
'ఎటకారం' నటుడు విజయ్ మృతి
కఠ్మాండు: నేపాల్ భూకంపంలో వర్థమాన నటుడు,నృత్య దర్శకుడు (25) విజయ్ దుర్మరణం చెందాడు. ఎటకారం చిత్రం షూటింగ్ ముగించుకుని వీరు తిరిగి వస్తుండగా భూకంపం వచ్చింది. దాంతో వీరు ప్రయాణిస్తున్న కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో విజయ్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడి స్వస్థలం గుంటూరు జిల్లా బాపట్ల. నిత్యపూజ కంబైన్స్ పతాకంపై వీరేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎటకారం' చిత్రానికి సంబంధించి పాటల షూటింగ్‌కోసం శుక్రవారం నేపాల్ వెళ్లిన యూనిట్ సభ్యులు అక్కడ చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.
ఓ పాట సన్నివేశాల చిత్రీకరణ సాగుతుండగా ప్రకంపనలు రావడంతో వెంటనే అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు వెళ్లడంతో ప్రమాదంనుంచి బయటపడ్డామని యూనిట్ సభ్యులు శనివారం రాత్రి ఇక్కడకు సమాచారమిచ్చారు. కాగా భూకంపం వచ్చిన ప్రాంతానికి పది కిలోమీటర్ల దూరంలోనే వీరి షూటింగ్ కొనసాగింది. కఠ్మాండు వెళ్లినవారిలో హీరో దినేష్, చిత్ర నిర్మాతలు రమేష్ చందు, కిషన్, దర్శకుడు రవీందర్ రెడ్డి, విజయ్ సహా 20మంది ఉన్నారు. కాగా మిగతా చిత్ర యూనిట్ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు విజయ్ మృతదేహాన్ని భారత్కు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక విజయ్ మృతితో అతని కుటుంబంతో పాటు బాపట్లలో విషాదం నెలకొంది.