నేపాలీ మహిళ ప్రాణాలు కాపాడిన భారతీయులు
కఠ్మాండు: భూకంప శిథిలాల కింద చిక్కుకున్న ఓ నేపాలీ మహిళకు భారతీయులు ఊపిరి పోశారు. రెండు రోజు పాటు చావుబతుకుల్లో కొట్టుమిట్టాడిన నేపాలీ మహిళను భారతీయులతో కూడిన సహాయక బృందం కాపాడింది. కఠ్మాండులోని మహరాజ్ గంజ్ ప్రాంతంలోని బసుంధరలో ఐదు అంతస్థుల భవనం కూలిపోవడంతో సునీత సితాలా అనే మహిళ శిథిలాల కింద చిక్కుకుపోయింది. ఆమె భర్త, పిల్లలు ఆరు బయటే ఉండడంతో వారు ప్రాణాలు దక్కించుకున్నారు.
శిథిలాల కింద చిక్కుకున్న సునీతను రెండు రోజుల తర్వాత భారతీయుల బృందం రక్షించింది. మరో లోకంలోకి వచ్చినట్టుగా ఉందని శిథిలాల నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆమె వ్యాఖ్యానించింది. తాను ఇంట్లో గిన్నెలు తోముతుండగా ఒక్కసారిగా కుదేలయిందని, దీంతో తప్పించుకోవడానికి వీల్లేకపోయిందని తెలిపింది. ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక పాఠశాలలో పునరావాసం పొందుతోంది.