మాంసాహారం పంపించిన వివాదంలో పాక్
కఠ్మాండు: సాయం చేసే విషయంలోనూ పాకిస్థాన్ వివాదంలోకి ఎక్కింది. అసలే భారీ భూకంపం సంభవించి పుట్టెడు దుఃఖంలో ఉన్న నేపాల్ ఉండగా అత్యధికంగా హిందువుల జనాభా ఉన్న ఆ దేశానికి పాక్ సాయంపేరిట భారీ మొత్తంలో మసాల దట్టించిన మాంసాహారాన్ని పంపించి వార్తల్లో నిలిచింది. దీనిపై చాలామంది నిరసనలు వ్యక్తం చేస్తున్నట్లు ది డెయిలీ మెయిల్ వెల్లడించింది. హిందువుల జనాభా ఎక్కువగా ఉన్న నేపాల్లో గోవులను పవిత్రమైనవిగా భావిస్తారు. గోవధను కొన్ని మత సంఘాలు ఒప్పుకోవు కూడా. రిపబ్లిక్ రాజ్యంగా అవతరించే వరకు కూడా ప్రపంచంలో ఏకైక హిందు దేశం కూడా అదే.
అలాంటిది ప్రస్తుతం పాక్ చేసిన ఈ చర్య కారణంగాసార్క్ దేశాలమధ్య ఓ చర్చకు తావిచ్చి వివాదం నెలకొనే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. వైద్య సేవలు అందించేందుకు వెళ్లి ప్రస్తుతం బిర్ అనే ఆస్పత్రిలో నేపాల్ వారికి చికిత్స చేస్తున్న భారతీయ వైద్యులు ఈ విషయంపై మాట్లాడుతూ మంగళవారం పాక్ పంపించిన ఆహార పదార్థాల్లో బీఫ్ మసాల ప్యాకెట్లు ఉన్నాయని చెప్పారు. వాటిని తాము ముట్టుకోలేదని, ప్రారంభంలో అది తెలియని స్థానికులు తీసుకున్నా తర్వాత తెలుసుకొని పక్కన పడేశారని చెప్పారు. కాగా, ఈ విషయాన్ని ఇప్పుడప్పుడే అంతగా చర్చించకపోయినప్పటికీ తర్వాత జరిగే ద్వైపాక్షిక చర్చల సమయంలో నేపాల్ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.