రాజధాని వీధుల్లో ఆ విద్యార్థులు
న్యూఢిల్లీ: వారంతా నేపాల్ విద్యార్థులు. హాయిగా చదువుకుని సాయం కాలంలో స్నేహితులతో కలిసి సరదాగా గడిపేవారు. కానీ. ఇప్పుడు మాత్రం భారత రాజధాని వీధుల్లో కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నారు. ఎందుకని అనుకుంటున్నారా.. భారీ భూకంపం పంజా విసరడంతో సర్వం కోల్పోయి విలవిళ్లాడుతున్న తమవారికి సాయం చేసేందుకు. ఉదయం చదువుకుని సాయంత్రం పూట దాతృత్వ విరాళాలు సేకరించేందుకు ఢిల్లీ నగర వీధులను చుట్టేస్తున్నారు.
గత శనివారం భారీ భూకంపం సంభవించి నేపాల్ భారీ స్థాయిలో నష్టాన్ని చవి చూసిన విషయం తెలిసిందే. దాని దెబ్బకి అక్కడి ప్రజల గూడు చెదిరి గుండెపగిలి చివరికి కూడు కూడా కరువైంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలు సాయం చేస్తున్నట్లుగానే తమవారిని ఆదుకునేందుకు తమ వంతుగా ఢిల్లీలోని ఓ కాలేజీలో చార్టెడ్ అకౌంటెంట్ విద్యను అభ్యసిస్తున్న ప్రజ్వల్ బాస్నెట్ అనే విద్యార్ధి మరో ఆరుగురి సాయంతో ఓ గ్రూపుగా ఏర్పడి మొత్తం 500 మంది విద్యార్థులను స్వచ్ఛందంగా చేర్చుకొని విరాళాలు నగదు రూపంలో వస్తువుల రూపంలో, ఆహార పదార్థాల రూపంలో సేకరిస్తున్నారు. ఇప్పటికే మొదటి దఫా సాయాన్ని అందించారు కూడా.