
భూకంప బాధితులకు హన్సిక చేయూత
చెన్నై : నేపాల్‌లో భూకంపం విళయతాండవం సృష్టించిన విషయం తెలిసిందే. ఎనిమిదివేల మంది పైగా మృత్యువాత పడ్డారు. ఎందరో క్షతగాత్రులయ్యారు. మంగళవారం కూడా అక్కడ భూకంపం వచ్చి మరికొందరి ప్రాణాలను బలిగొంది. అలాగే నేపాల్ కోలుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేని పరిస్థితి. అలాంటి నేపాల్ ప్రభుత్వాన్ని ఆదుకోవడానికి పలు దేశాలు సాయం అందిస్తున్నాయి.
చాలామంది వ్యక్తిగతంగాను ఆపన్న హస్తం అందిస్తున్నారు. అదే విధంగా నటి హన్సిక నేపాల్ భూకంప బాధితుల సహాయార్థం ఆరు లక్షలు అందించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. తన సేవా నిరతిని నిరూపించుకున్నారు. ఆమె ఇప్పటికే తన పుట్టినరోజు కొక్కరి చొప్పున అనాథ బాలలను దత్తత తీసుకుని వారి సంరక్షణ బాధ్యతను నిర్వహిస్తున్నారు. త్వరలో ముంబైలో వారికి ఒక చక్కని ఆశ్రమాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న హన్సిక సేవానిరతికి జోహార్లు.