
'ప్రాణాలనేవి ఎక్కడున్నా పోతాయి'
న్యూఢిల్లీ: భూకంప విధ్వంసం కళ్లారా చూసినప్పటికీ ఎవరెస్ట్ ఎక్కాలని ఆశ ఇంకా ఉందని హైదరాబాద్కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నీలిమ తెలిపారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి వెళ్లి భూకంపంలో చిక్కున్న నీలిమా బృందం శుక్రవారం న్యూఢిల్లీ చేరుకుంది. నీలిమ సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. భూకంపం వచ్చినప్పుడు ఎవరెస్ట్పై 4700 అడుగుల ఎత్తులో ఉన్నామని వెల్లడించింది. అయితే భూకంపం వల్ల తాము చేరుకోవాల్సిన బేస్ క్యాంప్ ధ్వంసమైందని పేర్కొంది.
పెద్ద ఎత్తున మంచు చరియలు విరిగిపడ్డాయని చెప్పారు. అదృష్టం కొద్ది మే బేస్ క్యాంపునకు కొద్ది దూరంలో ఉండటం వల్ల ప్రాణాలతో బయటపడ్డామన్నారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఎవరెస్ట్ నుంచి కిందకి దిగామని చెప్పారు. అనంతరం అక్కడే ఉన్న ఎయిర్ఫోర్స్ వారు తమ బృందాన్ని కాఠ్మండ్ చేర్చారని ఆమె వివరించారు. ప్రాణాలు అనేవి ఎక్కడున్న పోతాయని... అయితే తన సాహస యాత్రను కొనసాగించి...ఈ సారి ఎవరెస్ట్ ఎక్కి తీరుతానని నీలిమ స్పష్టం చేశారు. ఈనెల 18 వ తేదీన ఎవరెస్ట్ పర్వతారోహణకు వెళ్లిన నీలిమ.. మరికొన్ని గంటల్లో ఎవరెస్ట్‌పైనున్న టింగ్‌బోచి అనే బేస్‌క్యాంప్‌నకు చేరుకుంటారనగా... భూకంపం సంభవించడంతో బేస్ క్యాంప్ వద్ద చిక్కుకున్న సంగతి తెలిసిందే.