దెబ్బతీసినప్పుడు సాక్షాత్తు మన జాతిపిత మహాత్మ గాంధీయే ఇలాంటి రాజకీయాలకు తెరతీశారు. హరిజనులను అంటరానివారిగా చూస్తూ పాపం మూటకట్టుకున్నందుకే ఆ భగవంతుడు బీహార్‌కు ఈ విధంగా శిక్ష విధించారని ఆ భూకంపంపై ఆయన ఆనాడు వ్యాఖ్యలు చేశారు.
గాంధీకి ‘మహాత్మా’అని బిరుదును తగిలించిన గురుదేవ్ రవీంద్రనాథ్ టాగూరే ఆయన వ్యాఖ్యలతో విభేదించారు. అప్పుడు వారిద్దరి మధ్య కొనసాగిన ఉత్తరప్రత్యుత్తరాలు బహిరంగ చర్చకు దారి తీశాయి. గాంధీ వ్యాఖ్యలు ఖండిస్తూ టాగూర్ రాసిన లేఖను గాంధీ సంపాదకత్వంలో వెలువడుతున్న ‘హరిజన్’ పత్రికలో ప్రచురించాలని కూడా టాగూర్ కోరారు. ఆయన కోరిక మేరకు గాంధీజీ ‘హరిజన్’ పత్రికలో ఆ లేఖను ప్రచురించారు. ‘ నైతిక విలువలకు, భూకంపాలకు ముడిపెడుతున్న మీ అహేతుక వ్యాఖ్యలను చూసి దిగ్భ్రాంతి చెందాను. ఇవి ప్రజల్లో మూఢ విశ్వాసాలను మరింత పెంచేందుకు దోహదపడతాయి’ అని టాగూర్ ఆ లేఖలో వ్యాఖ్యానించారు.
ఆ లేఖకు గాంధీ సమాధానమిస్తూ ‘నేను భగవంతుడి విశ్వసిస్తా. అలా అని ఆయనెక్కడున్నాడో నిరూపించమంటే నిరూపించలేదు. భూకంపాలకు శాస్రవిజ్ఞాన కారణాలేమిటో కూడా నాకు తెలియవు. బీహార్ ప్రజలు, హరిజనులను అంటరానివారుగా చూసినందుకే ఆ భగవంతుడు వారికా శిక్ష విధించారన్నది నా విశ్వాసం’ గాంధీజీ వ్యాఖ్యానించారు. గాంధీజీ నాడు అర్థంలేని వ్యాఖ్యలు చేసినా వాటి వెనుకనున్న ఆయన సదుద్దేశాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ నేడు శాస్త్ర విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా అహేతుక ఆరోపణలు, వ్యాఖ్యలు చేస్తున్న మత ఛాందసవాదుల ఉద్దేశాలనే లోతుగా తరచి చూడాల్సిన అవసరం ఉంది.